జస్టిస్‌ రమణకు నేడు డాక్టరేట్‌

ABN , First Publish Date - 2022-08-20T05:41:34+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ డాక్టరేట్‌ అందుకోనున్నారు.

జస్టిస్‌ రమణకు నేడు డాక్టరేట్‌

నాటి లా విద్యార్థికి పురస్కారం అందజేయనున్న వర్సిటీ

నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవ ఏర్పాట్లు పూర్తి


పెదకాకాని/గుంటూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ డాక్టరేట్‌ అందుకోనున్నారు. నాడు న్యాయ విద్య అక్షరాలు దిద్దించిన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం శనివారం డాక్టరేట్‌ పురస్కారం అందజేయనున్నది. వర్సిటీ మొదటి బ్యాచ్‌ లా విద్యార్థిగా న్యాయ విద్యను అభ్యసించిన జస్టిస్‌ రమణ నేడు  దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు. స్నాతకోత్సం సందర్భంగా జస్టిస్‌ రమణను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించేందుకు నాగార్జున విశ్వవిద్యాలయం సిద్ధమైంది. 37, 38వ స్నాతకోత్సవాన్ని వర్సిటీలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో శనివారం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణతో పాటు గవర్నర్‌, విశ్వవిద్యాలయాల కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తదితరులు పాల్గొననున్నారు. స్నాతకోత్సవంలో 39,224 మందికి డిగ్రీ, పీజీ డిగ్రీలను, 775 మందికి పీహెచ్‌డీ డిగ్రీలను, పరిశోధకులకు, విద్యార్థులకు 228 బంగారు పతకాలను, మరో 18 మందికి బహుమతులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రసంగించనున్నారు. వర్సిటీలో ప్రీ స్నాతకోత్సవాన్ని వర్సిటీ అధికారులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌, రెక్టార్‌ ఆచార్య వరప్రసాద్‌ మూర్తి, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ తరుణ తదితరులు పాల్గొన్నారు.   జస్టిస్‌ ఎన్వీ రమణ రాక సందర్భంగా వర్సిటీ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. డైక్‌మెన్‌ ఆడిటోరియంతో పాటు వర్సటీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పలు ప్రాంతాల్లో స్వాగత కటౌట్లను, బ్యానర్లను, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. 


ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

స్నాతకోత్సవంలో జస్టిస్‌ రమణ హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.  స్నాతకోత్సవం అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జస్టిస్‌ రమణకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ కూడా హాజరు కానున్నారు. రెండు కార్యక్రమాలను అధికారులు సమష్టిగా పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ప్రభుత్వ అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, జేసీ రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీన, మంగళగిరి - తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శారదదేవి తదితరులు పాల్గొన్నారు. 


నాడు విద్యార్థిగా.. నేడు చీఫ్‌ జస్టిస్‌గా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లా కోర్సు ప్రథమ బ్యాచ్‌ విద్యార్థి జస్టిస్‌ ఎన్‌ వీ రమణ. నేడు ఆయన దేశంలోనే అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్షరాలు దిద్దిన ప్రాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. వర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు.  ఎక్కడైతే లా కోర్సు చదివారో అక్కడే ఆయన శనివారం గౌరవ డాక్టరేట్‌ని అందుకోనున్నారు. జస్టిస్‌ రమణ ఆగస్టు 27వ తేదీ 1957లో కృష్ణా జిల్లాలోని పొన్నవరంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. సైన్స్‌, లా కోర్సుల్లో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తన కుటుంబంలో తొలితరం న్యాయవాది అయ్యారు. బార్‌ కౌన్సిల్‌లో 1983 ఫిబ్రవరి 10న నమోదై ఏపీ హైకోర్టు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌, సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేశారు. భారతీయ రైల్వేలు వంటి ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సెల్‌గా వ్యవహరించారు. అలానే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. సివిల్‌, క్రిమినల్‌ విభాగాల్లో జస్టిస్‌ ఎన్‌వీ రమణ నిష్ణాతులుగా ఉన్నారు. రాజ్యాంగం, కార్మికుల హక్కులు, సర్వీసు, అంతరాష్ట్ర జల వివాదాలు, ఎన్నికలు తదితర అంశాలపై కోర్టుల్లో కేసులు వేసి వాదించారు. 2000 జూన్‌ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం పొందారు. ఆ తర్వాత స్వల్పకాలం 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. 


న్యాయవ్యవస్థలో ఎన్నో సంస్కరణలు

జస్టిన్‌ ఎన్‌ వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషీయల్‌ అకాడమి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియన్‌ లీగల్‌ సిస్టమ్‌ ఉన్నతికి కృషి చేశారు. రీజనల్‌ జ్యూడీషీయల్‌ కాన్ఫరెన్స్‌లు ప్రవేశపెట్టి అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ గురించి గట్టిగా చెప్పారు. జ్యూడీషియల్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాల్లో సమూల మార్పులు చేశారు. మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులపై అన్ని ర్యాంకుల జ్యూడీషియల్‌, పోలీసు అధికారులు, కరెక్షనల్‌ సర్వీసు అథారిటీస్‌, బాలల న్యాయ బోర్డులు, అడ్వొకేట్స్‌, ప్రాసిక్యూటర్స్‌, మహిళా సంస్థలు, సామాజిక వర్గాలు, మీడియా ప్రతినిధులతో జాయింట్‌ కాన్ఫరెన్స్‌ని నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. హైకోర్టు జడ్జీగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులను భర్తీ చేసే విషయంలో జారీ చేసిన ఆదేశాలతో క్రిమినల్‌ ట్రయల్స్‌ వేగం పెరిగింది. దేశ, విదేశాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో జస్టిస్‌ రమణ పాల్గొని కీలక ఉపన్యాసాలు చేశారు. గ్లోబల్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌పై ఆయన చేసిన సూచనలకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ బార్‌ నుంచి ప్రశంసలు వచ్చాయి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు, కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ యంత్రాంగం, టెక్నాలజీ వినియోగానికి అండగా నిలిచారు. ప్రాంతీయ భాషల్లో కోర్టుల తీర్పులు అమలు చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు.  


  

Updated Date - 2022-08-20T05:41:34+05:30 IST