న్యాయమే గెలుస్తుంది

ABN , First Publish Date - 2022-06-30T05:41:16+05:30 IST

పేద రైతుల భూములను కబ్జా చేసి జమున హేచరీస్‌ పేరుతో దుర్మార్గంగా వ్యవహరించిందని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

న్యాయమే గెలుస్తుంది
అచ్చంపేట రైతులకు పట్టాలను పంపిణీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్లు

అచ్చంపేట, హకీంపేటే ఉదాహరణ

దుర్మార్గంగా భూములను కబ్జా చేశారు

బీజేపీ జాతీయ సమావేశాల్లో రైతులు ప్రశ్నించాలి

పట్టాల పంపిణీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి


తూప్రాన్‌, జూన్‌ 29: పేద రైతుల భూములను కబ్జా చేసి జమున హేచరీస్‌ పేరుతో దుర్మార్గంగా వ్యవహరించిందని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని దానికి అచ్చంపేట, హకీంపేట గ్రామాలే ఉదాహరణ అని తెలిపారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్‌ కబ్జా చేసిన భూములకు సంబంధించి రీఅసైన్డ్‌ పట్టాలను బుధవారం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన 85 ఎకరాలను ఈటల రాజేందర్‌ ఆయన సతీమణి పేరుతో ఉన్న జమున హేచరీస్‌ కంపెనీ దుర్మార్గంగా కబ్జా చేసుకొని పెద్ద రోడ్లను వేసుకుని, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. కంపెనీ ఆక్రమించిన భూములు తమకు ఇప్పించాలని 65 మంది బాధిత రైతులు మొర పెట్టుకోవడంతో కలెక్టర్‌, ఆర్డీవో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు సర్వే నిర్వహించి వాస్తవంగా క్రయవిక్రయాలు లేని భూములుగా గుర్తించారని తెలిపారు. ఇన్నాళ్లు కంపెనీ హైకోర్టులో రిట్‌ వేసి కాలాయాపన చేసే ప్రయత్నం చేసిందన్నారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ఈ భూములను వారికి పంపిణీ చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం నియంతలాగా ప్రవర్తిస్తుందన్నారు. బీజేపేతర రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతుందని వారు మండిపడ్డారు. చల్లగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమిలేదన్నారు. బీజేపీ నాయకులు అక్రమంగా భూములు గుంజుకుంటున్నారని, హైదరాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రిని రైతులు ఈవిషయంలో ప్రశ్నించాలన్నారు.


జమున హేచరీస్‌ వేసిన రోడ్డులోనే పట్టాల పంపిణీ

ఎంపీ ప్రభాకర్‌రెడ్డి జమున హేచరీస్‌ కంపెనీ గేటు వద్దకు చేరుకుని వాహనంలో ఉండగా అదే సమయంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కంపెనీ ప్రతినిధి మరో మార్గం గుండా వెళ్లాలని సూచించడంతో వెళ్లిపోయారు. జమున హేచరీస్‌ నిర్మాణాల కోసం రోడ్డును కబ్జా చేసినట్లు తెల్చిన అధికారులు, అదే రోడ్డును కంపెనీ భూముల్లోకి వెళ్లేందుకు ఉపయోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు కంపెనీలోని ఇదే దారిపై నిలబడి 65 మంది బాధిత రైతులకు 85.19 ఎకరాల భూ పట్టాలను పంపిణీ చేశారు. ఉదయం నుంచే పట్టాల పంపిణీకి సిద్ధం చేసుకున్న అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలు రావడంతోనే కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్‌, మెదక్‌, నర్సాపూర్‌ ఆర్డీవోలు శ్యాంప్రకాశ్‌, సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షణలో తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు ఆఫీస్‌ కాపీ, అక్నాలెడ్జ్‌మెంట్‌ను అందజేశారు. పంపిణీ కార్యక్రమం ముగిసిపోగానే రెవెన్యూ అధికారులు రైతులను వెతుకుంటూ, అక్నాలెడ్జ్‌మెంట్‌లపై సంతకాలు తీసుకోవడం కనిపించింది. పట్టాల పంపిణీ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లో ఏర్పాటు చేయడం ఇప్పటివరకు జరగ్గా... కొత్తగా అసైన్డ్‌ భూముల వద్దనే పంపిణీ చేయడం విశేషం. అందులోనూ ఇంత పెద్దఎత్తున రీఅసైన్డ్‌ పట్టాల పంపిణీని చేపట్టడం ఏనాడు జరిగిన దాఖలు లేవని చెప్పొచ్చు. రైతులకు పట్టాలతో పాటు పొజిషన్‌ కూడా అప్పుడే చూపడం మరో విశేషం. 


