చేయిచ్చిన జ్యోతిరాదిత్య

ABN , First Publish Date - 2020-03-11T08:27:07+05:30 IST

కాంగ్రెస్‌తో పద్దెనిమిదేళ్ళ బంధాన్ని తెంచుకొని జ్యోతిరాదిత్య సింధియా నేడో రేపో బీజేపీలో చేరిపోబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలిసిన సందర్భంలో ఆయన ఏయే వరాలు అందుకున్నాడో తెలియదు కానీ, బీజేపీలో చేరినందుకు...

చేయిచ్చిన జ్యోతిరాదిత్య

కాంగ్రెస్‌తో పద్దెనిమిదేళ్ళ బంధాన్ని తెంచుకొని జ్యోతిరాదిత్య సింధియా నేడో రేపో బీజేపీలో చేరిపోబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలిసిన సందర్భంలో ఆయన ఏయే వరాలు అందుకున్నాడో తెలియదు కానీ, బీజేపీలో చేరినందుకు ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్రమంత్రివర్గంలో సముచిత స్థానం దక్కబోతున్నదని అంటున్నారు. కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలం కలసి నడిచి, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచి, మంత్రిపదవులు అనుభవించిన తండ్రి మాధవరావు సింధియా డెబ్బయ్‌ ఐదవ జయంతి నాడు జూనియర్‌ సింధియా తీసుకున్న ఈ నిర్ణయం ఊహకు అందనిదేమీ కాదు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠం దక్కనందుకు ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారనీ, కమలనాథ్‌, దిగ్విజయ్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నారనీ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నెరవేరకపోయినా, ఉపముఖ్యమంత్రి పదవిలో తన మనిషిని కూచోబెట్టుకోవడం, కాంగ్రెస్‌ మీద కక్ష తీర్చుకోవడం సాధ్యపడుతోంది.


జ్యోతిరాదిత్యది వెన్నుపోటు కాదు, ‘ఘర్‌వాపసీ’ అంటున్నారు ఆయన మేనత్త, మధ్యప్రదేశ్‌ బీజేపీ నాయకురాలు యశోధరా రాజే. అసంతృప్తితో ఉన్న మేనల్లుడిని తట్టిలేపి కమలం వైపు కదిలించిన ఈమె, జ్యోతిరాదిత్యలో ప్రవహిస్తున్నది రాజమాత విజయరాజె సింధియా రక్తమని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌మీద ఎంపీగా నెగ్గి, పదేళ్ళ తరువాత బీజేపీ మాతృ సంస్థ జన్‌సంఘ్‌లో చేరిపోయారు రాజమాత. ఇప్పుడు ఆమె మనుమడూ అదే పనిచేస్తున్నాడు. గ్వాలియర్‌ రాజకుటుంబీకుల్లో మాధవరావు వినా మిగతావారంతా బీజేపీలోనే ఉన్నారు. ఆయన కూడా తన రాజకీయ జీవితాన్ని జన్‌సంఘ్‌తో ఆరంభించినవారే. ఇక, వసుంధరా రాజే రెండుసార్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా, అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. సిద్ధాంతాలు, రాజకీయ కట్టుబాట్లకంటే రక్తం గొప్పదన్న వ్యాఖ్యలో అవాస్తవమేమీ లేదు. జ్యోతిరాదిత్య నిర్ణయాన్ని ఎవరికి నచ్చిన రీతిలో వారు తీసుకోవచ్చు.


ఇది ఆత్మగౌరవ పోరాటమే తప్ప, అధికార యావ కాదని అంటున్నారు సింధియా అనుచరులు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చినందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని సింధియా ఆశించారు. రాహుల్‌ తనకు మద్దతుగా నిలబడినా వృద్ధనేతలు పడనివ్వలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షపదవినైనా పంచమన్నారు సింధియా. చివరకు అది కూడా కమల్‌నాథ్‌ చేతిలోనే ఉండిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మాధవరావు సింధియా కుటుంబీకుల కంచుకోట గుణ పార్లమెంటరీ స్థానాన్ని బీజేపీ తన్నుకుపోవడం వెనుక కూడా కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ కుట్రలున్నాయని అంటారు. కనీసం రాజ్యసభకైనా తనను పంపమని సింధియా కోరుకున్నారు. నామినేషన్ల గడువు దగ్గరపడుతున్నా అధిష్ఠానం నోరుమెదపడం లేదు. పార్టీలో యువనాయకులను ప్రోత్సహిస్తే తన వారసుడికి ఎప్పటికైనా ప్రమాదమన్న సోనియా ఆలోచనాధోరణి కూడా ఈ పరిస్థితికి కారణమని ఓ విమర్శ. ఇప్పటివరకూ రాష్ట్రం నుంచి ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్‌లు చెరోస్థానాన్ని కచ్చితంగా గెలుచుకొని, ఒకదానికి మాత్రమే తీవ్రమైన పోటీ ఉన్న స్థితి. మరో మూడురోజుల్లో నామినేషన్ల గడువు ముగిసిపోబోతున్న నేపథ్యంలో సింధియా చేసిన ఈ తిరుగుబాటుతో ఆ లెక్కలు మారిపోతున్నాయి. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని కూడా దక్కించుకోబోతున్నది. అంతా అనుకున్నట్టే జరిగితే, కమల్‌నాథ్‌ను కూల్చాలన్న సిం ధియా ఆశయం కూడా నెరవేరుతుంది. కనీసం ఉపముఖ్యమంత్రి పదవైనా ఇవ్వండని అప్పట్లో బతిమాలుకున్న సింధియా ఇప్పుడు తాను ముఖ్యమంత్రి కాలేకపోయినా, తన మనిషిని ఉపముఖ్యమంత్రి చేయగలుగుతారు. సింధియా అసంతృప్తిని రెండేళ్ళుగా రాజేసి, చివరకు రాజ్యసభ సీటు విషయంలోనూ కాంగ్రెస్‌ పెద్దలు రాజీపడని ఫలితం ఇది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ కాంగ్రెస్‌ను విడిచిపోయిన సింధియా కమలనాథుల ఇంట కంటినిండా నిద్రపోగలరా, మొన్నటి ఢిల్లీ అల్లర్ల మీద కూడా నిప్పులు కురిపించిన ఆయన మెట్టినిల్లు మెచ్చుకోగల రీతిలో పరివర్తన చెందగలరా, ఇక్కడ కోల్పోయానంటున్న ఆత్మగౌరవాన్ని అక్కడ దక్కించుకోగలరా?

Updated Date - 2020-03-11T08:27:07+05:30 IST