అది హీరో మోహన్‌ లాల్‌ కోరిక: దర్శకుడు ప్రియదర్శన్

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ‘మరైక్కాయర్‌ అరబిక్‌ కడలిన్‌ సింగమ్‌’ అనే చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడం ఆనందంగా ఉందని ప్రముఖ నిర్మాత, వి క్రియేషన్స్‌ అధినేత కలైపులి ఎస్‌. థాను వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ తదితర వివరాలను చిత్ర బృందం మీడియా సమావేశంలో వెల్లడించింది. 


ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.థాను.. మాట్లాడుతూ.. ‘‘25 యేళ్ళ క్రితం ‘సిరైచ్చాలై’ అనే చిత్రాన్ని ప్రియదర్శన్‌ నాకు ఇచ్చారు. ఆ మూవీ సూపర్‌ హిట్‌. ఆ కాలంలో ప్రముఖ టీవీ చానెల్స్‌ ప్రతి వారం రిలీజ్‌ చేసే రేటింగ్స్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఇంతకాలానికి ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ‘మరైక్కాయర్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో మాటలు చాలా బాగున్నాయి. ఇకపై నేను నిర్మించే చిత్రాల్లో ఆయనకు అవకాశం కల్పిస్తాను అలాగే ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తాను’’ అన్నారు. 


ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. ‘‘మలయాళం, తమిళ భాషల్లో ఈ మూవీని తెరకెక్కించగా, తమిళంలో కలైపులి ఎస్‌.థాను రిలీజ్‌ చేయాలన్నది హీరో మోహన్‌ లాల్‌ కోరిక. ఆ విధంగానే తమిళంలో థాను రిలీజ్‌ చేశారు. అలాగే, హీరో ప్రభు ఒక కీలక పాత్ర చేయాలని మోహన్‌ లాల్‌ కోరారు. దీంతో ఆయనకు చిన్న పాత్రను కేటాయించాం. కేరళలో మొత్తం 639 స్ర్కీన్లు ఉంటే 632 స్ర్కీన్‌లలో మరైక్కాయర్‌ సినిమాను రిలీజ్‌ చేశారు. తొలి వారం రోజుల పాటు హౌస్‌ఫుల్‌’’ అని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు రోనీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement