పెద్ద చిక్కే!

ABN , First Publish Date - 2020-08-05T11:49:04+05:30 IST

పాజిటివ్‌ సోకిన బాధితులకు మాత్రమే సేవలందించడం కోసం జీజీహెచ్‌లో ఉన్న వందలాది మంది ఇతర రోగులందరిని మంగళవారం నుంచి ఖాళీ ..

పెద్ద చిక్కే!

కాకినాడ జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మారడంపై పేదల్లో ఆందోళన

  అనారోగ్యం వస్తే ఎక్కడకు పోవాలో తెలియని అయోమయం

  ఎన్నో ఏళ్లుగా ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు జీజీహెచ్‌ ఒక్కటే ఏకైక దిక్కు

  చిన్నపాటి రోగం నుంచి ప్రాణాపాయం ఉన్నవాళ్లంతా ధైర్యంగా ఇక్కడకే రాక

  జీజీహెచ్‌కు బదులు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరాలంటున్న అధికారులు

  కొన్ని రోగాలు, శస్త్రచికిత్సలకే అందులో చోటు.. మిగిలిన వాటికి డబ్బులు కట్టాల్సిందే

  అటు జీజీహెచ్‌లో మందులు ఉచితం..  బయట కొనాలంటే చుక్కలు

 జైళ్లలో ఖైదీలు అనారోగ్యానికి గురైతే జీజీహెచ్‌కు తరలింపు.. ఇప్పుడేం చేస్తారో


ఉభయగోదావరి జిల్లాల పేదలకు పెద్ద దిక్కయిన కాకినాడ జీజీహెచ్‌లో వైద్యం నిలిచిపోనుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తరతరాలుగా ఈ రెండు జిల్లాల పేదలకు ఏ అనారోగ్యం వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులున్నా ధైర్యంగా వచ్చేది ఇక్కడకే. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలకు జీజీహెచ్‌ పెద్దాసుపత్రే దిక్కు. ఇప్పుడు ఇందులో అన్ని విభాగాలు ఖాళీ చేయించి త్వరలో కేవలం కొవిడ్‌ కేసులే చూసేలా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జీజీహెచ్‌ లేకపోతే ఎక్కడకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు పొందాలని అధికారులు సలహా ఇస్తున్నా దీనికిందకు కొన్ని సేవలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు చెల్లించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): పాజిటివ్‌ సోకిన బాధితులకు మాత్రమే సేవలందించడం కోసం జీజీహెచ్‌లో ఉన్న వందలాది మంది ఇతర రోగులందరిని మంగళవారం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఆపరేషన్‌ చేయించుకుని వార్డుల్లో ఉన్న రోగులు, ఆరోగ్యం నయం కాని వారిని స్ర్టెచర్‌ల్లో బయటకు పంపేస్తున్నారు. బుధవారం నాటికి మొత్తం 24 విభాగాలను ఖాళీ చేయించనున్నారు. ఆ తర్వాత 1500 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా జీజీహెచ్‌ మారనుంది. దీంతో నిత్యం మూడు వేల మంది వరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఓపీ సేవల కోసం వచ్చే రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మార నుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రెండు జిల్లాల్లో అనేకమంది పేద రోగులు వైద్య సేవల కోసం వ్యయప్రయాసల కోర్చి పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌కు వస్తున్నారు. ఇక్కడ 24 విభాగాల్లో 1,165 బెడ్లలో 100 మంది ఎంఎన్‌వోలు, 300 మంది వైద్యులు, 350 మంది స్టాఫ్‌ నర్స్‌లు, 350 మంది పీజీలు, 200 మంది హౌస్‌సర్జన్‌లు ఓపీ, ఇన్‌ పేషెంట్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చడంతో వీరంతా ఇకపై సాధారణ రోగులను చూడరు. కేవలం పాజిటివ్‌ వచ్చిన వారికే సేవలందిస్తారు.


