మూడు చోట్ల జూట్‌ పరిశ్రమలు

ABN , First Publish Date - 2021-09-18T08:29:20+05:30 IST

రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూడు జ్యూట్‌ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

మూడు చోట్ల జూట్‌ పరిశ్రమలు

  • కామారెడ్డి, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో స్థాపన
  • జనపనార పంట వేస్తే రైతులకూ ప్రయోజనం: కేటీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూడు జ్యూట్‌ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమలు స్థాపించే గ్లోస్తెర్‌ లిమిటెడ్‌, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌, ఎంబీజీ కమోడిటీస్‌లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సురేందర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు జ్యూట్‌ పరిశ్రమల్లేవని, ఏకకాలంలో మూడు కంపెనీలు జ్యూట్‌ పరిశ్రమలను నెలకొల్పడం వల్ల 10,400 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. గ్లోస్తెర్‌ రూ.330 కోట్లు, కాళేశ్వరం ఆగ్రో రూ.303 కోట్లు, ఎంబీజీ కమోడిటీస్‌ రూ.254 కోట్లు.. మొత్తంగా రూ.887 కోట్లతో పరిశ్రమల స్థాపనకు ముందుకురావడం సంతోషకరమన్నారు.


 జనపనార పంట రైతులకూ ఆదా య వనరుగా మారుతుందని తెలిపారు. ఇతర జిల్లాల్లో జ్యూట్‌ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా వచ్చే జ్యూట్‌ ఉత్పత్తులను తొలి ఏడాది వంద శాతం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో జ్యూట్‌ ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని, సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలను ప్రారంభించాలని కేటీఆర్‌ కోరారు. అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ప్రతి పంట సీజన్లో 20 కోట్ల వరకు గన్నీ సంచుల అవసరం ఉంటుందని, దాన్ని తీర్చే స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటుకావాలన్నారు. కాగా, భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండార్‌, ఉజ్బెకిస్థాన్‌ రాయబారి దిల్షోడ్‌ అఖతోవ్‌తో శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై వారు చర్చించారు. 

Updated Date - 2021-09-18T08:29:20+05:30 IST