Abn logo
Feb 3 2020 @ 18:12PM

ఎంతటి కష్టంలోనూ మనుషులుగానే ఉందాం!

నేరానికి తగిన శిక్ష ఉండాలనే మన కోర్కె న్యాయమైనదే కావచ్చు. కానీ, అదే సమయంలో వ్యక్తిగత స్పర్శ లేని, కార్పణ్యం లేని ప్రక్రియలను మనం కోరుకోవాలి. ఉరితీత ప్రత్యక్ష ప్రసారాలు కావాలని, నడిరోడ్డు మీద అమలు చేయాలని, ఎన్‌కౌంటర్లే అసలైన మార్గమని అనుకోవడం కొద్దిగా వెనుకబాటుతనం, కాసింత అనాగరికం. న్యాయ ప్రక్రియను మూకహత్యగా మలచాలనుకుంటున్నారా ఏమిటి? ఒక నేర తీవ్రతలో మనం ఆవేశపడి, చట్టంలో ఉన్న న్యాయావకాశాలను చంపుకోకూడదు. వ్యక్తిగత స్పర్శ లేని శిక్ష అమలులో మన చేతికి నెత్తురు ఎందుకు?

 

దేవుడే దిగివచ్చినా ఆ దుర్మార్గులను క్షమించేది లేదు– అన్నది నిర్భయ తల్లి ఆశాదేవి. ఏడేళ్లుగా గర్భశోకాన్ని, ధర్మాగ్రహాన్నీ మోస్తూ ఒక నిష్కృతి కోసం నిరీక్షిస్తున్న సాధారణమైన తల్లి ఆమె. ఉరికంబం ఎక్కబోతున్న దోషులను క్షమించవలసిందిగా సుప్రసిద్ధ న్యాయవాది, హక్కుల ఉద్యమకారిణి ఇందిరా జైసింగ్‌ అడిగినప్పుడు ఆమెకు కడుపుమండిపోయింది. రాజీవ్‌ హత్య కేసు దోషులకు క్షమాపణ కోరిన సోనియాగాంధీ ఉదాహరణ చెప్పినా, ఆమె ఖాతరు చేయలేదు. నిజమే, తను అన్నట్టు, తానేమీ నాయకురాలు కాదు, సామాన్యురాలు. తన బాధకు సాటి లేదు, పోటీ లేదు.

 

నిజానికి, ఇందిరా జైసింగ్‌ అలా అడిగి ఉండవలసింది కాదు. దోషులలో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తల్లి కోర్టు హాల్లో న్యాయమూర్తిని, ఆశాదేవిని కూడా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఆ తల్లి అడగడంలో అర్థం ఉన్నది. మనదేశంలో న్యాయాన్ని అమలు చేయడంలో బాధితులకు, లేదా బాధితుల కుటుంబీకులకు ప్రమేయం ఏమీ ఉండదు. కొన్ని దేశాలలో, బాధితుల బంధువులు నేరస్థుడిని క్షమించవచ్చు. ప్రాణభిక్ష పెట్టవచ్చు. కొంత పరిహారం తీసుకుని పూర్తిగా శిక్షను మాఫీ కూడా చేయించవచ్చు. అయితే, భారత్‌, అమెరికా సహా అనేక దేశాలలో బాధితుల సమీపబంధువులు చేసే క్షమాభిక్ష అభ్యర్థనలకు కొంత అనధికార విలువ ఉంటుంది.

 

క్షమాభిక్ష ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్నప్పుడు అటువంటి అభ్యర్థనలు, ఆ ఉద్యమానికి నైతిక బలాన్ని ఇస్తాయి. రాజీవ్‌ హత్యకేసులో దోషుల విషయంలో తమిళసమాజం సానుభూతితో ఉండడంతో, వారి క్షమాభిక్ష ఉద్యమానికి ప్రాధాన్యం ఏర్పడింది. సోనియాగాంధీ కుటుంబం నుంచి క్షమాభిక్ష లభించడం వారి మరణశిక్షలు యావజ్జీవంగా మారడానికి కారణమయింది. నిర్భయ ఉదంతంలోని దోషులకు సమాజంలోని ఏ సమూహం నుంచి, సంస్థల నుంచి సానుభూతి లేకపోగా, వారిపై శిక్షలు అమలుచేయడంలో జరుగుతున్న ప్రక్రియాపరమైన జాప్యం విషయంలో సమాజంలో అసహనం పెరుగుతున్నది. సమాజంలో క్రమంగా పెరుగుతున్న కాఠిన్య ధోరణులు, మీడియా బాధ్యతారాహిత్యం కూడా ఈ అసహనానికి ఆజ్యం పోస్తున్నాయి.

