వానొస్తే అంతే..!

ABN , First Publish Date - 2021-06-15T06:04:54+05:30 IST

కడప వ్యవసాయ మార్కెట్‌ యార్డు రాయలసీమ జిల్లాల్లోనే ఏకైక పసుపు విక్రయ మార్కెట్‌. జిల్లాలోని పసుపు రైతులే కాదు.. కర్నూలు జిల్లా నుంచి పసుపు రైతులు ఈ మార్కెట్‌కే వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 660 క్వింటాళ్ల పసుపు,

వానొస్తే అంతే..!
కడప వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పిల్లర్లకే పరిమితమైన జంబోషెడ్డు నిర్మాణం

రూ.2.60 కోట్లతో జంబో షెడ్డు, పాలన భవన నిర్మాణం

బిల్లులు రాక అర్ధంతరంగా ఆగిపోయిన పనులు

ఆరుబయటే పసుపు, వేరుశనగ విక్రయాలు

వర్షం పడితే పంట తడిసి అన్నదాతకు తీవ్ర నష్టం

తాగునీటికి ఇక్కట్లు.. ఎక్కడి చెత్త అక్కడే

కడప మార్కెట్‌ యార్డు దుస్థితి ఇదీ


రైతులు పండించిన పంట దగుబడులు గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి వేదిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు. అటువంటి మార్కెట్‌ యార్డులో అమ్మకానికి వచ్చిన పసుపు, వేరుశనగ దిగుబడులు వర్షం వస్తే తడవాల్సిందే. వర్షానికి తడిసిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొన్నా వానకు తడిసిందని.. నాణ్యత కోల్పోయిందని ధర తగ్గిస్తున్నారు. వీటిని నివారించేందుకు రూ.60 లక్షలతో చేపట్టిన జంబో షెడ్డు నిర్మాణాలు నిధుల లేమితో అర్ధంతరంగా ఆగిపోయాయి. తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఎక్కడి చెత్త అక్కడే వదిలేశారు. కడప మార్కెట్‌ యార్డులో నెలకొన్న సమస్యలపై ప్రత్యే కథనం..


(కడప-ఆంధ్రజ్యోతి): కడప వ్యవసాయ మార్కెట్‌ యార్డు రాయలసీమ జిల్లాల్లోనే ఏకైక పసుపు విక్రయ మార్కెట్‌. జిల్లాలోని పసుపు రైతులే కాదు.. కర్నూలు జిల్లా నుంచి పసుపు రైతులు ఈ మార్కెట్‌కే వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 660 క్వింటాళ్ల పసుపు, 1,398 క్వింటాళ్ల వేరుశనగను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. సీజనలో రైతులు రోజుకు 5 వేల నుంచి 10 వేల క్వింటాళ్లు తీసుకొస్తారు. రైతుల పంట విక్రయాల ద్వారా సెస్సు రూపంలో మార్కెట్‌కు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఏటా ఆదాయం వస్తుంది. దూరం ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు యార్డులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రజా ప్రతినిధులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కనీస వసతుల లేమితో కష్టజీవులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.


అసంపూర్తిగా జంబో షెడ్డు

పంట దిగుబడులు భారీగా వస్తే వాటిని ఉంచడానికి పెద్ద గోడౌన లేదు. దీంతో ఆరుబయట ప్లాట్‌ఫాంపైనే టెండరు కోసం రైతులు నిట్టుకడుతున్నారు. వర్షం వస్తే పంట దిగుబడులు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా ఇదే పరిస్థితి. పంట దిగుబడులు వానకు తడవకుండా విక్రయాలు నిర్వహించేందుకు రూ.60 లక్షలతో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జంబో షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.30 లక్షలతో సివిల్‌ వర్క్స్‌, మరో రూ.30 లక్షలతో ఒక మి.మీ మందంతో కొరియా ఇనుప రేకులతో షీటింగ్‌ వేయాలి. ఇప్పటి వరకు 32 పిల్లర్లు నిర్మించారు. సీసీ ఫ్లోరింగ్‌, షీటింగ్‌ పనులు చేయాల్సి ఉంది. పనులు పర్యవేక్షించే ఏఈతో గొడవ కారణంగా కాంట్రాక్టరు ఈ పనులు  చేయలేనంటూ వెళ్లిపోయారు. మరో సబ్‌ కాంట్రాక్టరుతో పనులు చేయిస్తున్నా నిధులు లేక సకాలంలో బిల్లులు రాక సివిల్‌ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. కొరియా షీటింగ్‌ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. పసుపు ధర కాస్త ఆశాజనకంగా ఉండడంతో ఇప్పుడిప్పుడే రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వానొస్తే పసుపు తడిసిపోతే వ్యాపారులు కొనుగోలు చేయరని, ఒకవేళ కొనుగోలు చేసినా ధర భారీగా తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తాగునీటికి ఇక్కట్లు.. ఎక్కడి చెత్త అక్కడే

