Abn logo
Sep 17 2021 @ 23:51PM

లింగుపల్లిలో జ్యూట్‌ పరిశ్రమ మంజూరు

హైదరాబాద్‌లో జ్యూట్‌ పరిశ్రమ కంపెనీ అధికారులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌

కాళేశ్వరం ఆగ్రో పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి కేటీఆర్‌
రూ.303 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

కామారెడ్డి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి)/ సదాశివనగర్‌: రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్‌ ప్రోత్సాహంతో జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గల సదాశివనగర్‌ మండలం లింగుపల్లి గ్రామంలో జ్యూట్‌ బ్యాగులు తయారు చేసే పరిశ్రమ మంజూరైనట్లు ఎమ్మెల్యే జాజా ల సురేందర్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో రాష్ట్రంలో జ్యూట్‌ పరిశ్రమలు పెట్టడానికి మూడు కంపెనీలతో ఒప్పంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌, గోస్టర్‌ లిమిటెడ్‌, ఎంబీజీ కమాండిట్స్‌ లిమిటెడ్‌ మూడు కంపెనీలు మూడు చోట్ల జ్యూట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కామారెడ్డి జిల్లా ఎల్లా రెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌ మండలం లింగంపల్లి గ్రామ శివారుల్లో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.303 కోట్ల పెట్టుబడితో జ్యూట్‌ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చు కున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే జిల్లాకు చెందిన సుమారు 3,600 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే సురేందర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌నాయక్‌, గడిల భాస్కర్‌, సాయిలు, రాంరెడ్డి, భూంరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ సదాశివరెడ్డి, గంగాధర్‌, కమలాకర్‌రావు, బైర య్య తదితరులు పాల్గొన్నారు.