 

ఇందిరా జైసింగ్‌ అభ్యర్థనలోని పొరపాటును కొందరు విమర్శకులు తరువాత ప్రస్తావించారు. ఉరితీతకు గురి అయ్యే నలుగురి ప్రాణాల భారాన్ని బాధితురాలి తల్లి మీద మోపడం అన్యాయమన్నది వారి విమర్శ. శిక్షల విధింపు, అమలు విషయంలో వ్యక్తిగత బాధ్యత ఎవరిదీ లేకుండా చూడడం ఆధునిక న్యాయవ్యవస్థ విలువల్లో ఒకటి. తలారి కూడా తాను చేస్తున్న పని విధి నిర్వహణే తప్ప, ఉరి తీయబోయే వ్యక్తిపై తనకెటువంటి వ్యక్తిగత ద్వేషమూ పగా లేవని చెప్పుకుంటాడు. న్యాయమూర్తి దగ్గర నుంచి తలారి దాకా– ఎవరూ వ్యక్తిగతంగా బాధ్యులు కాని ప్రక్రియ ఇది.

 

బాధితురాలి తల్లి తనకు న్యాయమని తోచిన శిక్షను కోరుకున్నది, అదే న్యాయ ప్రక్రియలోనూ దొరికింది– అంతే తప్ప, ఆ నలుగురు శిక్షకు గురి అయినా, శిక్ష నుంచి వెసులుబాటు పొందినా అందులో ఆశాదేవి ప్రమేయమేమీ ఉండదు. ఆమెను క్షమాభిక్ష ఇవ్వవలసిందిగా కోరడం ద్వారా, ఒక నైతిక భారాన్ని ఆమె మీద మోపినట్టు అవుతుందనడంలో వాస్తవం ఉన్నది. అదే సమయంలో, ఎవరైనా సరే ఆ నలుగురికి క్షమాభిక్ష ఇవ్వవలసిందిగా కోరినంత మాత్రాన, వారు నిర్భయపై జరిగిన అత్యాచారాన్ని, హింసను సమర్థిస్తున్నట్టో, నేరస్థుల పక్షాన నిలబడ్డట్టో కాదు.

 

నిర్భయ హంతకుల విషయంలోనే కాక, గతంలో విధించిన అనేక ఉరిశిక్షల విషయంలో కూడా ఇందిరా జైసింగ్‌ క్షమాభిక్షలు కోరారు. మరణశిక్షల వల్ల నేరాలు తగ్గవని, అది మానవీయ పరిష్కారం కాదని, నేరాలకు మూలాలను కనుగొని వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని వాదించేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మరణశిక్ష కూడదు అని ఎవరైనా వాదిస్తున్నారంటే అర్థం, ఎటువంటి హీన, క్రూర, ఘోర నేరం చేసినవారి విషయంలో అయినా మరణశిక్ష కూడదు అనే. నేరం తీవ్రతను అనుసరించి మరణశిక్షను వారు అనుమతించడం ఉండదు. హక్కుల ఉద్యమంలో మరణశిక్షను వ్యతిరేకించడం ఒక ముఖ్యమైన అంశం.

 

న్యాయప్రక్రియల్లో పొరపాట్లు జరిగి అమాయకులు కూడా శిక్షలకు గురి అయ్యే అవకాశాలుంటాయన్నది– మరణశిక్ష వ్యతిరేక వాదనల్లో ఒకటి. ఇటీవలే కశ్మీర్‌ దవీందర్‌సింగ్‌ అరెస్టు తరువాత, అఫ్జల్‌గురును తిరిగి ప్రస్తావనలోకి తెస్తున్నారు. అఫ్జల్‌ గురు తన వాదనల్లో, తనను రంగంలోకి దింపింది దవీందర్‌సింగే అని చెప్పాడు. దానిని పరిగణనలోకి తీసుకుంటే, గురుకు మరణశిక్ష కంటె తక్కువ శిక్ష పడి ఉండేదేమో?–అన్న వాదన ముందుకు వస్తున్నది. మరణశిక్ష ఒకసారి అమలు అయితే, అది వెనకకు తీసుకోగలిగినది కాదు.

