కాకాణి x అనిల్‌

ABN , First Publish Date - 2022-04-18T08:33:20+05:30 IST

కాకాణి x అనిల్‌

కాకాణి x అనిల్‌

నెల్లూరులో బస్తీమే సవాల్‌..పోటాపోటీగా సభలు

అధిష్ఠానం హెచ్చరికతో విమర్శలు లేకుండానే ప్రసంగాలు

మంత్రికి స్వాగతం పలకని అనిల్‌, కోటంరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి


నెల్లూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు వైసీపీలో అంతర్గత విభేదాలు బజారుకెక్కాయి. ఒకే రోజు.. ఒకే సమయానికి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తాజా మాజీ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరులో పోటాపోటీగా సభలు నిర్వహించి బలప్రదర్శనకు దిగారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారి ఆదివారం సాయంత్రం కాకాణి జిల్లాకు వచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ కూడా అదే సమయానికి నగరంలోని గాంధీబొమ్మ వద్ద సభ పెట్టారు. నిజానికి వీరిద్దరి నడుమ ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. తొలి మంత్రివర్గ విస్తరణ రోజు నుంచీ పరస్పరం పొసగడం లేదు. తనకు రావలసిన మంత్రి పదవిని అనిల్‌ తన్నుకుపోయారని కాకాణి అప్పట్లో మనస్తాపం చెందినట్లు ప్రచారం జరిగింది. గడచిన మూడేళ్లూ ఇద్దరూ ఉప్పు, నిప్పులాగే ఉన్నారు. కాకాణి వర్గీయులు గ్రావెల్‌ అక్రమ రవాణా చేశారని అనిల్‌.. ఇసుక స్మగ్లింగ్‌లో అనిల్‌ వర్గీయులు ఉన్నారని కాకాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కాకాణి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అప్పట్లో అనిల్‌ను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. మంత్రి హోదాలో ఆయన వారి నియోజకవర్గాలైన సర్వేపల్లి, వెంకటగిరిల్లో అడుగు కూడా పెట్టలేకపోయారు. ఇప్పుడు కాకాణి మంత్రి కావడంతో అదే తరహా మర్యాద ఇవ్వాలని అనిల్‌ నిర్ణయించుకున్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో.. కాకాణి అన్న తనకెంత సహకరించారో, ఎంత గౌరవించారో అంతకు రెట్టింపు సహకారం ఇస్తానని తన మనసులో మాట బయటపెట్టారు. ఆ వెంటనే కాకాణికి ఽధన్యవాదాలు తెలుపుతూ నగరంలో వెలసిన భారీ ప్లెక్సీలను ఎవరో తీసేశారు. దీనివెనుక అనిల్‌ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. కాకాణి జిల్లాకు వచ్చే రోజు పోటీగా సభ ఏర్పాటు చేసి.. బహిరంగంగానే తమ సహాయ నిరాకరణను తెలియజేయాలని అనిల్‌ వర్గం ముందే నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం 6.30 కు  ఆయన బహిరంగ సభ పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య బహిరంగ పోరు మొదలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని పోలీసులు హడలిపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


నాయకులకు హెచ్చరిక..

పోటీ సభల గురించి తెలుసుకున్న వైసీపీ అధిష్ఠానం ఇద్దరు నాయకులనూ హెచ్చరించినట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దని గట్టిగా ఆదేశించినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఈ రెండు సభల్లో పరస్పర ఆరోపణలు, విమర్శలు వినిపించలేదు. తొలుత మంత్రి కాకాణి కావలిలో మాట్లాడుతూ.. అనిల్‌ సభ యాదృచ్ఛికమని, తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. సాయంత్రం అనిల్‌ తన ప్రసంగంలో తామంతా వైసీపీయేనని, తమ నాయకుడు జగన్‌ ఒక్కరేనని అన్నారు. పోటీ సభల్లో పరస్పర ఆరోపణలు చేసుకోకుండా అధిష్ఠానం కట్టడి చేసినా.. ఈ విభేదాలను రూపుమాపడం అంత తేలిక కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


అసమ్మతి.. ముగ్గురితో మొదలు

కాకాణికితో తీవ్రమైన విభేదాలున్న అనిల్‌తోపాటు మంత్రి పదవి ఆశించి భంగపడిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా మంత్రిహోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన కాకాణి స్వాగత సభకు హజరు కాలేదు. మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి  అభినందించనూలేదు. మంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కాకాణికి కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. తర్వాత కోవూరు నియోజకవర్గం మీదుగా వెళ్లినా..  స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కూడా కాకాణిని కలవలేదు. తొలిసారిగా మంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నెల్లూరు, ఒంగోలు ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వెంకటగిరి కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌బాబురెడ్డి హాజరయ్యారు.

Updated Date - 2022-04-18T08:33:20+05:30 IST