Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

హెపటైటిస్‌ గురించి చెబుతుంటే.. వాజిపేయి నిద్రపోయారు

twitter-iconwatsapp-iconfb-icon
హెపటైటిస్‌ గురించి చెబుతుంటే.. వాజిపేయి నిద్రపోయారు

‘శాంతా’ దాహం తీరలేదు.. ఇప్పటికీ ఫ్యాక్టరీకి నీళ్లివ్వలేదు

ఇద్దరు సీఎంల హామీలు నీటి మూటలే అయ్యాయి

బాపు- రమణలను చాలామంది మోసం చేశారు

హాస్యం సంగీతంతో దేన్నయినా మార్చవచ్చు

7-3-11న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో వరప్రసాద్‌ రెడ్డి


ఎక్కడో నెల్లూరు జిల్లాలో సత్రం స్కూల్లో చదివి.. ఈ స్థాయికి ఎదగడమంటే ఏమనిపిస్తోంది?

నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను కాకూడనివి చాలా అయ్యాను. నన్ను పెంచినది నిఖార్సైన కమ్యూనిస్టు. నేను పెట్టుబడిదారు కాకూడదనేవారు.. అయ్యాను. మాది రైతు కుటుంబం. ప్రతిదానికీ అప్పులే. ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నాను. మా కార్మికులకు షేర్లిచ్చాను. సంగీతం నేర్చుకుందామనుకుంటే.. ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌ చదివాను. డిఫెన్స్‌ ఆర్‌అండ్‌డిలోను, ఏపీఐడీసీలోను, బ్యాటరీ పరిశ్రమలోను ఏడేసేళ్లు చేశాను. శాంతాలోనే ఎక్కువకాలం ఉన్నాను.


ఉద్యోగం ఎందుకు వదిలేశారు?

నాలోని తిరుగుబాటు తనమే కారణం. డిఫెన్స్‌లో బాసిజం ఎక్కువ. మనసు చంపుకోలేక వచ్చేశాను. ఐడీసీలో చేరాక.. కొన్ని కంపెనీలను బాగుచేయడానికి నన్ను నామినేట్‌ చేసేవారు. కానీ అందులోనూ లొసుగులే. బ్యాలెన్స్‌ షీట్లు అర్థం చేసుకోడానికి ఉస్మానియలో ఎంబీయే చేశాను. కానీ అదీ పనికిరానిదే. నువ్వో పరిశ్రమ పెడితే తెలుస్తుంది అనేవారు. అలాంటి చాలెంజ్‌తోనే బయటకు వచ్చాను. ఓ పెద్దాయన నన్ను బ్యాటరీ పరిశ్రమలోకి ఆహ్వానించారు. తర్వాత ఆయన 91లో నన్ను తీసి ఈగలా పక్కన పారేశారు. మా మధ్య రాజీ కోసం రాజశేఖరరెడ్డి (అప్పటికి పదవిలో లేరు) ప్రయత్నించారు. నేను కోర్టులో గెలిచినా.. ప్రయోజనం లేదు. చవగ్గా హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ ఇవ్వాలనే నేను వ్యాక్సిన్‌ తయారుచేశాను. అది ఇప్పటికీ పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతోంది. 170 దేశాల్లో తప్పనిసరి అయినా, మన దగ్గర లేదు. నాకు మొదటిసారి దీని కోసం నేషనల్‌ టెక్నాలజీ అవార్డు వచ్చింది. తర్వాత మరోసారి అవార్డు వస్తే నేను తీసుకోడానికి వెళ్లలేదు. వాజ్‌పేయి సలహాదారు సుధీంద్ర కులకర్ణి ఫోన్‌చేసి, రమ్మంటే.. నేను వెళ్లి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో వివరించాను. అప్పుడు వాజ్‌పేయిగారు నిద్రపోతున్నారు. నాకు కోపం వచ్చి.. మధ్యలో ఆపేసి, వచ్చేశాను. తర్వాత చాలా జరిగాయి. ఇటీవల గులాం నబీ ఆజాద్‌ వచ్చినప్పుడు ఆయన్ని కలిసి చెబితే.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో చేర్చారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్లు ఎందుకు విమర్శించారు? సంస్థలో మీ వాటా ఎంత?

