Abn logo
Oct 2 2020 @ 03:08AM

రైతులందరికీ పరిహారం అందించాలి

Kaakateeya

టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా

నష్టాల నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు


పిఠాపురం, అక్టోబరు 1: ఏలేరు వరదల కారణంగా పంటపొలాలు ముంపునకు గురైన రైతులందరికీ ఏకరానికి రూ.25 వేలు వంతున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీ కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ముంపు కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరురోజులకు పైగా ముంపులో ఉన్న పొలాల్లో పంటకు ఏమాత్రం నష్టం జరగలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారని, పంట పూర్తిగా కుళ్లిపోతేనే పరిహారం రాస్తామని వారు చెప్పడం సమంజసంగా లేదని వర్మ అన్నారు.


ఏలేరు వరదతో ముంపునకు గురైన ప్రతీ రైతుకు చెందిన పొలాలను నష్టం జాబితాలో నమోదు చేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే సమర్థంగా వ్యవహరించకపోవడంతోనే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నవీన్‌ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. అంతకు ముందుకు టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, కరణం చిన్నారావు, రెడ్డెం భాస్కరరావు, ఉలవకాయల దేవేంద్రుడు, బర్ల అప్పారావు, ఎలుబండి రాజారావు, సకుమళ్ల గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement