ఫామ్‌హౌస్‌ కోసమే ‘కాళేశ్వరం’

ABN , First Publish Date - 2022-08-17T05:38:15+05:30 IST

కాళేశ్వరం నుంచి సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు నీటిని తరలించుకోవడానికి పైపులైన్‌ వేసుకున్నారని, అందుకే ప్రాజెక్టు నిర్మాణం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది.

ఫామ్‌హౌస్‌ కోసమే ‘కాళేశ్వరం’
పాలకుర్తి రాజీవ్‌ చౌరస్తాలో మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌

నీటి తరలింపు కోసమే ప్రాజెక్టు నిర్మాణం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
పాలకుర్తిలో ప్రజా సంగ్రామ యాత్ర


పాలకుర్తి, ఆగస్టు 16 : కాళేశ్వరం నుంచి సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు నీటిని తరలించుకోవడానికి పైపులైన్‌ వేసుకున్నారని, అందుకే ప్రాజెక్టు నిర్మాణం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ముందుగా మాజీ ప్రధానమంత్రి, అటల్‌ బిహారి వాజ్‌పాయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.

విస్నూరు బస్‌స్టేజీ వద్ద బీజేపీ జెండాను బండి సంజయ్‌ ఆవిష్కరించారు. తర్వాత పాదయాత్ర పాలకుర్తికి కొనసాగింది. ఈ సందర్భంగా రాజీవ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగీ, ఠానునాయక్‌లు పోరాడిన నేలపై నిజాం వారసుడిగా కేసీఆర్‌ పాలన ఇక కొనసాగదని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ఈ పాలనను అంతమొందించేందుకు బీజేపీ శ్రేణులు రాముడి అవతారం ఎత్తాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.40వేల కోట్లు మంజూరు చేసిందని, ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని పథకాలకు ఇతోధిక సహాయం అందచేస్తోందని అన్నారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ టిల్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగమని చెప్పి, ఆయన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలోనే రూ.వందల కోట్లు దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో రూ.1.30లక్షల కోట్లు ఖర్చు చేశారని బండి సంజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నిజాంను మరిపించేలా కేసీఆర్‌ పాలన ఉందని, ఆయన ఎనిమిదో నిజాంలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా జరపడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాం వారసులైన ఎంఐఎం పార్టీకి భయపడే అధికారికంగా నిర్వహించడంలేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్లను ప్రధాని దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేయకుండా నట్టేట ముంచారని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి, ఎంత మందికి వచ్చిందని ప్రశ్నించారు. నాడు రజాకార్లను తరిమికొట్టిన గడ్డపై వచ్చేఎన్నికల్లో నిజాం వారసుడైన కేసీఆర్‌ను కూడా తరిమికొట్లాని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గ కేంద్రంలో కనీసం జూనియర్‌, డిగ్రీ కళాశాలలు కూడా మంజూరు చేయలేదని బండి సంజయ్‌ విమర్శించారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు పనులు చేపట్టి పదేళ్లవుతున్నా ఇంకా పూర్తి చేయకపోవడం అవివేకమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురేస్తామని అన్నారు. కాగా,  ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా దారివెంట ఉన్న కూలీలతో బండి సంజయ్‌ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశమంత్‌రెడ్డి, చాడ సురే్‌షరెడ్డి, మనోహర్‌రెడ్డి, రావు పద్మ, ధర్మారావు, కేఎల్‌ఎన్‌రెడ్డి, బొడిగె శోభ,  మహేందర్‌, మారం రవి, శ్రీనివా్‌సరెడ్డి, కమ్మగాని శ్రీకాంత్‌, రాంచంద్రారావు తదితరులున్నారు.

సీపీకి సిగ్గుందా?

శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన వరంగల్‌ సీపీ తరుణ్‌జోషికి సిగ్గుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. పార్టీల మధ్య గొడవలు జరిగితే పర్యవేక్షించాల్సిందిపోయి.. కొద్దిమంది సిబ్బందిని పెడితే సరిపోతుందా.. అన్నారు. పాలకుర్తిలో బహిరంగసభ జరగకుండా దుకాణాలు బంద్‌ చేయమని పోలీసులను ఆదేశించడం ఏమిటని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మీద ప్రేముంటే ఆ పార్టీ కండువా కప్పుకోవచ్చని సలహా ఇచ్చారు. ఆరు నెలల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సంజయ్‌ జోస్యం చెప్పారు.

బీజేపీ నేతపై దాడి
పరకాలలో టీఆర్‌ఎస్‌ నాయకుల చర్య
దాడి ని నిరసిస్తూ బీజేపీ శ్రేణుల ధర్నా, రాస్తారోకో


పరకాల, ఆగస్టు 16: హనుమకొండ జిల్లా పరకాలలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్‌పై దాడి జరిగింది. గురుప్రసాద్‌ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఏకు రాజు, బొచ్చు జెమిని, ఏకుసుభా్‌షలు వాహనం ఆపి దాడిచేశారు. దీంతో అస్వస్థతకు గురైన గురుప్రసాద్‌ను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంలో వైద్యుల సలహా మేరకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.  విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఏనుగు రాకే్‌షరెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌తో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు పరకాలకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ డౌన్‌ డౌన్‌, ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌, పోలీసుల తీరు నశించాలంటూ నినాదాలు చేశారు. ఏసీపీ శివరామయ్య, సీఐ కిషన్‌, ఎస్సై ప్రశాంత్‌బాబులు బీజేపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి
కాచం గురుప్రసాద్‌పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్రీదేవి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ ఏకు రాజు, ఏకు సుభాష్‌, బొచ్చు జెమినితో పాటు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, వారిపై చట్టపరమైన  చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ విషయంపై సీఐ కిషన్‌ను వివరాణ కోరగా తాగిన మైకంలో దాడికి చేశారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.





Updated Date - 2022-08-17T05:38:15+05:30 IST