Abn logo
May 17 2021 @ 22:05PM

కాలుష్యం కోరల్లో గ్రామాలు

 విద్యుత్‌ ప్లాంట్లతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం

తోటపల్లిగూడూరు, మే 17 : తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ పరిశ్రమలతో సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. మండలంలోని ఈదూరు, అనంతపురం, మండపం, గొల్లపాళెం, శివరామపురం, వరకవిపూడి గ్రామాల చుట్టూ విద్యుత్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయటంతో కాలుష్యంతో విలవిలలాడుతున్నాయి. ఈ పంచాయతీల్లో సుమారు 12వేల జనాభా నివసిస్తున్నారు. తీరప్రాంతంలో నెలకొల్పబడిన విద్యుత్‌ పరిశ్రమలకు కేవలం 4కి.మీ దూరంలోని ఈ గ్రామాలు ఉన్నాయి. అధికశాతం ప్రజలు వ్యవసాయంపై ఆఽధారపడి జీవనం  సాగిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలో ఎన్‌సీసీ, సెమ్‌కార్బు కంపెనీ పరిశ్రమలు ద్వారా గ్రామాల్లో కాలుష్యం వదులుతున్నాయి. ఆ కంపెనీలు నుంచి వెలువడుతున్న ప్రమాదపు రసాయనిక ధూళి, వాయు కాలుష్యం ఆ భూములను చుట్టుముట్టి స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ  వ్యాధులతో బాధపడుతున్నారు. మృత్యువుకు దగ్గరవుతున్నారు. ఈ కాలుష్యంతో పరిశ్రమలు ద్వారా వచ్చే దుమ్ము, ధూళి, ట్రాన్స్‌ఫార్మర్లపై చేరి విద్యుత్‌ లైన్లు నిరంతరం అంతరాయం ఏర్పడి గృహాలకు సరిగా విద్యుత్‌ ఉండటం లేదని పలుమార్లు సబ్‌స్టేషన్‌ల ఎదుట ప్రజలు నిరసన వ్యక్తం చేసినా సంబంధిత శాఖ పట్టించుకున్న పాపాన పోలేదు. కాలుష్యం అధికమయ్యే గ్రామాల్లో ఎక్కడ బోరువేసినా ఉప్పునీరే వస్తుండడంతో తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. సాగునీటి కాలువల్లో సాగునీరుసైతం ఉప్పుగా మారి పంటలు సక్రమంగా పండడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు పలు దఫాలు పరిశ్రమల ఎదుట నిరసన వ్యక్తం చేసినా కంపెనీ యజమానులు కాని ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కంపెనీ పెద్దలు కూడా పట్టించుకోవటం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Advertisement