కల్లోలం నుంచి సురక్షితంగా..

ABN , First Publish Date - 2020-10-17T11:00:26+05:30 IST

సముద్రంలో కల్లోలం... స్టార్ట్‌కాని బోటు ఇంజను... నాలుగు రోజులుగా సముద్రంలోనే పడిగాపులు...

కల్లోలం నుంచి సురక్షితంగా..

వాడరేవు తీరానికి  కాకినాడ మత్స్యకారులు

 నాలుగు రోజుల ఉత్కంఠకు తెర

 తగిన సదుపాయాలు సమకూర్చిన మత్స్యశాఖ అధికారులు


చీరాల, అక్టోబరు 16 : సముద్రంలో కల్లోలం... స్టార్ట్‌కాని బోటు ఇంజను... నాలుగు రోజులుగా సముద్రంలోనే పడిగాపులు... చివరకు గుర్తించిన మెరైన్‌ పోలీసుల సాయంతో ఏడుగురు కాకినాడ మత్స్యకారులు ప్రకాశం జిల్లా చీరాలలోని వాడరేవు తీరానికి చేరుకున్నారు. వివరాలలోకి వెళితే .. కాకినాడ సమీపంలోని దుమ్ములపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు ఏడుగురు ఈ నెల 7వ తేదీ ఉదయం  సముద్రంలో వేటకు వెళ్లారు. మూడు రోజులపాటు సముద్రంలో వేట సాగించారు. 10వ తేదీ వాతావరణం సక్రమంగా లేకపోవటంతో తీరానికి చేరాలని  నిర్ణయించుకున్నారు. అయితే బోటు ఇంజన్‌ స్టార్ట్‌ కాలేదు. దీంతో వారు ఆందోళన చెందారు. ఎలాగైనా సురక్షితంగా చేరుకోవాలని బోటుకు ఉన్న తెరచాప సాయంతో గాలివాలున ప్రయాణం చేశారు.


అయితే గాలిపాటుతో వారు ప్రయాణించాల్సిన దిశమారింది. దీంతో పాటు వారికి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కూడా పనిచేయలేదు. భయాందోళనతో  వారు సాయంకోసం ఎదురుచూశారు. సుమారు నాలుగురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. వారు వెంట తీసుకెళ్లిన ఆహారపదార్థాలు కూడా నిండుకున్నాయు. ఈ నేపఽథ్యంలో మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు వారిని రక్షించేందుకు ఉపక్రమించారు. సహాయక చర్యలులో భాగంగా వెతుకులాట ప్రారంభించారు. వారి బోటు గాలివాలున మచిలీపట్నం- నిజాంపట్నం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.


అలా ముందుకు సాగుతున్న బోటను అధికారులు పంపిన బోటు సాయంతో వారికి సమాచారం అందించి  గురువారానికి వాడరేవు తీరానికి చేర్చారు. ఫిషరీస్‌ ఎఫ్‌డీవో లక్ష్మణ్‌నాయక్‌ సిబ్బందితో కలసి వారికి యుద్ధప్రాతిపదికన ఆహారం, మంచినీరు సమకూర్చారు. మెరైన్‌ పోలీసులు వివరాలు తెలిసుకున్నారు. వారికి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించారు. వారి  స్వగ్రామంకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సురక్షితంగా తీరానికి చేరిన కాకినాడ మత్స్యకారులు జి.పోలయ్య, ఎల్లాజి, ఎం.సింగరాజు, కె.సింహాద్రి, పి.రాంబాబు, జి.దుర్గా, పి.తాతారావులు తమకు సహాయం చేసినందుకు మెరైన్‌ పోలీసులుకు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాడరేవు మాజీ సర్పంచ్‌ ఎరిపిల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T11:00:26+05:30 IST