బార్లపై కొవిడ్‌ రుసుం

ABN , First Publish Date - 2020-09-23T06:26:41+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఆరు నెలల పాటు మూసుకుపోయిన జిల్లాలోని 30 బార్లలో 13 బార్లు మంగళవారం తెరుచుకున్నాయి.

బార్లపై కొవిడ్‌ రుసుం

 రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను అదనం

 జిల్లాలో తెరుచుకున్న 13 బార్లు

 మద్యంప్రియులపై పడనున్న భారం


కడప (సిటి), సెప్టెంబరు 22 : కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఆరు నెలల పాటు మూసుకుపోయిన జిల్లాలోని 30 బార్లలో 13 బార్లు మంగళవారం తెరుచుకున్నాయి. అయితే ప్రభుత్వం మరో ప్రత్యేకతను జోడించింది. కొవిడ్‌ రుసుం 20 శాతం, రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను పది శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఈ ప్రభావం బార్లపై పడి చివరికి మద్యంప్రియులకు పెనుభారంగా మారనుంది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 22 నుంచి సుదీర్ఘ లాక్‌డౌన్‌ కొనసాగింది.


కొన్ని సడలింపులు కల్పించినా బార్లకు అనుమతినివ్వలేదు. ఎట్టకేలకు అన్‌లాక్‌-4లో కేంద్రం మార్గదర్శకాల మేర రాష్ట్ర ప్రభుత్వం బార్లు తెరుచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈనెల 19 నుంచి వచ్చే సంవత్సరం జూన్‌ 30 వరకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఖరారు చేసింది.


ఒక్కో బార్‌కు రూ.14.14 లక్షలు

జిల్లాలో 30 బార్లు ఉన్నాయి. నూతన మార్గదర్శకాల మేర 50 వేల జనాభా లోపు కేటగిరీ-1, అక్కడి నుంచి 5 లక్షల జనాభా వరకు కేటగిరీ-2, 5 లక్షల పైబడి జనాభా ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3గా విభజించారు. దీంతో కడప జిల్లాలోని 30 బార్లు 50 వేలకు పైబడి ఐదు లక్షల లోపు జనాభా విభాగాల్లోకి రానున్నాయి. కొత్త ఉత్తర్వుల మేర ఈనెల 19 నుంచి వచ్చే సంవత్సరం జూన్‌ 30 వరకు లైసెన్సు ఫీజు కింద రూ.1,41,139, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ కింద రూ.12,72,949 మొత్తం రూ.14,14,088 చెల్లించాల్సి ఉంటుంది. 


మద్యం ప్రియులపై ధరల మోత

కొవిడ్‌ రుసుంతో పాటు మద్యం కొనుగోలుపై పది శాతం రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం పెంచినట్లు తెలుస్తోంది. ఇది కూడా కలిస్తే మొత్తం 30 శాతం బార్లపై అదనంగా పడుతోంది. అంటే ఈ భారం మద్యంప్రియులే భరించాల్సి ఉంటుంది. హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గుటకేస్తామనుకుంటే మద్యం ప్రియులకు ధరల మోత నిషాను మరింత పెంచనుంది. 

Updated Date - 2020-09-23T06:26:41+05:30 IST