చెత్తకూ సర్వీస్‌ ఛార్జీ..!

ABN , First Publish Date - 2020-10-02T06:50:41+05:30 IST

పల్లెసీమల్లో పారిశుధ్య నిర్వహణ ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంటోంది. ఆ బాధ్యతను ప్రజలపై నెట్టేస్తోంది. చెత్తకూ పన్ను విధించి ప్రజలపై భారం వేయనుంది.

చెత్తకూ సర్వీస్‌ ఛార్జీ..!

  రోజూ ఇంటికి రూ.2, అంగళ్లకు రూ.3 నుంచి రూ.5..?

 గ్రామాల్లో జనంపై భారం

 నేటి నుంచి మనం-మన పరిశుభ్రత రెండో విడత

 477 పంచాయతీల్లో అమలు


(కడప - ఆంధ్రజ్యోతి): పల్లెసీమల్లో పారిశుధ్య నిర్వహణ ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంటోంది. ఆ బాధ్యతను ప్రజలపై నెట్టేస్తోంది. చెత్తకూ పన్ను విధించి ప్రజలపై భారం వేయనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని మనం-మన పరిశుభ్రత కార్యక్రమం శుక్రవారం నుంచి అమలు చేస్తున్నారు. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో వంద ఎంపిక చేయగా, రెండో విడతలో 477 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, తాగునీటి నిర్వహణ గ్రామ పంచాయతీలు నిర్వహించేవి.


చెత్త సేకరించే కార్మికులకు పంచాయతీలే వేతనాలు చెల్లించేవి. పారిశుధ్య నిర్వహణ యంత్రాలను, పనిముట్లను ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, జనరల్‌ఫండ్‌తో కొనుగోలు చేసేవారు. అయితే ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ ఖర్చును ప్రజలపై మోపేందుకు మనం-మన పరిశుభ్రత అనే కొత్త కాన్సె్‌ప్టను తెర పైకి తెచ్చింది. దీని ప్రకారం ఆ గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 వసూలు చేస్తారు. పంచాయతీల్లో అంగళ్లు, దుకాణాల విస్తీర్ణం, స్థాయిని బట్టి రోజుకు రూ.3 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తారని తెలుస్తోంది. ఈ డబ్బును వలంటీరు, గ్రామ పెద్ద పేరిట బ్యాంకులో చేసిన ఖాతాలకు జమ చేయాలి.


పారిశుధ్య నిర్వహణ యంత్రాలు, సామగ్రిని ఈ నిధుల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బేస్‌లైన్‌ సర్వే పేరిట ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సర్వే నిర్వహించారు. గ్రామాల్లో ఇళ్ల సంఖ్య, నీటి వినియోగం, ప్రభుత్వ ఆస్తులు, చెత్త సంపద కేంద్రాలు, డ్రైనేజీ తదితర వాటి గురించి లెక్కలను బయటికి తీసింది. 


వ్యర్థరహిత పల్లెలుగా తీర్చిదిద్దుతాం...- సి.సుధాకర్‌రెడ్డి, జడ్పీ సీఈవో  

మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలన్నీ వ్యర్థ రహిత స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుతామని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించి అక్కడ వర్మీ కంపోస్టు తయారు చేస్తామన్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ, ఆర్‌డబ్ల్యుఎస్‌, పీఆర్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. పారిశుధ్యంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించి, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. 

Updated Date - 2020-10-02T06:50:41+05:30 IST