బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి!

ABN , First Publish Date - 2020-12-05T16:42:15+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వనున్నారా? కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం

బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి!

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వనున్నారా? కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లు సమాచారం. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బరిలోకి కూడా దిగనున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా రాజకీయంగా, పార్టీ కార్యకలాపాల పరంగా స్తబ్దుగా ఉన్న జానారెడ్డి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా తిరిగి క్రియాశీలం కావాలని డిసైడ్ అయినట్లు ఆయన ఆంతరంగికులు పేర్కొంటున్నారు. 


దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ.... ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ పునాదులను పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు మళ్లించుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా ఢిల్లీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డిని బీజేపీ కదిపిందని నేతలు పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్ పై రాజకీయంగా జానారెడ్డికి ఎనలేని పట్టుంది. తద్వారా నాగార్జున సాగర్‌లో పాగా వేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి.


ఈ నియోజకవర్గంపై బీజేపీ జెండాను ఎగువరేసి, అటు టీఆర్‌ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లోనే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని బీజేపీ మొదట నిర్ణయించుకుందని వార్తలొచ్చాయి. జానారెడ్డి కూడా అందుకు సిద్ధమైపోయారు. అయితే బీజేపీ నేతల చర్చలతో జానారెడ్డి మనసు మార్చుకున్నట్లు సమాచారం. కుమారుడు రఘువీర్ కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

Updated Date - 2020-12-05T16:42:15+05:30 IST