కడప బాలుడు దొరికాడు!

ABN , First Publish Date - 2022-05-20T07:08:15+05:30 IST

రుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు ఆచూకీ లభ్యమైంది.

కడప బాలుడు దొరికాడు!
రంగస్వామిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ

కిడ్నా్‌పకు గురయ్యాడన్న డీఎస్పీ

తల్లిదండ్రులకు చిన్నారి అప్పగింత


తిరుపతి(నేరవిభాగం), మే 19: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు ఆచూకీ లభ్యమైంది. బాలుడు తప్పిపోలేదని ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేశాడని, తాము గాలించి పట్టుకున్నామని ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. గురువారం సాయంత్రం ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో వివరాలను మీడియాకు తెలియజేశారు. కడప నగరం చిన్నచౌక్‌ ఏరియా దండోరా కాలనీకి చెందిన పరశురాం, రేణుక దంపతులు ఇత్తడి, రాగి ఉంగరాలు, కంకణాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. గంగమ్మ జాతర సందర్భంగా వ్యాపార నిమిత్తం వారు ఈనెల 15వ తేదీన తమ ఇద్దరు కుమారులు రంగస్వామి (4), భరత్‌కుమార్‌ (2)తో కలిసి తిరుపతికి వచ్చారు. గంగమ్మ ఆలయ పరిసరాల్లో అంగడి పెట్టుకున్నారు. 16వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో రంగస్వామి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నేతృత్వంలో సీఐ శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన బాలుడిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించి.. అన్ని జిల్లాల పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. మీడియాలోనూ విస్తృత ప్రచారం చేయించారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఓడీ చెరువు మండలం డబురువారిపల్లెకు చెందిన మసే నరసింహులు అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జాతరకు వెళ్లిన సమయంలో బాలుడు ఒంటరిగా కనిపించడంతో తనతోపాటు తీసుకొచ్చానన్నాడు. ఇతను తిరుపతిలో మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడిపై అనంతపురం పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 

Updated Date - 2022-05-20T07:08:15+05:30 IST