సచివాలయానికి కాకతీయ గుమ్మటాలు

ABN , First Publish Date - 2020-08-07T07:09:43+05:30 IST

హన్మకొండలోని వేయి స్తంభాల గుడిపై ఉన్న గుమ్మటాలు(డోమ్‌) ప్రామాణికంగా తెలంగాణ నూతన సచివాలయ సముదాయం నమూనా రూపకల్పన జరిగింది. క్రీ.శ. 1163లో నిర్మితమైన వేయి స్తంభాల గుడి కాకతీయుల

సచివాలయానికి కాకతీయ గుమ్మటాలు

  • వేయి స్తంభాల గుడి స్ఫూర్తిగా నిర్మాణం
  • అత్యాధునిక భద్రత.. సోలార్‌ ప్యానెళ్లు  
  • సాంకేతిక అనుమతుల తర్వాత టెండర్లు

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): హన్మకొండలోని వేయి స్తంభాల గుడిపై ఉన్న గుమ్మటాలు(డోమ్‌) ప్రామాణికంగా తెలంగాణ నూతన  సచివాలయ సముదాయం నమూనా రూపకల్పన జరిగింది. క్రీ.శ. 1163లో నిర్మితమైన వేయి స్తంభాల గుడి కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. సచివాలయ గుమ్మటాలు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, ముఖ్యంగా శివాలయాలు, అందునా హైదరాబాద్‌కు సమీపంలోని నీల కంఠేశ్వర ఆలయం స్ఫూర్తిగా తీసుకుని డిజైన్‌ను రూపొందించినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. వాస్తును పాటిస్తూ తెలంగాణ సంస్కృతికి ఈ డిజైన్‌ అద్దం పడుతుందని పేర్కొంది. కొత్త సచివాలయంలో అత్యాధునిక భద్రత వ్యవస్థ సమకూరుస్తారు. భవనాల్లోకి గాలి, వెలుతురు  సహజ సిద్ధంగా వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్తు వినియోగం కోసం సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుచేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం, నూతన సచివాలయం ప్రధాన ద్వారం తూర్పున ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రవేశ ద్వారం ప్రత్యేకంగా ఉంటుంది. ఏడో అంతస్తులో సీఎం చాంబర్‌తో పాటు కేబినెట్‌ మీటింగ్‌ హాలు, ప్రధాన కార్యదర్శి, సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది, వీఐపీ వెయిటింగ్‌ హాలు, సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందికి హాలు ఏర్పాటు చేయనున్నారు. మిగతా అంతస్తుల్లో మంత్రుల చాంబర్లు, వివిధ శాఖలు, సిబ్బంది, సమావేశ మందిరాలు నిర్మించనున్నారు. భారీ సమావేశ మందిరాలు, వీఐపీల వెయిటింగ్‌ హాల్స్‌, పోలీసు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మెట్లతో పాటు సీఎం, మంత్రుల లిఫ్టులు, విజిటర్స్‌ లిఫ్టులు, ఫైర్‌ లిఫ్ట్‌, దివ్యాంగుల కోసం ర్యాంప్‌లు నిర్మించనున్నారు. 7 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితం కానున్న సచివాలయానికి భారీ పోర్టికో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ ఎల్‌ఈడీ వాల్స్‌  ఏర్పాటు చేయనున్నారు. సముదాయం అంతర్గతంగా ‘బ్రహ్మస్థానం’ పేరిట భారీ ప్రాంగణం రూపకల్పన జరుగనుంది. 33 జిల్లాలకు సంబంధించిన కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఇది ఏర్పాటు కానుంది. మొత్తం ఏడంతస్తులకు గాను ఒక్కో అంతస్తును 14 అడుగుల ఎత్తున నిర్మించనున్నారు. 


త్వరలో టెండర్లు!

డిజైన్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెండర్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండనున్నవా? లేక జాతీయ స్థాయిలోనా? అన్నది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుందని రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది. రూ.400 కోట్ల అంచనాతో నిధులు  మంజూరు చేస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పరిపాలన పరమైన అనుమతులు ఒకటి, రెండు రోజుల్లో లభించనున్నాయి. సాంకేతిక అనుమతులు మంజూరయిన తర్వాత, టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ అవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారి ఒకరు తెలిపారు.


సాధారణంగా కన్సల్టెన్సీలు భవనం ప్లాన్‌ ఇచ్చిన తర్వాత అంచనా తయారీ ప్రక్రియ(అధికారుల అర్హతను బట్టి) ఈఈ నుంచి ప్రారంభమై ఈఎన్‌సీ అనుమతి వచ్చే వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. ఇప్పుడు, సచివాలయ పనులను తక్షణం చేపట్టేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో, నేరుగా ఈఎన్‌సీ స్థాయిలోనే టెండరు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఏడాది, రెండేళ్లలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా, కనీసం మూడేళ్లు పడుతుందని ఆర్‌అండ్‌బీ శాఖ భావిస్తోంది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం, ఈ నెల 10వ తేదీకల్లా స్థలం చదును పూర్తికావాల్సి ఉంది. కూల్చివేసిన భవనాల శిథిలాల తరలింపు ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయు. 


హెచ్‌వోడీల తరలింపుపై సందిగ్ధత

కొత్త సచివాలయంలోకి వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలు మారుస్తారా? లేదా? అన్నది సందిగ్ధత కొనసాగుతోంది. అన్ని హెచ్‌వోడీలను కూడా సచివాలయంలోనే కొనసాగించాలన్న ప్రతిపాదన తొలుత ఉన్నా, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న శాఖల అధిపతుల కార్యాలయాలకు కింది స్థాయి అధికారులు, సిబ్బంది రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, కొత్త సచివాలయంలో వీటిని కొనసాగిస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-08-07T07:09:43+05:30 IST