దీంతో పేదరోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడో జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా దెబ్బతగిలినా.. అగ్ని ప్రమాదంలో శరీరం కాలి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా.. శరీ రంలో ఏది గుచ్చుకున్నా.. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినా, డయేరియా, కేన్సర్‌.. ఇలా ఏ సమస్య ఉన్నా జీజీహెచ్‌ పెద్ద దిక్కు. జిల్లాలో ఇతర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా వీటన్నింటికి జీజీహెచ్‌కు వెళ్లాలని సిఫార్సు చేస్తారు. అటు జిల్లాలో వివిధ జైళ్లలో ఉండే ఖైదీలకు ఏ అనారోగ్యం వచ్చినా జీజీహెచ్‌కే పోలీసులు తీసుకు వస్తారు. అయితే ఇప్పుడు అంకాలజీ, పిడియాట్రిక్స్‌, మెడిసిన్‌, న్యూరో, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాలన్నీ మూతపడితే జీజీహెచ్‌కు వచ్చినా ప్రయోజనం లేనట్టే. దీంతో ఆపద సమయంలో ఆదుకునే ఆసుపత్రి పేదలకు అందుబాటులో లేని పరిస్థితి. వేరే దారి లేక పేదలు బయట ఆసుపత్రులకు వెళ్తే వైద్య ఖర్చులు భరించలేరు.


ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకోవాలంట...

కొవిడ్‌ బాధితుల కోసం జీజీహెచ్‌లో అన్ని విభాగాలు మూసివేస్తుండడంతో మిగిలిన రోగులంతా ఇకపై జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ కింద ఉన్న ప్రైవేటు ఆసుప త్రులకు వెళ్లాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వాస్తవానికి ఇది ఆచరణలో అసాధ్యం. ఆరోగ్యశ్రీ కేవలం కొన్ని వ్యాధులు, చికిత్సలకే వర్తిస్తుంది. కాలిన గాయాలు, విరిగిన అవయవాలు, న్యూరో సమస్యలు, పిడియాట్రిక్‌ సమస్యలు ఉన్న వారికి ఆ వ్యాధి లేదా అనారోగ్య తీవ్రత ఆధారంగానే ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటున్నాయి. మిగిలిన వాటికి డబ్బులు చెల్లించాల్సిందే. ఎక్కడో గిరిజన ప్రాంతంలో వ్యక్తికి బాణం గుచ్చుకున్నా.. ఇంకెవరికో గుండె సంబంధిత సమస్య ఉన్నా అవన్నీ ఆరోగ్యశ్రీ కిందకు రావు.


ఈ నేపథ్యంలో ఏదెబ్బతగిలినా, ఏ అనారోగ్యం వచ్చినా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఓపీలో డబ్బులు చెల్లించాల్సిందే. జీజీహెచ్‌లో అయితే ఓపీ, ఇన్‌పేషెంట్‌ విభాగాల్లో రోగులకు మందులు ఉచితం. కానీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వీటిని డబ్బులతో కొనుగోలు చేయాలి. అసలే కొవిడ్‌ కష్టాలతో ఆదాయం కోల్పోయిన పేద బతుకులకు ఇది చాలా భారంగా మారనుంది. మరోపక్క ఆస్పత్రుల్లో రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వచ్చేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం జాబితాలో ఇంకా మన జిల్లా చేరలేదు. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌ మూతతో పేదలకు మరిన్ని కష్టాలు పెరగనున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో అత్య వసర సేవలకు ఇదే కీలకం. ఇప్పుడు జీజీహెచ్‌లో అన్ని విభాగాలు మూసివేయాలనే ఆలోచన నేపథ్యంలో పేదలకు ప్రత్యామ్నాయ వైద్య సేవల ఏర్పాట్లు చేయాలి. కానీ జిల్లా ఆరోగ్యశ్రీ విభాగం మాత్రం ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేటు ఆసుపతుల్రకు ఫోన్లు చేసి వచ్చే పేద రోగులను చేర్చుకోవాలని సలహా ఇస్తోంది. 

Updated Date - 2020-08-05T11:49:04+05:30 IST