అడుగడుగునా పోలీసులు

పట్టాల పంపిణీ  సందర్భంగా అడుగడుగునా పోలీసుల బందోబస్తు కనిపించింది. మాసాయిపేట నుంచి వెళ్లే మార్గంలో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తూప్రాన్‌ డివిజన్‌ పరిధితోపాటు, జిల్లాలోని పోలీసు బలగాలను రప్పించారు. ప్రతీ మార్గంను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. బీజేపీ నాయకులు ఆందోళనలు చేయొచ్చన్న ఉద్దేశంతో తూప్రాన్‌, మాసాయిపేట, చేగుంట మండలాల పరిధిలోని పలువురు నాయకులను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 


క్షీరాభిషేకం కోసం నిరీక్షణ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసేందకు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, రైతులు పట్టాలు పంపిణీ పూర్తి చేయగానే భోజనాలు చేశారు. అది ముగియగానే క్షీరాభిషేకం వద్దకు రావాలని రైతులకు సూచించారు. అక్కడే విలేకర్లను కూడా ఉండాలని సూచించారు. కానీ పట్టాలు పొందిన రైతులు మాత్రం అక్కడకు రాలేదు. రైతుల కోసం నిరీక్షించడంతోపాటు, ఫోన్లు చేసి రప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. చివరకు వాహనాలు పంపించి కొందరు రైతులను రప్పించి  క్షీరాభిషేకం నిర్వహించారు. 


పట్టాలు పొందిన వెంటనే దున్నకాలు 

మాసాయిపేట, జూన్‌ 29: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రైతులకు రీఅసైన్డ్‌ పట్టాలను అందజేసిన వెంటనే అచ్చంపేట, హకీంపేట రైతులు ట్రాక్టర్లతో దున్నకాలు ప్రారంభించారు. సాగుకు అనుకూలంగా ఉన్న కొంత భూమిలో అప్పటికప్పుడే దున్ని విత్తనాలను వెదజల్లారు. తమకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందించాలని, రైతుబంధుతో పాటు అన్ని పథకాలు వర్తింపజేయాలని రైతులు కోరారు. 65 మంది రైతులకు పట్టాలను పంపిణీ చేయడంపై ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాసాయిపేట యాదగిరి, దళిత సంఘం నాయకులు సోమేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, దశరథ, స్వామి, రమేష్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


ఇది సరే.. మా భూముల సమస్య తీర్చండి

తూప్రాన్‌/వెల్దుర్తి/  మాసాయిపేట, జూన్‌ 29:  అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్‌ కబ్జా చేసిన భూసమస్యలు తీర్చిన అధికారులు తమ సమస్యలనూ తీర్చాలంటూ రైతులు కోరారు. పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు తెలియగానే ధరణి భూసమస్యలున్న రైతులు కూడా దరఖాస్తులతో అక్కడకి చేరుకున్నారు. సర్వే నంబరు 62లో 3 ఎకరాల పత్రాలు పట్టుకొని జూలూరు దుర్గయ్య భార్య నిర్మల, 115 సర్వేనంబరులో 1.20 ఎకరాల పత్రాలు పట్టుకొని వెంకట్‌రెడ్డి అధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తూ వేడుకోవడం కనిపించింది. తమ అసైన్డ్‌ భూమిని ధరణిలో నమోదు చేసి రైతుబంధు వచ్చేలా చూడాలని, అధికారులు చుట్టు తిరగుతున్నా పట్టించుకోవడంలేదని రైతు నిర్మల వాపోయారు.


బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్‌

చేగుంట/వెల్దుర్తి/చిన్నశంకరంపేట,జూన్‌29: మాసాయిపేట మండలం అచ్చంపేటలో జమున హెచరీస్‌ అసైన్డ్‌ భూములు పంపిణీ కార్యక్రమం సందర్భంగా బీజేపీ నాయకులను చేగుంట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మాసాయిపేట, చేగుంట మండలాల అధ్యక్షలు వేణుగోపాల్‌, భూపాల్‌, మెదక్‌ పార్లమెంట్‌ ఎస్సీ మోర్చ జోనల్‌ ఇన్‌చార్జి కొండి స్వామి, నాయకులు గోవింద్‌, గణేష్‌, సాయిరాజ్‌, రఘువీర్‌రావు తదితర నాయకులను బుధవారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తూప్రాన్‌లో నలుగురిని అదుపులోకి తీసుకుగా చేగుంట పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. వారిని ఈటల రాజేందర్‌ ఫోన్‌ ద్వారా పరామర్శించారు. వెల్దుర్తిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ రాజకీయంగా ఎదగడం చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మారు అచ్చంపేట భూముల పంపిణీ బాగోతం తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. జూలై2న హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి అచ్చంపేట భూముల వ్యవహారాన్ని తెచ్చారని ధ్వజమెత్తారు. చిన్నశంకరంపేటలో బీజేపీ కిసాన్‌ మోర్చ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికే దాచుకోవడం, దోచుకోవడం అలవాటని విమర్శించారు. రెండు ఎకరాలు లేని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వందల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నియంత పోకడలు మానుకోవాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.





Updated Date - 2022-06-30T05:41:16+05:30 IST