చేకూరిన న్యాయం

ABN , First Publish Date - 2021-11-25T06:23:14+05:30 IST

ఒక దళిత విద్యార్థికి న్యాయం చేకూర్చే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చూపిన చొరవ అత్యంత ప్రశంసనీయమైనది.....

చేకూరిన న్యాయం

ఒక దళిత విద్యార్థికి న్యాయం చేకూర్చే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చూపిన చొరవ అత్యంత ప్రశంసనీయమైనది. జాతీయ స్థాయి పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, ఐఐటీ బాంబేలో సీటు సంపాదించగలిగిన ఆ విద్యార్థి సకాలంలో ఫీజు చెల్లించలేని కారణంగా, పడిన కష్టమంతా వృధా అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఉజ్వలమైన భవిష్యత్తు కోల్పోబోతున్న ఆ విద్యార్థి పక్షాన సుప్రీంకోర్టు నిలబడింది, తన విశేషాధికారాలను సైతం ఉపయోగించి ఆ కుర్రవాడికి న్యాయం చేసింది.


కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు చట్టానికి అతీతంగానూ ఆలోచించాలి, మానవీయ కోణంలోనూ స్పందించాలి అని ఈ కేసు సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రిన్స్ జైబీర్ సింగ్ ఎదుర్కొన్న కష్టం సామాన్యమైనది కాదు. రిజర్వుడు కేటగిరీలో 864వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ సీటు పొందాడు. అక్టోబరు 27న ఫలితం తెలిసిన వెంటనే తమ పిల్లవాడు మంచి భవిష్యత్తు దిశగా ప్రయాణం ఆరంభించినందుకు కుటుంబం పొంగిపోయింది. విద్యార్థి ప్రవేశానికి సంబంధించిన నిర్దేశిత ప్రక్రియను అతడు ఆన్‌లైన్లో పూర్తిచేశాడు. సీటును ఆమోదించడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం 29వ తేదీనే పూర్తయ్యాయి. కానీ, ఆ రోజు ఫీజు చెల్లింపునకు సరిపడినంత మొత్తం తన వద్ద లేకపోవడంతో, మర్నాడు సోదరినుంచి తన ఎకౌంట్ లోకి కొంత మొత్తం బదిలీచేయించుకున్నాడు. 30వ తేదీ రెండుమూడుసార్లు ఆన్‌లైన్ పేమెంట్‌కు ప్రయత్నించాడు. 31వ తేదీ ఉదయాన కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. అన్ని సందర్భాల్లో ఆయనకు సాంకేతిక అడ్డంకులు ఎదురైనాయి. సర్వర్ పనిచేయడం లేదనో మరొకటో ఏవో మెసేజ్‌లు వస్తూ మొత్తానికి ఫీజు చెల్లింపు సాధ్యపడకపోవడంతో ఈ విద్యార్థి సీట్ల కేటాయింపులకు సంబంధించిన అథారిటీని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించాడు. స్పందన లేకపోవడం కొంత సొమ్ము అప్పుచేసి తానే స్వయంగా పోయి సంబంధిత అధికారులను కలసి, ఫీజు స్వీకరించి, సీటు ఇవ్వమని అడిగాడు. ఈ దశలో తాము చేయగలిగింది ఏమీ లేదని వారు చేతులెత్తేశారు. బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే ఈ విద్యార్థి కొన్ని నిబంధనలను పాటించని విషయాన్ని గుర్తుచేసింది. 31వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా సమస్త ప్రక్రియా పూర్తిచేసుకోవాలనీ, తమకు ఎదురైన ఏ సమస్యనైనా ఈ గడువులోపలే విద్యార్థులు నివేదించుకోవాలనీ, ఆ  గడువు దాటితే యావత్ ప్రక్రియా ముగింపునకు వచ్చినట్టేనని రూల్ 77 చెబుతున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. ఈ నిబంధనలన్నీ సదరు విద్యార్థి ఆమోదించినవీ, అందరికీ వర్తించేవి కనుక ఒక్కరికోసం వాటిని కాదు పొమ్మనడం సరికాదని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు మాదిరిగానే సదరు విద్యార్థి పట్ల ప్రశంసాపూర్వకమైన, సానుభూతితో కూడిన వ్యాఖ్యలు చేస్తూనే ఏ ఆదేశాలూ ఇవ్వలేని స్థితిలో తాము ఉన్నామని పేర్కొంది.


తన తప్పిదం లేకపోయినా, ఐఐటీలో చదవగలిగే అవకాశాన్ని కోల్పోయాడు, ఎంతమంది అతనిలాగా ఈ సీటు సంపాదించగలరు? ప్రతిభావంతుడైన ఈ యువకుడు పదేళ్ళ తరువాత ఈ దేశ నాయకుడు కావచ్చునేమో! అని న్యాయమూర్తులు ఎంతో చక్కని వ్యాఖ్యలు చేశారు. అర్హత ఉండి కూడా సదరు విద్యార్థి అవకాశానికి దూరంకాబోతూండటం న్యాయమూర్తులకు వేదన కలిగించింది. ఏవో సాంకేతిక అడ్డంకుల వల్ల అతడు ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోవలసిందేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నది. ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే న్యాయాన్నే అపహాస్యం చేసినవాళ్ళమవుతామని అంటూ ఆ విద్యార్థికి సీటు దక్కాల్సిందేననీ, అవసరమైతే అదనంగా ఓ సీటు సృష్టించాలనీ ఆదేశించింది. ఆ దళిత విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న విశేషాధికారాలను సైతం వాడుకున్నది. నియమనిబంధనలు చూపి ఎవరో కాదూకూడదూ పొమ్మంటే తలవంచుకొని తిరిగిరాకుండా న్యాయస్థానాల్లో పోరాడినందుకు కుర్రవాడిని అభినందించాలి. సర్వవిధాలా అర్హుడైన ఓ విద్యార్థికి తగిన ప్రతిఫలం చేకూర్చి భవిష్యత్తును కాపాడినందుకు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ప్రశంసించాలి.

Updated Date - 2021-11-25T06:23:14+05:30 IST