- మార్కెట్‌ యార్డుకు రోజూ వంద మందికిపైగా రైతులు పంట విక్రయాలకు వస్తున్నారు. ఉదయం వచ్చిన రైతులు సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. గిట్టుబాటు ధర రాకపోతే నిట్టుకట్టి రాత్రి కాపలాగా పడుకోవాలి. ఇక్కడ కొళాయిలు ఉన్నా.. విద్యుత మోటర్‌ మరమ్మతు వల్ల నీటి సరఫరా లేదు. తాగునీటి కోసం రైతులు తల్లడిల్లుతున్నారు. నీటి బాటిళ్లు, ప్యాకెట్లు కొనుక్కొని దాహం తీర్చుకుంటున్నారు. మార్చి నెల నుంచి ఇదే పరిస్థితి. హమాలీలు శరీరం శుభ్రం చేసుకోవడానికి కూడా నీళ్లు లేవు.

- మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలు, మట్టి, చెత్త ఎక్కడికక్కడే వదిలేశారు. అక్కడే రైతులు మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నారు. వర్షం వస్తే తడిసి దుర్గంధం వెదజల్లుతోందని, ఇప్పటికైనా మార్కెట్‌ అధికారులు స్పందించి చెత్త తొలగించాలని రైతులు, వ్యాపారులు, కమిషన ఏజెంట్లు కోరుతున్నారు. అలాగే.. పండ్ల గోదాముల వద్ద ఫ్రూట్స్‌ వ్యర్థాలతో దుర్గంధం వ్యాపిస్తోంది. 

- మార్కెట్లో స్వీపర్లు 11 మంది పనిచేస్తున్నారు. వారికి ఇచ్చే వేతనం రూ.7 వేలే. అదికూడా నాలుగైదు నెలలుగా ఇవ్వడంలేదు. మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర అధికారులకు బిల్లులు పంపాం.. నిధులు మంజూరు కాలేదని అధికారులు అంటున్నారు. 


తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం 

- వీవీ రమణ, మార్కెట్‌ హమాలీల సంఘం అధ్యక్షుడు

మార్కెట్లో తాగునీరు లేదు. పనులు చేసిన తరువాత శరీరం శుభ్రం చేసుకోవడానికి హమాలీలకు కూడా నీటి ఇబ్బంది తప్పడం లేదు. మార్కెట్‌కు వచ్చే రైతులు తాగునీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బయట బాటిల్‌ రూ.20లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తక్షణమే మరమ్మతులు చేసి తాగేదానికి, వాడుకునేదానికి నీటిని అందించాలి. 


వానొస్తే పంట తడవాల్సిందే 

- ఎం.నాగసుబ్బయ్య, పసుపు రైతు, బలిజపల్లి గ్రామం, సీకే దిన్నె మండలం

పసుపు 14 బస్తాలు మార్కెట్‌కు తెచ్చాను. అమ్మకానికి ఆరుబయట ఫ్లాట్‌ఫాంపైనే రాసిపోశాను. మేఘాలు కమ్ముకున్నాయి. వానొస్తే పసుపు తడిసిపోతుంది. తడిసిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయరు. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అసంపూర్తిగా ఉన్న జంబో షెడ్డు పనులు పూర్తి చేయాలి.


లీటరు రూ.20లకు కొనలేక  

- కె.రంగయ్య, వేరుశనగ రైతు, ఉప్పలవరం గ్రామం, మైదుకూరు మండలం

మూడు ఎకరాల్లో వేరుశనగ కాయలు అమ్మకానికి మార్కెట్‌కు తీసుకొచ్చాను. ఇక్కడ రైతులకు కనీస సౌకర్యాలు లేవు. దాహమేసి కొళాయిల వద్దకు వెళితే నీళ్లు రావడం లేదు. బయట కొందామంటే లీటరు రూ.20 పైగానే. రోజంతా నీళ్లు తాగాలంటే కనీస మూడు బాటిళ్లకు రూ.60 ఖర్చు చేయాలి. అంత డబ్బు లేకపోవడంతో నాలుగు వాటర్‌ ప్యాకెట్లు తెచ్చుకొని పొదుపుగా తాగుతున్నాం.


మరమ్మతులు చేపడతాం 

- కల్పన, మార్కెట్‌ సెక్రెటరి, కడప

విద్యుత మోటర్‌ మరమ్మత్తువల్ల తాగునీరు అందడం లేదని ఈ రోజే తెలిసింది. తక్షణమే మరమ్మతులు చేసి రైతులకు తాగునీరు అందిస్తాం. మార్కెట్లో పేరుకుపోయిన చెత్త, చెదారం తొలగిస్తాం. నిధులు రాగానే అసంపూర్తిగా ఉన్న జంబో షెడ్డు పనులు పూర్తి చేస్తాం.



Updated Date - 2021-06-15T06:04:54+05:30 IST