కల నెరవేరేదెప్పటికో..?

ABN , First Publish Date - 2022-01-18T05:06:10+05:30 IST

జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం కలగానే మిగులుతుం దా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

కల నెరవేరేదెప్పటికో..?

జిల్లావాసుల చిరకాల స్వప్నం విమానాశ్రయం

గత ప్రభుత్వంలో ప్రారంభమైన  పనులు

రెండేన్నరేళ్లుగా ముందుకు పడని అడుగు

మళ్లీ కొత్త డీపీఆర్‌ తయారు

ఇక పనులు ఎప్పటికి మొదలయ్యేనో...?


నెల్లూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం కలగానే మిగులుతుం దా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభమైనా, ఈ ప్రభుత్వంలో ఆ పనులను నిలిపేశారు. తాజాగా మరోసారి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేశారు. ఇప్పుడున్న దాని కన్నా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం మరికొంత భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఇదంతా జరిగేదె ప్పుడు.. టెండర్లు పిలిచి కొత్త సంస్థకు నిర్మాణ పనులు అప్పగిం చేదెప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జరుగుతున్న పనులను ఆపి కొత్తగా మళ్లీ పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన డీపీఆర్‌ను తయారు చేయడానికే రెండన్నరేళ్లు పడితే ఇక పనులు మొదలు పెట్టేందుకు ఇం కెంత సమయం పడుతుందోనన్న సందేహాలు కలుగుతున్నా యి. దాదాపు ఒకటన్నర దశాబ్దం క్రితం మొదలైన విమానాశ్రయం నిర్మాణం ప్రక్రియ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలో కీలకమైన విమానాశ్రయం లేకపోవడంతో అటు పారిశ్రామికవేత్తలతో పాటు ఇటు జిల్లా వాసులు చెన్నై, తిరుపతి నగరాలకు వెళ్లాల్సి వస్తున్నది.


గత ప్రభుత్వంలో పురోగతి

2007లో విమానాశ్రయం నిర్మాణంపై చర్చలు జరిగినా అవన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి విమానాశ్రయం అంశం తెరపైకి వచ్చింది. జిల్లాకొక విమానాశ్రయం నిర్మిం చాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 1379 ఎకరాల్లో నిర్మాణానికి భూసేకరణ మొదలుపెట్టారు. అందులో పట్టా, డీకేటీ, సీజేఎఫ్‌ఎస్‌, పోరంబోకు భూములున్నాయి. మొదట పట్టా భూములకు ఎకరాకు రూ.15 లక్షలు, సీజేఎఫ్‌ఎస్‌, డీకేటీ భూములకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిహారం పెంచాలని రైతులు కోరడంతో నాటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పట్టా భూములకు రూ.18 లక్షలు, సీజేఎఫ్‌ఎస్‌, డీకేటీ భూములకు ఎకరాకు రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం సుమారు 1060 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. మరో 300 ఎకరాలకుపైన భూమి వివాదం హైకోర్టులో నడుస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో దగదర్తి విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ కూడా అప్పగించారు. అయితే కోర్టు కేసు ఆలస్యం జరుగుతుండడంతో అప్పటి వరకూ అందిన 1060 ఎకరాల భూమిని కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రన్‌వేకు సంబంధించిన ఎర్త్‌ వర్క్‌ పనులు మొదలయ్యా యి. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 


జరుగుతున్న పనులు ఆపి..

ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో విమానాశ్రయ పనులు ఆగిపోయాయి. తొలి ఏడాది నెల్లూరు విమా నాశ్రయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత అప్పటికి ఉన్న కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసుకుంది. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని నెలలకు మళ్లీ కొత్తగా డీపీఆర్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నివేదికను ఆమోదించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. అయితే జరుగుతున్న పనులను ఆపి మళ్లీ ఎందుకు మొదటి నుంచి మొదలు పెట్టాలనుకున్నారన్నది ఎవరికీ తెలియని ప్రశ్న. ఒకవేళ విమానాశ్రయాన్ని విస్తరించాలనుకుంటే నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా చేసుకోవచ్చునని, దేశంలో చాలా విమానాశ్రయాలను ఇదే విధంగా విస్తరించారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గతంలో మొదలైన పనులు సాఫీగా సాగి ఉంటే ఈ పాటికి విమానాశ్రయం పూర్తయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా కొత్త డీపీఆర్‌ ప్రకారం దగదర్తి విమానాశ్రయాన్ని దాదాపు 1800 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే 1379 ఎకరాల భూసేకరణ జరగ్గా, మిగతా భూమిని సేకరించేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాణీకులే కాకుండా కార్గో సేవలను విస్తృతంగా చేపట్టేందుకే విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

Updated Date - 2022-01-18T05:06:10+05:30 IST