Abn logo
Jun 25 2021 @ 00:35AM

కైలాసగిరి టు భోగాపురం ఎయిర్‌పోర్టు రూట్‌ సర్వే

రహదారికై బీచ్‌రోడ్‌లో ఉమర్‌ఆలీషా ఆశ్రమం సమీపంలో వేసిన ప్రారంభమార్కింగ్‌

భీమిలి పట్టణం పక్క నుంచి ఆరు లేన్ల రహదారి నిర్మాణం


భీమునిపట్నం, జూన్‌ 24: బీచ్‌ కారిడార్‌లో భాగంగా కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి అధికారులు రూట్‌ సర్వే చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భీమిలి జోనల్‌ కార్యాలయం వద్ద ఉప్పుటేరుపై ఐ కాన్‌ బ్రిడ్జి నిర్మించాలని అనుకున్నారు. అయితే, భీమిలి పట్టణం మీదుగా ఈ రహదారి నిర్మిస్తే చాలా నివాస గృహాలు తొలగించాల్సి వస్తుందని, అలాగే ఐ కాన్‌ బ్రిడ్జికి అత్యధిక నిధులు అవసరమవుతాయని అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో  ఎర్రమట్టి దిబ్బలు దాటిన తర్వాత ఉమర్‌ ఆలీషా ఆశ్రమం వద్ద ఎడమ వైపు మళ్లించి, ఎస్‌వోఎస్‌ విలేజ్‌ వెనుక నుంచి ఈ రహదారి నిర్మించాలని ప్రతిపాదించారు. రెండు వందల మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి భీమిలి తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు బృందాలు సర్వే చేసినట్టు తెలిసింది. భీమిలి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ మొత్తం 18 కిలోమీటర్ల పొడవు వుండగా, అందులో భీమిలి మండల పరిధిలోనే 15 కిలోమీటర్లు ఉంది. ఈ రహదారి ఎస్‌వోఎస్‌ విలేజ్‌ వెనుక మొదలై నేరెళ్లవలస, కొత్తవలస కొండల మధ్య నుంచి కృష్ణా కాలనీ దొరతోట రోడ్డులో కలుస్తుంది. అక్కడి నుంచి కుమ్మరిపాలెం ఇండోర్‌ స్టేడియం, తాళ్లవలస రోడ్డును దాటి  బ్యాంక్‌ రోడ్డును, తగరపువలస రహదారిని క్రాస్‌ చేస్తూ రేఖవానిపాలెం చెరువు మీదుగా మూలకుద్దు, పెదనాగమయ్యపాలెం అటవీ భూములు, చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ జట్టీ, అన్నవరం హయగ్రీవ రిసార్ట్స్‌ పక్కగా భోగాపురం మండలం బసవన్నపాలెం, కంచేరు (ఎయిర్‌పోర్టు) వెళుతుందని ప్రతిపాదించారు. భీమిలి పట్టణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా శివారు ప్రాంతాలమీదుగా బైపాస్‌గా ఈ రహదారిగా వెళుతుందని అంటున్నారు. త్వరలో దీనికి రూ.1500 కోట్లు నిధులు మంజూరుకానున్నట్టు చెబుతున్నారు.