వ్యాక్సిన్‌ ఫిజికల్‌ అప్పియరెన్స్‌ లేదన్నారు. దాన్ని సస్పెండ్‌ చేయించడం వెనక కొన్ని బహుళజాతి సంస్థల కుట్ర ఉంది. మా కంపెనీలో ఈక్విటీ తీసుకోడానికి కొన్ని బహుళజాతి సంస్థలు ప్రయత్నించాయి. మా పిల్లలతో సహా చాలామంది అమ్మేసుకున్నారు. నాదొక్కటే.. 5.9ు మిగిలింది. మిగిలినది (94ు) సనోఫీ అనే కంపెనీ వద్ద ఉంది. వాళ్లు నాకు ఎంత స్వయం ప్రతిపత్తి కల్పించినా, సీఈవోగా ఉండేందుకు ఇష్టపడట్లేదు. 2012 మార్చి నాటికి నేను సీఈవోగా ఉండకపోవచ్చు. కానీ దీనికి తప్పు మన ప్రభుత్వ విధానాలదే. 100ు ఎఫ్‌డీఐలను అనుమతించడం శుద్ధ తప్పు.


మీకు అంత ఆవేశం ఎందుకు?

మనం ఎందులోనైనా ఇమడలేకపోయినప్పుడు ఆవేశం వస్తుంది. శాంతా ప్రారంభించి 17 ఏళ్లయింది. ప్రభుత్వం నాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ, తెలియక కాలుష్యం వస్తుందని బయటకు తరిమేసి సిటీ బయట ఉండాలన్నారు. అక్కడ రోడ్డు, విద్యుత్తు, నీళ్లు లేవు. రోడ్డు నేనే వేసుకున్నాను. కరెంటూ తెప్పించుకున్నాను. నీళ్లు మాత్రం ఇవ్వలేదు. చంద్రబాబు, వైఎస్‌ ఇద్దరూ ఇప్పించలేదు. అన్ని దేశాల్లోనూ నేను, నా కుటుంబం, నా దేశం అని మూడు ఉన్నాయి. ఈ దేశంలో ‘నేనే’ అన్నంత స్వార్థం ఉంది. నేను ఇంతవరకు ఎవరికీ లంచం ఇవ్వలేదు. నేను దేశంలో లేనప్పుడు మాత్రం కొందరు తమ పనులు చేసేసుకున్నారు. శాంతా కూడా బహుశా ఇలాంటి పని చేసే ఉంటుందని అనుమానం.

హెపటైటిస్‌ గురించి చెబుతుంటే.. వాజిపేయి నిద్రపోయారు

మీరూ ఎంతో కొంత రాజీ పడ్డారన్నమాట..

తప్పట్లేదు. నా లక్ష్యం కోసం 16 వ్యాక్సిన్లు తయారుచేశాను. డబ్ల్యుహెచ్‌వో ప్రీక్వాలిఫికేషన్‌కు వెళ్లడం ఓ యజ్ఞం. నేను వెళ్లి తెచ్చుకున్నాను. ఒకాయన ఈ విషయంలో నామీద కోర్టులో కేసు వేశారు. మన దేశ ప్రమాణాలు సరిపోతాయి కదా.. అంతర్జాతీయ ప్రమాణాలు ఎందుకన్నారు. దానికి న్యాయమూర్తి నువ్వు దరఖాస్తు చేశావా అని అడిగారు.. ఈయన అవునన్నారు. దాంతో, నీకు రాలేదు కాబట్టి కేసు వేశావంటూ కొట్టేశారు. అయితే, దాని వెనక నాటి సీఎం చంద్రబాబు ప్రభావం కూడా ఆ న్యాయమూర్తి మీద ఉందని తర్వాత తెలిసింది.


దేశంలో వ్యవస్థలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఎవరు?

ముందుగా రాజకీయ నాయకులే. చదువుకుని, సంస్కారం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావట్లేదు. దాంతో రౌడీల్లాంటి వాళ్లు వచ్చేసరికి బ్యూరోక్రాట్లు వాళ్లను అడ్డం పెట్టుకుని దోచుకోవడం మొదలుపెట్టారు. దాని ఫలితమిది.


