అనంతపురం జిల్లా: చింతమనేని వ్యవహారం మరిచిపోకముందే మరో టీడీపీ నేతపై కేసు నమోదయింది. మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులుపై అనంతపురం జిల్లా, బొమ్మనహళ్లి పోలీసులు కేసు పెట్టారు. పెట్రో ధరలు పెంపునకు నిరసనగా కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. కాల్వతోపాటు 151 మంది టీడీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్వపై బొమ్మనహళ్లి ఎస్ఐ రమణారెడ్డి సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంపై కేసులు పెట్టడమే పని అని, అంతకుమించి ఇంకేమీలేదని కాల్వ ఎద్దేవా చేశారు. ఉద్యమాలను ఎలా అణచివేయాలో చూస్తోందని, సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయడంలేదని ఆరోపించారు. పోలీసులు వచ్చినప్పుడు తనకు డబుల్ మాస్క్ ఉందని, పోలీసులకు సింగిల్ మాస్క్ ఉందన్నారు. అధికారం ఉందని ఏం చెసినా చెల్లుబాటు అవుతుందనే నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.