5 వేల కోట్ల భూములు స్వాహా!

ABN , First Publish Date - 2020-10-02T07:09:53+05:30 IST

కాకినాడ సెజ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ కన్ను ఈ నాటిది కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు...

5 వేల కోట్ల భూములు స్వాహా!

  • బినామీల పేరుతో జగన్‌ హస్తగతం
  • కాకినాడ సెజ్‌లో 10వేల ఎకరాలకు ఎసరు: యనమల

అమరావతి, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): కాకినాడ సెజ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ కన్ను ఈ నాటిది కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్‌ పదిహేనేళ్ల కల. సీఎం కాగానే మళ్లీ బినామీ సంస్థలను తెరపైకి తెచ్చి ఆ ప్రాంతం కైంకర్యానికి కుట్రలు చేస్తున్నారు. సీబీఐ చార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమణలు చేస్తున్నారు. జగన్‌పై ఉన్న సీబీఐ 12 చార్జిషీట్లలో.. తొలి చార్జిషీట్‌లో ఏ1 జగన్‌ కాగా, ఎ-2 విజయసాయిరెడ్డి, ఏ-3గా అరబిందో ఉన్న విషయం తెలిసిందే. ఏ1కు బినామీ ఏ2 అయితే, ఏ2కు బినామీ విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో రోహిత్‌రెడ్డి. తాజాగా కాకినాడ సెజ్‌లో 51శాతం వాటాను రూ.2,610 కోట్లకు విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థ అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా కొనుగోలు చేసింది. ఇక మిగిలిన 49 శాతం (కేవీ రావు వాటా) కూడా రేపోమాపో కొని మొత్తం 10వేల ఎకరాలను తన బినామీలకు అప్పగించేందుకు జగన్‌ పథకం వేశారు. రూ.5వేల కోట్ల విలువైన 10 వేల ఎకరాలను జగన్‌ హస్తగతం చేసుకుంటున్నారు’ అని యనమల దుయ్యబట్టారు. 


‘కాకినాడ సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌, రసాయన పరిశ్రమలు పెట్టకూడదన్నారు. ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు పెట్టేందుకు వీల్లేదని అప్పుడే షరతు విధించాం. అలాంటి చోట ఇప్పుడు బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ పెట్టి ఆ ప్రాంతాన్ని కాలుష్యమయంగా మార్చ డం గర్హనీయం. ఆ ప్రాంతంలోని వందలాది హేచరీలు  కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదముంది. సముద్రంలో చేపల ఉత్పత్తి ఉండదు. దానిపై ఆధారపడిన మత్స్యకారులు వలస వెళ్లాల్సిందే. ఎంతోమంది బడుగు, బలహీనవర్గాల వారు ఉపాధి కోల్పోతారు. దీన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది’ అని యనమల పేర్కొన్నారు. తీర ప్రాంతం మొత్తం హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా జగన్‌ పావులు కదుపుతున్నారని యనమల ఆరోపించారు. ‘ఉత్తరాంధ్రలో భూములన్నీ కబ్జాలు, ఆక్రమణలే. ఇప్పుడు కాకినాడ సెజ్‌ను కబళించారు. రేపో, మాపో బందరుపోర్టు కూడా జగన్‌ బినామీల పరంకానుంది. మేలిమి బంగారం లాంటి కోస్తా ప్రాంతాన్ని జగన్‌ కబళిస్తే దానిపై ఆధారపడిన బలహీనవర్గాల వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు’ అని యనమల అన్నారు.


వైఎస్‌ హయాంలోనే కన్ను..

‘కోనసీమలో వైఎస్‌ కుటుంబం భూ దురాక్రమణను టీడీపీ అప్పుడే వ్యతిరేకించింది. 2006లో ఈ సెజ్‌ పేరుతో భూముల్ని తీసుకున్న వైఎస్‌, కేవీపీల ప్రయత్నాలను అడ్డుకున్నాం. అప్పట్లో ఎకరాకు రూ.1.5 లక్షలు చెల్లించి దులుపుకోవాలని చూశారు. కానీ టీడీపీ పోరాటంతో రూ.9 లక్షలు ఇచ్చారు. ఆ రోజు రూ.300 కోట్లకే కొనుగోలు చేసిన 10వేల ఎకరాల ధర ఇప్పుడు రూ.5వేల కోట్లకు చేరింది. కాబట్టి సగం రైతులకే చెల్లించాలి’ అని యనమల డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-10-02T07:09:53+05:30 IST