సంతానం కోసం కాల భైరవుడికి పూజలు.. ఫలితం లేకపోవడంతో..

ABN , First Publish Date - 2020-09-29T18:22:26+05:30 IST

పెళ్లై పదేళ్లు గడిచింది. కానీ సంతానం లేదు. కాల భైరవుడి విగ్రహంలో..

సంతానం కోసం కాల భైరవుడికి పూజలు.. ఫలితం లేకపోవడంతో..

సంతానం కోసం..!

కాలభైరవుడి విగ్రహంలో ఓ భాగం చోరీ

నిగ్గు తేల్చిన ఆళ్లగడ్డ పోలీసులు

నిందితుడిని పట్టించిన పూలమాల

వివరాలు వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప


కర్నూలు: పెళ్లై పదేళ్లు గడిచింది. కానీ సంతానం లేదు. కాల భైరవుడి విగ్రహంలో ఓ భాగానికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ఎవరో చెప్పారట. రెండేళ్లపాటు అలాగే చేశాడు. కానీ ఫలితం లేదు. దీంతో స్వామివారి విగ్రహం నుంచి ఆ భాగాన్ని వేరు చేసి తస్కరించాడు ఓ వ్యక్తి. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల వివాదం జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. 


ఏం జరిగింది: ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు సమీపంలో ఉన్న కాలభైరవస్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. గుడి తాళాలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారి విగ్రహం నుంచి ఓ భాగాన్ని వేరు చేసి చోరీ చేశారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కేసును త్వరగా ఛేదించాలని ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించడంతో ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, రూరల్‌ సీఐ సుదర్శన ప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ దర్యాప్తు ప్రారంభించారు. 


పట్టించిన పూలమాల: కాళభైరవ స్వామి ఆలయాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీకి మునుపు స్వామివారికి పూజ చేసినట్లు గుర్తించారు. విగ్రహానికి పూలమాల వేసి ఉంది. రెండు కొబ్బరి కాయలు కూడా కొట్టారు. పసుపు, కుంకుమ చల్లారు. స్వామి మెడలో పూల మాల భిన్నంగా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అలాంటి పూల మాలలను ఎర్రగుంట్ల సమీపంలో తయారు చేస్తారని తెలుసుకున్నారు. పూల మాలలు అమ్మే వ్యక్తిని కలిసి విచారించారు. ఆరోజు రాత్రి గోస్పాడు వైపు నుంచి ఎర్రటి బైకుపై వచ్చిన ఓ వ్యక్తి రెండు పూలదండలు కొనుగోలు చేశారని పూల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. అంతకు మించి ఆ వ్యక్తి వివరాలు చెప్పలేక పోయాడు.


దీంతో మరోమారు చిన్న కందుకూరు గ్రామానికి వెళ్లిన పోలీసులు ఎర్రని మోటార్‌ సైకిల్‌ వాడే వ్యక్తి ఆలయానికి వస్తుంటారా..? అని గ్రామస్థులను, పూజారిని ఆరా తీశారు. మూడు నెలలుగా ఓ వ్యక్తి వచ్చి పూజలు చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆ వ్యక్తి గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లె రాజశేఖర్‌ అని పోలీసులు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లి సోదా చేశారు. దేవుడి గదిలో కాలభైరవ స్వామి పటం, దాని ముందు చోరీ చేసి తెచ్చిన ఓ భాగం కనిపించాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


ఎందుకు చేశాడంటే: రాజశేఖర్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇంతవరకు సంతానం కలగలేదు. పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం దక్కలేదు. ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరులో ఉన్న కాలభైరవస్వామి విగ్రహంలోన ఓ భాగానికి పూజ  చేస్తే సంతానం కలుగుతుందని చుట్టుపక్కల గ్రామాల వారు చెప్పారు. వారి మాట నమ్మిన రాజశేఖర్‌ రెండేళ్ల నుంచి అమావాస్య రోజు ఆలయానికి వచ్చి పూజలు చేసేవాడు. రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయాన్నే వెళుతుండేవాడు. అయినా సంతానం కలగకపోవడంతో ఏకంగా ఆ భాగాన్ని తీసుకుని ఇంట్లో పూజ చేస్తే ఫలితం ఉంటుందని భావించి చోరీకి పాల్పడ్డాడు. ఆ రోజు ఆలయానికి వచ్చి, అర్ధరాత్రి పూజలు చేశాడు. విగ్రహాన్ని పగలగొట్టి ఆ భాగాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ చేయడం మొదలు పెట్టాడు. 


వివరాలు తెలిపిన ఎస్పీ: ఎస్పీ ఫక్కీరప్ప, ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుడు సత్తెనపల్లి రాజశేఖర్‌ను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. మొత్తం వివరాలను వెల్లడించారు. కేసును ఛేదించిన ఆళ్లగడ్డ డీఎస్పీ, ఎస్‌ఐలతో పాటు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను ఇచ్చారు. 


రాజకీయ రంగు పులమొద్దు: ప్రార్థన మందిరాలకు సంబంధించిన ఘటనలపై అనవసరంగా రాజకీయ రంగు పులమొద్దు. ప్రార్థనా మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. త్వరలోనే ప్రతి గ్రామంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో రక్షక దళాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నాం.  

-ఎస్పీ ఫక్కీరప్ప



Updated Date - 2020-09-29T18:22:26+05:30 IST