భువనేశ్వరి అనుమతిస్తే కన్నీటితో కాళ్లు కడుగుతాం

ABN , First Publish Date - 2021-12-05T08:23:13+05:30 IST

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అనుమతిస్తే ఎమ్మెల్యేలు అందరం ఆమె కాళ్లను కన్నీటితో కడుగుతాం’’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు..

భువనేశ్వరి అనుమతిస్తే కన్నీటితో కాళ్లు కడుగుతాం

  • వంశీ మా పార్టీ నేత కాదు..
  • ఆయన చేసిన వ్యాఖ్యలను మా పార్టీకి ఎలా ఆపాదిస్తారు?
  • వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు

ప్రొద్దుటూరు, డిసెంబరు 4: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అనుమతిస్తే ఎమ్మెల్యేలు అందరం ఆమె కాళ్లను కన్నీటితో కడుగుతాం’’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ టీడీపీ ‘గౌరవసభ’ పేరుతో ఆ పార్టీ అధినేత భార్యను అగౌరవ పరుస్తున్నారన్నారని విమర్శించారు. ఈ అంశంతో తమకు సంబంధం లేకపోయినా ఒక మహిళను అగౌరవపరచడం బాధ కలిగిస్తోందని చెప్పారు. శాసనసభలో భువనేశ్వరి పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాట తప్పని రాచమల్లు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబసభ్యులను ఏమీ అననప్పటికీ, ఏదో అన్నట్లు ఒక ప్రచారం చేస్తున్నారని అన్నారు. అగౌరవంగా మాట్లాడిన వల్లభనేని వంశీ తమ పార్టీ నేత కారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీకి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. వంశీ వైసీపీ ఎమ్మెల్యే కానప్పటికీ ఆయన మాట్లాడటం తప్పని అన్నారు.


ఈ విషయంలో భువనేశ్వరి ఒప్పుకొంటే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కన్నీళ్లతో ఆమె కాళ్లు కడుగుతామన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం భార్యను స్వయంగా అవమానిస్తున్నారని అన్నారు. వీధుల్లో ఈ అంశంపై టీడీపీ నాయకులు మాట్లాడటం బాధగా ఉందన్నారు. ప్రజాసమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం పోరాడితే బాగుంటుందని సూచించారు. మహిళలు పూజింపబడాలనేదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు.

Updated Date - 2021-12-05T08:23:13+05:30 IST