కళారం.. శక్తిస్వరూపం

ABN , First Publish Date - 2021-10-13T06:07:02+05:30 IST

సరా సందర్భంగా అనేక ఆచారాలు, సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి.

కళారం.. శక్తిస్వరూపం
కళారానికి పూజలు చేస్తున్న మహిళలు

కాళిక దర్శనం.. కామితార్థదాయకం

రాష్ట్రంలో ఒంగోలుకే ప్రత్యేకం కళారాల జాతర

వందేళ్లుగా కొనసాగుతున్న ఆచారం

నేడు, రేపు నగరంలో ఉత్సవం 

ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 12: దసరా సందర్భంగా అనేక ఆచారాలు, సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. విజయవాడలో భేతాళ నృత్యం, వీరవాసంలో ఏనుగు సంబరాలు, విజయనగరంలో సిరిమాను ఉత్సవం, వీపనగండ్లలో రాళ్లయుద్ధం, బందరులో శక్తిపటాల ఊరేగింపు వంటివి దసరా సందర్భంగా నిర్వహిస్తుంటారు. అయితే దేశంలో దసరా ఉత్సవాలకు పెట్టింది పేరైన కోల్‌కతా తర్వాత ఒక్క ఒంగోలు నగరంలోనే ప్రత్యేకంగా అమ్మవారి ‘కళారాల’ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. 


అష్టమి, నవమి రోజుల్లో..

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మ వారిని వివిధ దేవాల యాల్లో వివిధ రూపాల్లో పూజిస్తారు. అయితే అష్టమి, నవమి రోజుల్లో ఈ కళారాల ఊరేగింపు భారీస్థాయిలో జరుగుతుంది. నగరంలో మొత్తం ఆరు అమ్మవారి కళారాలు ఉన్నాయి. కేశవస్వామిపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో మహిషాసురమర్ధని కళారం, అంకమ్మపాలెం కాళికాఅమ్మవారి కళారం, బాలాజీరావుపేట కనకదుర్గ కళారం, బీవీఎస్‌ హాలు దగ్గర ఉన్న నరసింహస్వామి కళారం, గంటాపాలెంలోని పార్వతి అమ్మవారి కళారాలు ప్రతి సంవత్సరం జాతరలో పాలుపంచుకుంటాయి. అష్టమి రోజున మూడు, నవమి రోజున మూడు కళారాలను నగరంలో మేళతాళాలు, డప్పువాయిద్యాలు, వివిధ రకాల వేషధారణలు, నృత్యాలతో ఊరేగింపు చేస్తారు. ఈ విధంగా ఆయా దేవాలయాల దగ్గర నుంచి రాత్రి 12 గంటల ప్రాంతంలో బయల్దేరిన కళారం ఊరేగింపు తెల్లవారుజామున 5.30కు మస్తాన్‌దర్గా ప్రాంతానికి చేరుకుంటుంది. అంటే అక్కడ మూడు కళారాలు ఆ సమయానికి కలుస్తాయన్నమాట. ఒక దేవస్థానికి చెందిన ప్రతినిధులు మరొక దేవస్థానానికి చెందిన కళారానికి మంగళహారతులు ఇస్తారు. ఇక అక్కడ దాదాపు రెండు గంటలపాటు సాగే రాక్షస సంహారఘట్టం అద్భుతం. 


శక్తి స్వరూపాలే కళాకారులు

కళారం అంటే శక్తిస్వరూపం, బృహత్తర ముఖాకృతి. అందుకే అమ్మవారి అవతారాల్లో తీక్షణశక్తి రూపాలైన మహిషాసురమర్దిని, కాళికాదేవి, కనకదుర్గ, బాలత్రిపురసుందరి, పార్వతిదేవిలకు ఈ కళారాలు ఉంటాయి. వీరందరికీ సోదరునిగా చెప్పబడే పురుషశక్తి రూపం ‘నరసింహస్వామి’. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగానే ఈ కళారాలకు ఆయా దేవస్థాన నిర్వాహకులు అలంకరణ చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు ఎంతో నిష్టతో  కళారాలను పూజిస్తారు. బుధ, గురువారాల్లో నగరంలో జరిగే కళారాల ఊరేగింపునకు అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.  




Updated Date - 2021-10-13T06:07:02+05:30 IST