కాళి మరోసారి!

ABN , First Publish Date - 2020-05-31T05:32:05+05:30 IST

ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే సహనంతో పాటు, ఏదైనా ఉపద్రవం ఎదురొస్తే ‘కాళి’లా మారే శక్తి మహిళకు ఉంది. పురాణాల నుంచి ఈనాటి దాకా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉంటాయి...

కాళి మరోసారి!

ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే సహనంతో పాటు, ఏదైనా ఉపద్రవం ఎదురొస్తే ‘కాళి’లా మారే శక్తి మహిళకు ఉంది. పురాణాల నుంచి ఈనాటి దాకా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. తన బిడ్డ కోసం పరిస్థితులతో పోరాడిన ఆధునిక ‘కాళి’ కథ ఇది. 2018లో వచ్చిన ‘కాళి’ వెబ్‌ సిరీస్‌ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. తాజాగా ‘కాళి 2’ (రెండో సీజన్‌) ‘జీ 5’లో శుక్రవారం (మే 29) విడుదలయ్యింది.


ఒక సాధారణ మహిళకు జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురైతే, ఆమె వాటిని భరించాలి లేదంటే తెగించాలి. ఒకవైపు భర్త డ్రగ్‌ మాఫియా హత్యకేసులో జైలుకు వెళ్లాడు. మరోవైపు కొడుకు ఇంట్లో వీల్‌చైర్‌కే పరిమితమై ఉన్నాడు. ఎట్టిపరిస్థితుల్లో తన కొడుకు సన్నీకి ఆపరేషన్‌ చేయించాలి. నిస్సహాయ పరిస్థితుల్లో ‘కాళి’కి తన భర్త ఇంట్లో దాచిన డ్రగ్స్‌ను అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. క్రమక్రమంగా ఆమె చుట్టూ డ్రగ్‌మాఫియా ఉచ్చు బిగుస్తుంది. మరోవైపు పోలీసుల వేట తప్పలేదు. ప్రతీ అడుగూ ప్రమాదకరమే... అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. కొడుకును దక్కించుకోవడానికి ఒక తల్లి ధైర్యాన్ని కూడగట్టుకుని అత్యంత ప్రమాదకర పరిస్థితులతో చేసే పోరాటం... బిడ్డ కోసం పడే వేదనకు దృశ్యరూపమే ‘కాళి’.


‘కాళి’ తొలి సీజన్‌లో 8 ఎపిసోడ్లు ‘పీతాంబరి’, ‘మాతంగి’, ‘ధూమవతి’, ‘భైరవి’ వంటి పేర్లతో రూపొందితే, మలి సీజన్‌లోని 8 ఎపిసోడ్లు ‘అజ్ఞాత’, ‘సంకట’, ‘కాళరాత్రి’, ‘ప్రస్థాన’, ‘రూప్‌ వికారా’, ‘ముక్తి’ పేర్లతో ఉంటాయి. మొత్తంగా ‘కాళి 2’ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌. ఒకవైపు కొడుకును బతికించుకోవాలనే నిస్సహారాయులైన తల్లి వేదన... పోలీస్‌ కస్టడీలో ఆమె ఇంటరాగేషన్‌... మరోవైపు జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడు... నగరంలో డ్రగ్‌ మాఫియా... వీటన్నింటి మధ్య ఒంటరి మహిళ సాగించిన పోరాటం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ పోరాటంలో విజయమే లక్ష్యంగా, తన కొడుకు కోసం ఎంతకైనా తెగించే మహిళగా ‘కాళి’ నిజంగానే అపర కాళికగా కనిపిస్తుంది.


‘‘నమ్మిన నిజం కోసం పోరాటం సాగించే ప్రతీ మహిళ పట్ల నాకు గౌరవం ఉంటుంది. ఇందులో కాళి కూడా నమ్మకానికి, శక్తికి మరోరూపంగా కనిపిస్తుంది. అనేక అసమానతలను ఎదుర్కొంటూ తన బిడ్డను రక్షించుకునేందుకు ఒక తల్లి ఏం చేసిందనేది చూడొచ్చు. ఈ పాత్ర విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి. ఆమె చాలా శక్తిమంతురాలు. ఆమే నా ‘కాళి’... నా జీవితానికి శక్తి’’ అన్నారు కాళి పాత్ర పోషించిన పవోలీ డామ్‌. ‘కాళి’గా టైటిల్‌ రోల్‌కు ఒకవిధంగా ఆమె జీవం పోశారని చెప్పొచ్చు. ఆమెతో పాటు రాహుల్‌ బెనర్జీ, చందన్‌ రాయ్‌ సన్యాల్‌, అభిషేక్‌ బెనర్జీ, విద్యా మాల్వాడే ముఖ్య భూమిక పోషించారు. దర్శకుడు కొరోక్‌ ముర్ము రూపొందించిన ‘కాళి’ వెబ్‌ సిరీస్‌ జీ5లో అందుబాటులో ఉంది.


Updated Date - 2020-05-31T05:32:05+05:30 IST