కాకినాడ బీచ్‌లో.. యుద్ధవిమాన మ్యూజియం కలేనా!

ABN , First Publish Date - 2022-05-16T06:56:55+05:30 IST

కాకినాడ జిల్లా వాసులు, విద్యార్థులు, యువతకు తీరం చెంత వైమానిక కనువిందు చేసేందుకు వీలుగా దేశానికి విశేష సేవలందించిన టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

కాకినాడ బీచ్‌లో.. యుద్ధవిమాన మ్యూజియం కలేనా!
యుద్ధ విమానం ఎదుట సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు

జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కాకినాడ బీచ్‌ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పర్యాటకులు, చిన్నారులు, యువతకు విజ్ఞానం, వినోదం పంచేందుకు, దేశ భద్రత, రక్షణకోసం త్రివిధ దళాలు చేస్తున్న సేవలపై అవగాహన కోసం యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యారావుపేట బీచ్‌లో థీమ్‌ పార్కు పేరిట దేశానికి విశేష సేవలదించిన టీయూ-142 ఎం యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు గుడా సంస్థ రూ.5.89కోట్లు కేటాయించింది. మ్యూజియం నిర్మాణ పనులు చేపట్టి రెండున్నర ఏళ్లు కావస్తున్నా పనులు చేసిన కాంట్రాక్ట్‌ సంస్థకు బిల్లులు చెల్లించపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.  తొలి ఏడాది పనులు చకాచకా జరిగినా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం, ప్రభుత్వ నిధులు ఫ్రీజింగ్‌లో ఉండడం, కాంట్రాక్ట్‌ సంస్థ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మళ్లీ అధికారులు టెండర్లు ఆహ్వానించినా నిధుల్లేక అసంపూర్తిగా నిలిచిపోవడంతో యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కలగానే మిగిలింది. పురాతన ప్రసిద్ధిగాంచిన యుద్ధ విమానం మ్యూజియం ఎన్నటికి పూర్తయ్యేనో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సత్వరంగా అసంపూర్తి పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

 విమానం తెచ్చి పెట్టారు 

 నిధుల్లేక అసంపూర్తిగా వదిలేశారు

 నత్తనడకన మ్యూజియం నిర్మాణ పనులు 

సర్పవరం జంక్షన్‌, మే 15: కాకినాడ జిల్లా వాసులు, విద్యార్థులు, యువతకు తీరం చెంత వైమానిక  కనువిందు చేసేందుకు వీలుగా దేశానికి విశేష సేవలందించిన టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చెందుతున్న బీచ్‌ను మరింత అభివృద్ధికి, మ్యూజియం ఏర్పాటు కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత కృషి చేశారు. కోల్‌కత్తా, విశాఖపట్టణం తర్వాత కాకినాడలో యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు అనువైన రెండెకరాల స్థలాన్ని బీచ్‌లో కేటాయించారు. కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట బీచ్‌లో యుద్ధ విమాన ప్రదర్శనశాలను గోదావరి అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ(గుడా) ప్రస్తుతం కుడా ఆధ్వర్యంలో రూ.5.89 కోట్ల వ్యయంతో థీమ్‌ పార్కు ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. ఇందుకోసం కేంద్రంతో సంప్రదించి టీయూ-142 విమానాన్ని కాకినాడలో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రపంచలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఒకటైన టీయూ-142 ఎం పేరుతో భారత నావికాదళం వైమానిక విభాగంలో 28ఏళ్లపాటు దేశానికి విశేషమైన సేవలందించింది. సముద్ర తీర గస్తీ, జలాంతర్గామి నిరోధక సేవలు అందించడంలో ఖ్యాతి గడించిన ఈ యుద్ధ విమానం 2017లో నేవీ నుంచి వైదొలిగింది. ఇది తమిళనాడులోని అరక్కోణం బేసల్‌ ఎయిర్‌స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ రాజసంలో విశ్రాంతి తీసుకుంటుంది. దీన్ని తమిళనాడు నుంచి కాకినాడకు తీసుకొచ్చేందుకు వీలుగా 14 భారీ వాహనాల ద్వారా ఈ పురాతన యుద్ధ విమానాన్ని తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కాకినాడ బీచ్‌కు తీసుకొచ్చారు. దీన్ని సంస్థ కెప్టెన్‌ వెంకటేష్‌, నేవీ మాజీ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక సిబ్బందితో నెలల తరబడి సూర్యారావుపేట బీచ్‌లో విమానాన్ని ఏర్పాటు చేశారు.

నిధుల్లేక నిలిచిన పనులు

యుద్ధ విమాన మ్యూజియం నిర్మాణ పనులు దాదాపు మూడొంతుల వరకు పూర్తయ్యాయి. దీని నిర్మాణానికి టెండర్‌ దక్కించుకున్న తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు 9నెలల నుంచి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో అసంపూర్తి పనులకోసం మళ్లీ టెండర్లు ఆహ్వా నించారు. ప్రభుత్వ నిధులు ఫ్రీజింగ్‌లో ఉండడంతో మ్యూజియం పనులు ముందుకు సాగడం లేదు. గతేడాది డిసెంబర్‌లో యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్‌తో ప్రారంభించాలని అధికారులు భావించారు. నిధుల విడుదల్లో జాప్యంతో అసంపూర్తి పనులు పూర్తికావడం లేదు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.  

టీయూ-142 యుద్ధ విమానం ప్రత్యేకతలు 

టీయూ-142 యుద్ధ విమానాన్ని కేంద్రం రష్యానుంచి కొనుగోలు చేసింది. కార్గిల్‌ యుద్ధంలో విశేష సేవలందించింది. శత్రుదేశాలకు చిక్కకుండా ఒక్కసారి విమానంలో ఫ్యూయల్‌ నింపుకుని ప్రపంచ దేశాలను కేవలం 16 గంటల్లో చుట్టి వచ్చే సామర్ధ్యం దీని సొంతం. గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. ఈ విమానం పొడవు, వెడల్పులు 50 మీటర్లు కావడం విశేషం. విమాన రెక్కల పొడవు 50 మీటర్లుగా ఉంది. దీని బరువు 90 వేల కిలోలు.


Updated Date - 2022-05-16T06:56:55+05:30 IST