కాయ్‌ రాజా.. కాయ్‌!

ABN , First Publish Date - 2022-05-15T06:38:08+05:30 IST

జిల్లాలో విస్తరిస్తున్న మట్కా జూదం పోలీసులకు సవాలుగా మారుతోంది. సులువుగా డబ్బు చేతికి వస్తుందన్న ఆశతో ఈ వ్యసనానికి బానిసలవుతున్న కొందరు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.

కాయ్‌ రాజా.. కాయ్‌!

జిల్లాలో జోరుగా మట్కా నిర్వహణ 

తరచూ వెలుగు చూస్తున్న సంఘటనలు

గడిచిన నాలుగు నెలల్లో 114 మంది జూదరుల అరెస్టు

వ్యసనానికి బానిసలుగా మారుతున్న యువకులు

జూదం ఆడేందుకు ఇతర జిల్లాల నుంచి రాక

నిత్యం లక్షల రూపాయల్లో సాగుతున్న దందా

ఆదిలాబాద్‌, మే14(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విస్తరిస్తున్న మట్కా జూదం పోలీసులకు సవాలుగా మారుతోంది. సులువుగా డబ్బు చేతికి వస్తుందన్న ఆశతో ఈ వ్యసనానికి బానిసలవుతున్న కొందరు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో ఈ జూదం యథేచ్ఛగా కొనసాగుతోంది. అదే క్రమ క్రమంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు విస్తరించి పడగ విప్పుతోంది. గడిచిన 4 నెలల్లోనే పోలీసులు 55 కేసులను నమోదు చేసి 114 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4లక్షల 97వేల 608లను స్వాధీనం చేసుకున్నారు. ఈ జూదానికి పేద, మధ్య తరగతి ప్రజలే అధికంగా ఆకర్షితులై తమ కుటుంబాలను జూదానికి తాకట్టు పెడుతున్నారు. నిర్వాహకులు ఒక్క సారి డబ్బు ఆశ చూపడంతో జూదరుల్లో మరింత ఆశ పెరుగుతోంది. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా నిత్య కూలీ దగ్గరి నుంచి ప్రభుత్వ ఉద్యోగి వరకు ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. మహారాష్ట్రలోని పాండ్రకౌడ, కిన్వట్‌, బోకర్‌ ప్రాంతాల కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటలకు వరకు, మళ్లీ రాత్రి 9 నుంచి 12 గంటలకు వరకు రెండు దఫాల్లో ఆటలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో ఇటీవల తరచుగా జూదరులు పట్టుబడుతున్న సంఘటనలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో పోలీసుల నిఘా పెరిగి పోవడంతో మహారాష్ట్ర పరిసర ప్రాంతంలోకి వెళ్లి మరీ జూదం ఆడుతున్నారు. అక్కడైతే జిల్లా పోలీసులతో ఇబ్బంది ఉండదన్న భావనతో మహారాష్ట్రకు తరలి పోతున్నారు. ము ఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు సరిహద్దు మండలాలైన బేల, జైనథ్‌, ఇచ్చోడ, తాంసి, తలమడుగు మండలాల్లో ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్‌, ఆర్మూర్‌, భైంసా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జూదం నిర్వహి స్తున్నారు. కొన్ని విలాసవంతమైన లాడ్జీల్లో మకాం వేస్తూ ఈ దందాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతంలోని కొన్ని రహస్య ప్రాంతాల్లో గుట్టుగా ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతుంది. 

ఆన్‌లైన్‌లోనే దందా..

కొంత కాలం వరకు మట్కా జూదం చిట్టీల రూపంలో నెం బర్లతో నడిపించే వారు. ఇలాగైతే పోలీసులకు పట్టుబడు తున్నామన్న ఉద్దేశంతో నిర్వాహకులు తమ పంథాను మార్చు కున్నారు. హైటెక్‌ తరహాలో సెల్‌ఫోన్‌, మెసేజ్‌ల ద్వారా నెంబర్లను పంపుతూ ఆన్‌లైన్‌లోనే దందాను నడిపిస్తున్నారు. ఈ వ్యసనం ద్వారా నూటికి పది మంది లాభం పొందు తున్నారే తప్పా 90 మంది నష్ట పోతూనే ఉన్నారు. జిల్లాలో చాప కింద నీరులా ఈ జూదం విస్తరిస్తూనే ఉంది. చిన్నచిన్న వ్యాపారులు కూడా దురాశతో ఈ దందాను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతు న్నారు. ఎవరికి వారే కొంత మంది జూదరులను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. జూదంలో పట్టుబ డిన వారికి కఠిన శిక్షలు లేక పోవడంతోనే రోజురోజుకు విస్తరి స్తోందని విమర్శిస్తున్నారు. జూదరులను పట్టుకోవడం, కేసు లు నమోదు చేయడమే తప్ప వారిలో మార్పు దిశగా పోలీసులు ప్రయత్నాలు చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

మహారాష్ట్రతో లింకులు..

జిల్లాలో మట్కా జూదం నిర్వాహకులకు మహారాష్ట్రతో లింకులు ఉంటున్నాయి. దీనిపై నిఘా సారిస్తే కొంత వరకైనా కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసుల నిఘా పెరిగి పోవడంతో సెల్‌ఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారానే ఈ తతంగాన్ని సాగిస్తున్నారు. పోలీసులు తరచూ ఆన్‌లైన్‌పై నిఘా పెడితే కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఈ దందాతో నిర్వా హకుల జేబులు నిండుతున్నాయే తప్ప పేద, మధ్య తరగతి ప్రజలు రూ.లక్షల్లో నష్ట పోతున్నారు. ఈ జూదం బారిన పడి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తరచూ పట్టుబడిన వారిపై కఠినంగా వ్యవహరిం చాల్సి ఉంది. వారిపై నిరంతరంగా నిఘా సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకుంటే నిర్వాహకులు కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఈ వ్యసనంతో నష్ట పోతున్న తీరును ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే యువతను చైతన్య వంతులను చేయాల్సి ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంపై నిరంతరం ప్రత్యేక నిఘాను సారించాలి. అప్పుడే కొంత మేరకైనా మట్కా జూదం తగ్గు ముఖం పట్టే అవకాశాలున్నాయి.

మట్కా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం

- చంద్రమౌళి (సీసీఎస్‌ సీఐ, ఆదిలాబాద్‌)

జిల్లాలో కొనసాగుతున్న మట్కా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. నిర్వాహకులు కొత్త పద్ధతుల్లో ఆన్‌లైన్‌ ద్వారా జూదాన్ని నిర్వహిస్తున్నారు. పట్టుబడుతున్న వారికి హెచ్చరికలు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పాండ్రకవడకు చెందిన  నిర్వాహకులకు జిల్లాలో కొందరు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కమిషన్‌ రూపంలో నిర్వాహకులు ఆశపెడుతూ డబ్బులను కలెక్షన్‌ చేస్తున్నారు. డ్రా వివరాల నుంచి డబ్బుల చెల్లింపు వరకు మొత్తం ఆన్‌లైన్‌లోనే చేయడంతో పట్టుకోవడం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అయిన నిరంతరం నిఘా సారించి మట్కా జూదరులు, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నాం. 


Updated Date - 2022-05-15T06:38:08+05:30 IST