దారుణం..! కాళ్లు, చేతులు కట్టేసి.. ఆటోలో తీసుకొచ్చి..

ABN , First Publish Date - 2020-07-02T16:52:50+05:30 IST

మంచీ చెడుల విచక్షణ తెలియని మనిషతను. ఎక్కడ ఎలా మెలగాలో..

దారుణం..! కాళ్లు, చేతులు కట్టేసి.. ఆటోలో తీసుకొచ్చి..

ప్రొద్దుటూరు(కడప): మంచీ చెడుల విచక్షణ తెలియని మనిషతను. ఎక్కడ ఎలా మెలగాలో, ఏ పని ఎందుకు చేయాలో అతనికి తెలీదు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ యువకుడిపట్ల వైద్య సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. కరోనా పరీక్షల్లో భాగంగా స్వాబ్‌ సేకరణకు కుటుంబ సభ్యుల వెంట వచ్చి అక్కడి పరిస్థితిని చూసి, భయపడి పారిపోయిన అతడిని సిబ్బంది వెతికి పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో తీసుకొచ్చారు. ఈ దారుణ ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు..


ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు (కవలలు) ఉన్నారు. వీరందరికీ కరోనా స్వాబ్‌ టెస్టింగ్‌ చేయించుకోవాలని వైద్యాధికారులు తెలిపారు. అయితే కవలల్లో ఒకరు వికలాంగుడు. అతనిది నడవలేని పరిస్థితి. మరొకరు మానసిక వికలాంగుడు. అతనిది ఏమీ తెలియని పరిస్థితి. వీరిద్దరి పరిస్థితిని మిగిలిన కుటుంబసభ్యులు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ ఇద్దరికి ఇంటి వద్దనే కరోనా స్వాబ్‌ టెస్టింగ్‌ తీసుకోవాలని, హోం క్వారెంటైన్‌కు అనుమతిచ్చాలని కోరారు. ఇందుకు వైద్యాధికారులు వీలు కాదని చెప్పారు. దీంతో వారంతా కలిసి స్వాబ్‌ టెస్టింగ్‌ కోసం మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి వచ్చారు. మధ్యాహ్నం వరకు కూడా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు.


ఇదిలా ఉండగా మానసిక వికలాంగుడైన ఆ యువకుడు అస్పత్రి వాతావరణం చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులతో పాటు, వైద్య సిబ్బంది అతడి కోసం గాలించారు. పట్టణ శివారు బైపా్‌స రోడ్డులో ఉన్నాడన్న సమాచారంతో సిబ్బంది బుధవారం అక్కడికి వెళ్లి అతడి కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి, అతిదుర్మార్గంగా ఆటోలో తీసుకువచ్చారని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనా టెస్టింగ్‌, క్వారెంటైన్‌ విషయంలో అధికార యంత్రాంగం పెద్దలకు ఒకలాగ, పేదలకు మరోలాగ చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పై తరహా కుటుంబాలకు కరోనా టెస్టింగ్‌, క్వారెంటైన్‌ విషయంలో మినహాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


విధి లేని పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వచ్చింది

ప్రొద్దుటూరు పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతని కాంటాక్టుకు సంబంధించిన వ్యక్తులకు కరోనా టెస్టు చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా అతడి కుటుంబ సభ్యులకు పరీక్ష చేసేందుకు ప్రయత్నించాం. అయితే కుటుంబ సభ్యుల్లోని ఓ వ్యక్తి మానసిక వికలాంగుడు కావడంతో జనాలను చూసి పారిపోతుండటంతో నిర్బంధించి పరీక్షలు నిర్వహించాం. టెస్ట్‌ అయిపోగానే ఆ కుటుంబ సభ్యులను అందరినీ ఇంటికి చేర్చాం.

- డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి, కోవిడ్‌ ఫీల్డ్‌ ఇన్‌చార్జ్‌, ప్రొద్దుటూరు


Updated Date - 2020-07-02T16:52:50+05:30 IST