సెలూన్‌ షాపులకు ఓకే..!

ABN , First Publish Date - 2020-05-21T10:41:58+05:30 IST

కరోనా కట్టడికోసం లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నారు.

సెలూన్‌ షాపులకు ఓకే..!

  • ఆంక్షలకు లోబడి దుకాణాల నిర్వహణకు అనుమతులు 
  • కంటైన్మెంట్‌ జోన్లో ఎలాంటి షాపులు తెరవరాదు
  • మరో మూడు కేసులు నమోదు

కడప, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా కట్టడికోసం లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్లో ఎలాంటి షాపులు తెరిచేందుకు అనుమతులు లేవు. కంటైన్మెంట్‌ కాని ప్రాంతాల్లో ఆంక్షలకు లోబడి దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం పేర్కొన్నారు. కరోనా టెస్టుల్లో, 40 నిమిషాల్లో ఫలితాలు ఇవ్వడంలోనూ జిల్లా రెండవ స్థానంలో ఉందని వివరించారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.


మార్గదర్శకాలు ఇవీ

పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలకు అనుమతి లేదు.

హోటల్స్‌, లాడ్జీలు, బార్‌లు తెరవరాదు. హోటల్స్‌, రెస్టారెంట్లు పార్సిళ్లకు మాత్రమే అనుమతి.

సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌ సెంటర్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, వినోద పార్కులు తెరవరాదు.

క్రీడా ప్రాంగణాలకు అనుమతి ఉంటుంది. ప్రేక్షకులను అనుమతించరు.

అన్ని సామాజిక రాజకీయ, క్రీడ, వినోద, సాంస్కృతిక మత సంబంధిత సభలు నిషేధం.

60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు బయటకు రాకూడదు. 

రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే రైతులు, వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతులు ఇస్తారు.

సరుకు రవాణాకు అనుమతి ఉంటుంది.

దుకాణాల వద్ద వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగులు ఉండేలా మార్కింగ్‌ వేయాలి. శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలి.

మెడికల్‌ షాపులకు 24 గంటలు అనుమతిస్తారు. 

సెలూన్‌షాపులు, హైబడ్జెట్‌ సెలూన్‌షాపులు నిబంధనలకు లోబడి నిర్వహించవచ్చు. 


సెలూన్‌షాపుల్లో నిబంధనలు

వచ్చే కష్టమర్ల పేరు, అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌ రిజిస్టరు చేయాలి.

బార్బర్‌, కస్టమర్‌ ఇద్దరూ మాస్కులు, గ్లౌజులు ధరించాలి.

కస్టమర్లు తమ వెంట టవల్‌ తెచ్చుకోవాలి. 

భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్స్‌ వాడాలి.

జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న వారికి అనుమతి లేదు. 

షాపులు మూసే ముందు శానిటైజ్‌ చేయాలి.

హై బడ్జెట్‌ సెలూన్‌ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు పీపీఈ కిట్స్‌, కంటిఅద్దాలు, మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి.


మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో బుధవారం మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు డీఎంఅండ్‌ హెచ్‌వో ఉమాసుందరి తెలిపారు. రాయచోటి మండలంలో ఒకరికి, ఓబులవారిపల్లెలో ఒకరికి, మహారాష్ట్రకు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆమె వివరించారు. ఈ మూడు కేసులతో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 112 చేరింది.

Updated Date - 2020-05-21T10:41:58+05:30 IST