అభివృద్ధి ఆనవాళ్లేవీ..?

ABN , First Publish Date - 2020-09-23T06:43:32+05:30 IST

రాజంపేటలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. పైసా నిధుల్లేక.. పట్టించుకునే వారు లేక దాదాపు పదేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

అభివృద్ధి ఆనవాళ్లేవీ..?

 నిధుల్లేక పడకేసిన రాజంపేట అభివృద్ధి 

 పదేళ్లుగా పట్టించుకునే పాలక మండలి కరువు

 రోడ్లు, డ్రైనేజీలకు నోచుకోని కొత్త కాలనీలు

 ఆగిపోయిన గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు


 రాజంపేట, సెప్టెంబరు 22: రాజంపేటలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. పైసా నిధుల్లేక.. పట్టించుకునే వారు లేక దాదాపు పదేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు కూడా ముందుకు సాగడం లేదు. రాజంపేట పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని అధికార పార్టీతో పాటు అందరూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయారు.


జిల్లా కేంద్రానికి కావాల్సిన వనరులను సమకూర్చడంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రం కావాలంటే పట్టణంలో కావాల్సినంత అభివృద్ధి జరగాలి. చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుని రింగ్‌రోడ్డు రూపేణా అభివృద్ధి చేసి ఆ జనాభాను కూడా కలుపుకుని మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఆ పరిస్థితి లేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కూడా ఆగిపోయాయి. రాజంపేట పట్టణం 60 వేల జనాభాతో చుట్టుపక్కల 5 కిలోమీటర్లు విస్తరించి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర్ర అయినా ఇంతవరకు కొద్దిగా కూడా అభివృద్ధి లేదు.


ఎప్పుడో చేసిన అభివృద్ధే తప్ప ప్రస్తుతం ఎక్కడా ఆ ఊసే కనిపించడం లేదు. దెబ్బతిన్న రోడ్లను పట్టించుకోలేదు. రాజంపేట పట్టణానికి ఆనుకుని నలందానగర్‌, సాయినగర్‌ వెనుకభాగంలో బలిజపల్లె వరకు పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. కొత్తగా విలాసవంతమైన భవనాలు వందలకొద్దీ వెలిశాయి. అయితే అందుకు తగ్గట్టు అభివృద్ధి జరగలేదు. ఒక్కో భవనం నిర్మించుకోవాలంటే ప్లాన్‌ అప్రూవల్‌కు మున్సిపాలిటీకి రూ.లక్ష చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో భవనానికి రూ.లక్ష చొప్పున వంద భవనాలకు లెక్కేసుకున్నా మున్సిపాలిటీకి రూ.కోటి ఆదాయం వస్తుంది.


ఈ పద్ధతిలో రాజంపేట ఆర్టీసీ బస్టాండుకు, హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఎర్రబల్లి ప్రాంతంలో కనీసం 300 కొత్త భవనాలు ఏర్పడ్డాయి. బలిజపల్లె, సాయినగర్‌ మధ్య 500 పైబడి కొత్త భవనాలు వెలిశాయి. ఇక మన్నూరు ఉస్మాన్‌నగర్‌, ఆర్‌ఎ్‌సరోడ్డు తదితర అనేక ప్రాంతాల్లో వందలాది కొత్త భవనాలు నిర్మించారు. ఇప్పటి వరకు పట్టణంలో 10 వేల గృహాలు ఉన్నాయి. కొత్తగా మరో 2000 భవనాలు రూపుదిద్దుకున్నాయి. ఈ కొత్త కాలనీల ఏర్పాటుకు, భవన నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతులిచ్చినా వారు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు.


ఆర్టీసీ బస్టాండు నుంచి హైవే రోడ్డు పద్మప్రియ కల్యాణ మండపం వరకు సుమారు రూ.50 లక్షలకు పైగా ఖర్చుతో సిమెంటు రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల ఏర్పాటు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ పనులు ఆగిపోయాయి. కాలువలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతూ దుర్గంధం వెదజల్లుతోంది.


ద్విచక్రవాహనదారులు అందులో పడి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. పట్టణంలోని కొత్త కాలనీలతో పాటు ఉస్మాన్‌నగర్‌, ఈడిగపాలెం, కొలిమివీధి, బలిజపల్లె, నారపురెడ్డిపల్లె, ముకాందారగడ్డ, రెడ్డివారివీధి, రామ్‌నగర్‌, మన్నూరు తదితర ప్రాంతాల్లో అస్థవ్యస్థ డ్రైనేజీ, గుంతలు పడ్డ రోడ్లు కనిపిస్తున్నాయి. ఇక కొత్త కాలనీలకు మట్టి రోడ్లే గతి. నేటికీ పట్టించుకునే నాథుడే లేడు. 


అధికారుల అలసత్వం వల్లే...-మనుబోలు వెంకటేశ్వర్లు, సుద్దగుంతల్‌, రాజంపేట

రాజంపేట పట్టణంలో మున్సిపల్‌ అధికారుల అలసత్వం వల్లే అభివృద్ధి నిలిచిపోయింది. కనీసం మురికి కాలువలు కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదు. ఇకనైనా మున్సిపల్‌ కమిషనర్‌ ఈ సమస్యపై దృష్టి పెట్టాలి.


 

అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్లేరీ..- గుగ్గిళ్ల చంద్రమౌళి, బలిజపల్లె, రాజంపేట

రాజంపేట పట్టణంలో అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్లులేరు. ఇప్పటికీ పల్లె ప్రాంతం ఉన్నట్లు ఇరుకిరుకు రోడ్లు, గుంతలమయమైన సిమెంటు రోడ్లు, కనీసం పూడికలు తీయని డ్రైనేజీ కాలువలే దర్శనమిస్తున్నాయి. కొత్తగా కాలనీలు ఏర్పడినప్పుడు సిమెంటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులు మరుస్తున్నారు. 


Updated Date - 2020-09-23T06:43:32+05:30 IST