రిటైరయ్యాక ఏం చేస్తారు?

శాంత-వసంత ట్రస్టు పెట్టాను. సనోఫీ వాళ్లు వచ్చాక సీఈవోగా నెలకు రూ. 20 లక్షలిస్తున్నారు. అవన్నీ, పీఎఫ్‌తో కలిపి ట్రస్టుకు బదలాయిస్తున్నాను. ఆదివాసీలకు ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టాలనుకుంటున్నాను. కొన్ని స్కూళ్లలో లీడ్‌ ఇండియా కార్యక్రమానికి ఖర్చుపెడతాను.


సంగీత సాహిత్యాలపై అభిమానం ఎలా వచ్చింది?

భాషను నిలబెట్టుకోవల్సిన అవసరం మనకు వచ్చేసింది. మమ్మీడాడీ సంస్కృతితో భాష అడుగంటిపోతోంది. దాంతో బాధ అనిపించి, తెలుగు భాషాభిమాన సంఘంలో సభ్యుడిగా ఉన్నా. సరళమైన తెలుగు రచనలను ముందుకు తెస్తే అందరూ అభిమానంగా ముందుకొస్తారని ఆశ.


బాపు-రమణలతో సాన్నిహిత్యం ఎలా?

తెలుగు భాషపై మమకారం, వాళ్ల నుడికారంపై అభిమానం. రమణ తెలిస్తే బాపు, బాపు తెలిస్తే రమణ తెలియక తప్పదు. కోతి కొమ్మచ్చి మూడో వాల్యూమ్‌ పూర్తి చేయాలంటే, ముళ్లపూడి వారు ఓపిక తగ్గిపోయిందన్నారు. వాళ్లిద్దరూ చాలా మోసపోయారు. వాళ్ల విలువను వాళ్లు గుర్తించక, ప్రతిభను అలవోకగా ఇచ్చేశారు. కొందరు నిర్మాతలు, చానళ్లవారు, ఓ నటుడు ఆయనను దోచుకున్నారు. కొన్ని సందర్భాల్లో నెలకు ఏడువేలు తీసుకుని పనిచేశారు.


మీకు కీర్తి కండూతి ఎక్కువని మీ శ్రీమతి అంటారా?

ఎప్పుడూ అంటుంది. ప్రతి భార్యకీ భర్త మీద ప్రేమ, ఈర్ష్య ఉంటాయి. నాకు పేరు రావడం ఆమెకు సంతోషమే అయినా.. తనకు పేరు రాలేదని అసూయ. నిజానికి కుటుంబ భారం మొత్తం మోసింది ఆమే. నా షష్టిపూర్తి రోజు అందరికీ చెప్పింది.


మీ లక్ష్యం ఏంటి?

రిటైరైన తర్వాత విద్య, వైద్యం, సంగీతం.. వీటి మీద ఎక్కువగా కృషి చేయాలనుకుంటున్నాను. సంగీతంతో దేన్నయినా జయించొచ్చు. హాస్యం కూడా అంతే. ఈ రెండు ఆయుధాలతో మనిషి ప్రవృత్తిని మార్చేందుకు ప్రయత్నిస్తా. ఆత్మకథ రాయడానికి మా గురవ బావ మంచి స్ఫూర్తి కలిగించాడు.


మీకు రాజకీయాలంటే గిట్టదు కదా.. మీ పాపను ఓ నాయకుడి కుటుంబానికి ఎందుకిచ్చారు?

నేను కాదు... మా నాన్న చేశారా పని. నే దురుమల్లి రాజ్యలక్ష్మి గారు మా ఇంటికొచ్చి పిల్లను అడిగారు. నా దగ్గర డబ్బు లేదని కుదరదన్నాను. అమ్మాయి చదువుకుంటోంది, అప్పుడే వద్దని చెప్పాను. నేను వద్దని ఎంతగా అనుకున్నా, మా నాన్న మాత్రం ఒప్పుకోవాల్సిందేనని చెప్పారు. చాలా కష్టంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత వాళ్లపై నా అభిప్రాయం మారింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.