కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు బడా కంపెనీలు

ABN , First Publish Date - 2022-01-20T05:44:01+05:30 IST

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు బడా కంపెనీలు

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు బడా కంపెనీలు
కైటిక్స్‌ ప్రతినిధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఫలిస్తున్న మంత్రి కేటీఆర్‌ కృషి   

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి


గీసుగొండ, జనవరి 19: మంత్రి కేటీఆర్‌ కృషితోనే వరంగల్‌ జిల్లాలోని కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో పెద్దపెద్ద కంపెనీలు ఏర్పాటవుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసంలో కైటిక్స్‌ గార్మెంట్స్‌ ప్రతినిధులు మనోజ్‌కుమార్‌, హెచ్‌.ఎస్‌ సోది(వి.పి, బిజినెస్‌ ఆపరేషన్స్‌), తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి డాక్టర్‌ శాంత తౌటంతో చర్చించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో మంచి పేరున్న కైటిక్స్‌ గార్మెంట్స్‌ కంపెనీ ఏర్పాటు కావడం శుభసూచకమని అన్నారు. వచ్చే జూన్‌ నుంచి ఆగస్టు వరకు కంపెనీకి చెందిన మిషనరీలు 800 కంటైనర్లలో రానున్నట్లు చెప్పారు. దేశ, విదేశాల్లో ఉన్న కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని, దీని వెనక మంత్రి కేటీఆర్‌ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. 

ఈ కంపెనీలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఐటీఐ వంటి విద్యార్హతలున్న వారికి టెక్నికల్‌ విభాగంలో, అకౌంట్స్‌ విభాగంలో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు తర్వాత సుమారు 9వేల మంది మహిళలకు, 2వేల మంది పురుషులకు ఉపాధి లభిస్తుందన్నారు. వీరందరికి 15 రోజుల పాటు ఉచిత భోజన వసతితో కంపెనీ శిక్షణ ఇస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలో పత్తి పంట పండించే రైతులకు మంచి డిమాండ్‌ ఉంటుంద ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఈ కంపెనీ ప్రతినిధులతో ముందుగా ఒప్పందం చేసుకుంటే నేరుగా పత్తిని సరాఫరా చేసుకునే వెసలుబాటును కల్పిస్తారన్నారు.  

Updated Date - 2022-01-20T05:44:01+05:30 IST