పాపాఘ్నిలో పాగా వేశారు

ABN , First Publish Date - 2020-08-06T10:07:15+05:30 IST

పాపాఘ్నిలో పాగా వేశారు

పాపాఘ్నిలో పాగా వేశారు

నదిని ఆక్రమించి పంటల సాగు 

ఫ భూముల విక్రయాలు

ఫ పట్టించుకోని యంత్రాంగం


(కడప - ఆంధ్రజ్యోతి):  ఆక్రమించాలనే కలేజా ఉండాలే కానీ ప్రభుత్వ భూములు, రహదారి స్థలాలు, కొండలు, వాగులు, వంకలేంటి చివరికి నదీ భూములు సైతం అక్రమార్కుల పరమవుతున్నాయి. ఆక్రమించేసిన భూములను అమ్ముకోవడంలో కూడా మాకు మేమే సాటి అని నిరూపిస్తూ కొందరు ఇప్పుడు పాపాఘ్ని నదిలో పాగా వేశారు. జిల్లాలో పాపాఘ్నినది చక్రాయపేట, వేంపల్లె, పెండ్లిమర్రి, కమలాపురం, వల్లూరు మండలాల్లో విస్తరించి ఉంది. నదికి ఇరువైపులా నదీ భూములు ఉన్నాయి. అయితే కొందరు ఆక్రమణదారులు పాపాఘ్నిపై కన్నేసి ఆ భూములను ఆక్రమించేస్తున్నారు. పాపాఘ్ని ఆక్రమణలపై మూడు మాసాల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం కొందరిపై చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆక్రమణలకు తెరలేపారు. 


ఆక్రమించేసెయ్‌.. అమ్మేసెయ్‌

పాపాఘ్ని నదీ తీరాన్ని ఆక్రమించిన కొందరు ఆ భూములను అమ్మేస్తుండడం గమనార్హం. వర్షాకాలంలో నది పారుతుంది. దీంతో ఒండ్రుమట్టి వచ్చి ఇరువైపులా పేరుకుపోతుంది. వీటిల్లో పంటలు సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుంది. దీంతో కొందరు రైతులు ఆ భూములు కొంటున్నారు. వేంపల్లె, చక్రాయపేటల్లో ఆక్రమించిన భూములను ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున విక్రయించేసినట్లు తెలుస్తోంది. ఈ భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ కావు. కేవలం అగ్రిమెంట్ల మీదనే లావాదేవీలు జరుగుతుంటాయి. ఆ రెండు మండలాల్లోనే 300 ఎకరాలు అగ్రిమెంట్ల మీదనే చేతులు మారినట్లు తెలుస్తోంది.


ఆక్రమించేశారు

పెండ్లిమర్రి మండలంలో నది పోరంబోకు భూములపై ఆక్రమార్కులు కన్నేశారు. కొండూరు రెవెన్యూ గ్రామ పరిధిలో 449 ఎకరాల నదీ పోరంబోకు భూమి రికార్డుల్లో ఉంది. ఇక్కడ సుమారు వంద ఎకరాలను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. వరి, వేరుశనగ పంటలు సాగు చేశారు. నందిమండలం, తుమ్మలూరు గ్రామ ప్రాంతాల్లో కూడా భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇక్కడ పంటలు సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఆక్రమించిన భూములను కొందరు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నది పరీవాహక ప్రాంతం ఆక్రమణలతో కుచించుకునిపోవడం వల్ల వరదలు వస్తే నీరు పల్లెల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఆక్రమణల వెనుక కొందరు నేతల హస్తం ఉండడంతో అధికారులు లైట్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే నది స్వరూపమే మారిపోతుంది. కొందరి కారణంగా రాబోయే రోజుల్లో ఒకప్పడు ఇక్కడ నది ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికైనా అధికారులు స్పందించి నది భూములను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-08-06T10:07:15+05:30 IST