నిధులేవీ..!

ABN , First Publish Date - 2020-10-31T07:18:45+05:30 IST

భారీ వర్షాలు, వరదలకు గ్రామీణ రోడ్లే కాదు ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి.

నిధులేవీ..!

 గత నెల భారీ వర్షాలు, వరదలకు ఛిద్రమైన రహదారులు

 448.93 కి.మీలు దెబ్బతిన్న రోడ్లు

 శాశ్వత మరమ్మతులకు రూ.237 కోట్లు అవసరం

నివేదికలు పంపిన రోడ్లు భవనాలు, పీఆర్‌ ఇంజనీర్లు

 పైసా ఇవ్వని ప్రభుత్వం

 అత్యవసరమైతే నామినేషన్‌ పనులకు గ్రీన్‌సిగ్నల్‌


(కడప-ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలకు గ్రామీణ రోడ్లే కాదు ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల రహదారులు నడవడానికి కూడా వీలుకాని స్థితికి చేరుకున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. కాగా.. వర్షాలు, వరదలకు రోడ్ల శాశ్వత మరమ్మతులకు రూ.237 కోట్లు అవసరమని రోడ్లు భవనాలు శాఖ, పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. సర్కారు మాత్రం పైసా విదిల్చలేదు. ఫలితంగా గతుకుల రోడ్లపై రాకపోకలు సాగించలేక జనం పడుతున్న వ్యథలెన్నో. 


జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో 4,764.746 కి.మీల ప్రధానమైన రహదారులు ఉన్నాయి. నాలుగు వరుసలు (ఫోర్‌లేన్‌) రోడ్లు 122.169 కి.మీలు, రెండు వరుసల (డబుల్‌ లేన్‌) రోడ్లు 1,054.554 కి.మీలు, ఇంటర్మీడియట్‌ రోడ్లు 193.715 కి.మీలు, సింగిల్‌ లేన్‌ రోడ్లు 3,394.309 కి.మీలు ఉన్నాయి. ప్రధాన రహదారులు దాటుతూ నదులు, వంకలు, వాగులు ప్రవహిస్తున్నాయి. గత నెలలో జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వంకలు వాగులు, నదులు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించాయి. రహదారులు, వంకలు ఏకమయ్యాయి.


వరద ప్రవాహ ఉధృతికి పలు గ్రామాలకు చెందిన రోడ్లు తెగిపోయియి. కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. పలు గ్రామాల్లో రోడ్లు అనవాళ్లే కోల్పోయాయి. ఆ రోడ్లపై జనం రాకపోకలు సాగించలేక పడుతున్న అవస్థలెన్నో. తక్షణమే మరమ్మతులు చేయాలంటూ ఇంజనీర్లకు ప్రజలు విన్నవిస్తున్నారు. అత్యవసరమైన పనులు నామినేషన్‌ పద్ధతిన తక్షణమే చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చినా.. నిధులు రాకపోవడంతో పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని సమాచారం.


పైసా ఇవ్వని ప్రభుత్వం

భారీ వర్షాలకు జిల్లాలో స్టేట్‌ హైవే, జిల్లా ప్రధాన రహదారులు 438.93 కి.మీల మేర దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌ రోడ్లు) 81.21 కిలో మీటర్లు దెబ్బతినగా, 7 చోట్ల ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి. 9 కల్వర్టులు దెబ్బతిన్నాయి. అలాగే.. జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్‌) 367.72 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. 82 రోడ్లు కోతకు గురికాగా, 20 చోట్ల గండ్లు పడ్డాయి. 34 రోడ్డు కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 115 గ్రామాల్లో రోడ్లపై వరద ప్రవహించి, 102 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.


తాత్కాలిక మరమ్మతులకు రూ.20.28 కోట్లు తక్షణ అవసరమని, శాశ్వత మరమ్మతులకు రూ.231.38 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నెల రోజులు గడిచింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. కాగా.. ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడితే తక్షణ మరమ్మతులు నామినేషన్‌ పద్ధతిన చేపట్టమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అలాగే.. జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలోని 86 గ్రామీణ రోడ్లు 25.39 కి.మీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.1.90 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.6 కోట్లు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామని పంచాయతీ రాజ్‌ విభాగం ఎస్‌ఈ సుబ్బారెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, నిధులు రాగానే మరమ్మతులు చేపడతామని ఆయన వివరించారు. 


అత్యవసర పనులు చేయమన్నారు .. నాగరాజు, ఎస్‌ఈ, రోడ్లు భవనాల శాఖ, కడప

జిల్లాలో గతనెలలో కురిసిన భారీ వర్షాలకు స్టేట్‌ హైవే, జిల్లా ప్రధాన రోడ్లు 448.93 కి.మీలు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.20.28 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.231.38 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపాం. నిధులు రాలేదు. అయితే.. ట్రాఫిక్‌ సమస్య ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ మరమ్మతులు నామినేషన్‌ పద్ధతిన చేపట్టమని ఉత్తర్వులు ఇచ్చారు. అత్యవసర పనులు చేస్తున్నాం. 

Updated Date - 2020-10-31T07:18:45+05:30 IST