ఎలా..ముందుకెళ్దాం?

ABN , First Publish Date - 2020-02-20T08:48:43+05:30 IST

కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మారిన 2,180 ఎకరాల భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు మళ్లీ సంప్రదింపుల

ఎలా..ముందుకెళ్దాం?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మారిన 2,180 ఎకరాల భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు మళ్లీ సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. 12 ఏళ్ల నుంచి ఉన్న ఈ భూముల జంఝాటంపై ఏంచేయాలనేదానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ సమస్యకు ఎలా ముగింపు ఇవ్వలనేదానిపై కీలక భేటీ అమరావతిలో జరిగింది. మంత్రి కన్నబాబు, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు, ఇతర కీలక అధికారులంతా మంగళవారం తొలిసారి భేటీ అయ్యారు. ఈ వివాదం ఎలా పరిష్కరించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. పిఠాపురం, తుని ఎమ్మెల్యేలు, కాకినాడ ఎంపీతో త్వరలో భేటీ అయి రైతులకు, సెజ్‌ యాజమాన్యానికి ఇబ్బందులు లేకుండా సమస్యకు ముగింపు పలకడంపై సమాలోచనలు జరపనున్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌కు 2008లో పిఠాపురం, తుని నియోజకవర్గాల పరిధిలోని యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 10 వేల ఎకరాల వరకు భూసేకరణ జరిగింది. అయితే అప్పట్లో 2,180 ఎకరాలకు సంబంధించి భూములు ఇవ్వడానికి అన్నదాతలు అంగీకరించలేదు.


తమకు ఎకరాకు భారీగా పరిహారం కావాలని డిమాండ్‌ చేశారు. కానీ సెజ్‌ యాజమాన్యం రూ.3 లక్షల చొప్పున ఎకరాకు చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీంతో భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించారు. అయితే సెజ్‌ యాజమాన్యం మాత్రం భూములకు ప్రభుత్వపరంగా అవార్డుపాస్‌ అవడంతో 2,180 ఎకరాలకు రూ.60 కోట్లకుపైగా పరిహారం బ్యాంకులో జమచేసింది. కానీ రైతులు మాత్రం పరిహారం తీసుకోలేదు. దీంతో వివాదం క్రమేపీ పెరిగింది. తిరిగి 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి సెజ్‌ భూముల వివాదానికి ముగింపు పలకడానికి ప్రయత్నాలు జరిగాయి. అందులోభాగంగా అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎకరాకు అదనంగా రూ.6 లక్షల చొప్పున ఇవ్వాలని సెజ్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. తద్వారా పాతది రూ.3 లక్షలు, కొత్తది రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.9 లక్షల చొప్పున ఎకరాకు ఇవ్వడానికి ఎస్‌ఈజెడ్‌ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ అన్నదాతలు మాత్రం తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని పట్టుబట్టారు.


అలా అయితే ఎకరాకు రూ.25 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుందని, తమ వల్లకాదని సెజ్‌ యాజమాన్యం వెనకడుగు వేసింది. 2008లో జరిగిన భూసేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఎలా చెల్లిస్తామని నిరాసక్తత వ్యక్తం చేసింది. దీంతో అప్పటినుంచీ 2,180 ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేసింది. స్థానిక మంత్రి కన్నబాబు, కలెక్టర్‌, పరిశ్రమలశాఖ అధికారులు, ఎస్‌ఈజెడ్‌ సంస్థ ప్రతినిధులతో కమిటీని నియమిస్తున్నట్టు అందులో పేర్కొంది.


దీనిప్రకారం తొలి సమావేశం మంగళవారం అమరావతిలో జరిగింది. సమస్య పరిష్కరించి అన్నదాతలకు ఇబ్బంది లేకుండా, సెజ్‌కు భూముల సమస్య లేకుండా చేయడానికి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. అందులోభాగంగా త్వరలో పిఠాపురం, తుని ఎమ్మెల్యేలతోపాటు కాకినాడ ఎంపీ సమావేశంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో తదుపరి కార్యాచరణ ఆలోచించి ఆ తర్వాత రైతులు, సెజ్‌ యాజమాన్యంతో సమావేశం కావాలని తేల్చారు.

Updated Date - 2020-02-20T08:48:43+05:30 IST