 

ఇటువంటి వాదనలు కాక, మౌలికంగానే, మరణశిక్షల విధింపు, అమలు నేరాలను తగ్గించడం లేదని గణాంకాలతో సహా వినిపిస్తున్న వాదనలే శక్తివంతమైనవి. సాధారణంగా శిక్షలు పడే ఖైదీలలో అధికులు నిరుపేదలు, కింది కులాల వారు ఉంటారు. అంటే, వారి సామాజికార్థిక స్థితిగతులకు, వారి మీది నేరాభియోగానికి సంబంధం ఉన్నది. మరి జరిగిన నేరంలో సమాజం, ప్రభుత్వం బాధ్యతను విస్మరించి, వ్యక్తులను మాత్రమే శిక్షించడం ఏమి సబబు? అన్నది ప్రశ్న.

 

ప్రభుత్వం కానీ, రాజ్యం కానీ అమూర్తమైనవి. వాటి శిక్షా ప్రక్రియలు కూడా అమూర్తంగా, వ్యక్తిగత స్పర్శ లేకుండా ఉంటాయి. అట్లా ఉండడమే ఆధునికం, నాగరికం. నేరకారణాలను మూలంలోనే కనుగొని, నేరం పుట్టడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రయత్నించడం బాధ్యతాయుతమైన ఆధునిక విధానం. నిర్భయ సంఘటన అనంతరం యావత్‌ సమాజం అంతా ఆగ్రహంతో ఊగిపోయి, వేదనతో ఆక్రోశించిన తరువాత ఏమి జరిగింది? నిర్భయ పేరిట వెయ్యి కోట్ల నిధులన్నారు. స్త్రీల భద్రతకు, తగినంత సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థకు, వీధి దీపాలకు వాటిని ఖర్చుపెట్టాలన్నారు. ఎక్కడ ఖర్చుపెట్టారు.

 

ఈ ఏడేళ్లలో నిర్భయ నిధులలో సగం కూడా ఖర్చుపెట్టని ప్రభుత్వాలు, టోల్‌ గేట్ల దగ్గర సరిఅయిన వీధి దీపాలు కూడా అమర్చని ప్రభుత్వాలు, తరువాత తరువాత దిశ వంటి సంఘటనలు జరగడంలో బాధ్యత వహించవా? కఠిన శిక్షలు అడుగుతున్నాం కదా, వాటిని అమలుచేయడమే సులువు అనుకుని ఎన్‌కౌంటరల్లో, ఉరిశిక్షలో మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుందామనుకుంటున్నారా?

 

మన ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా కనీసం నగరాల్లో సురక్షితంగా సంచరించగలగాలి, మన మగపిల్లలు సంస్కారులై, సమభావంతో మెలగాలని మనం కోరుకుంటాం. ఎంత చిన్న కోర్కె? కానీ చాలా పెద్ద కర్తవ్యం! నిర్భయకు న్యాయం జరగాలంటే, నిర్భయలు నిర్భయంగా సంచరించగలగాలి. దోషులను ఉరితీస్తే, ఆ భయమే నేరాన్ని నివారిస్తుందని మాత్రం భ్రమపడకూడదు. దిశ ఘటనలో ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజున కూడా అత్యాచారాలు జరిగాయి, ఆ తరువాత కూడా జరుగుతున్నాయి. నిర్భయదోషుల ఉరితీత, ఆశాదేవికి ఒక ఉపశమనం కావచ్చు.

 

న్యాయప్రక్రియకు ఒక ముగింపు కావచ్చు. నేరానికి తగిన శిక్ష ఉండాలనే మన కోర్కె న్యాయమైనదే కావచ్చు. కానీ, అదే సమయంలో వ్యక్తిగత స్పర్శ లేని, కార్పణ్యం లేని ప్రక్రియలను మనం కోరుకోవాలి. ఉరితీత ప్రత్యక్షప్రసారాలు కావాలని, నడిరోడ్డు మీద అమలుచేయాలని, ఎన్‌కౌంటర్లే అసలైన మార్గమని అనుకోవడం కొద్దిగా వెనుకబాటుతనం, కాసింత అనాగరికం. న్యాయప్రక్రియను మూకహత్యగా మలచాలనుకుంటున్నారా ఏమిటి?

 

న్యాయప్రక్రియ ఒక్కోసారి న్యాయాన్ని ఆలస్యం చేస్తుంది. బాధితులకు ఆ ఆలస్యం విషతుల్యమవుతుంది కూడా. కానీ, అమాయకులు శిక్షల పాలు కాకుండా, నిందితులకు అనేక అవకాశాలు ఇస్తున్న ప్రక్రియలను తప్పు పట్టడం పొరపాటు. మరణశిక్ష పడ్డవారికి నిరీక్షణ దుర్భర నరకం. ప్రతిప్రాణీ తన ప్రాణరక్షణ కోసం పెనుగులాడినట్టుగానే ఉరికంబానికి వెళ్లే ముందు దింపుడు కళ్లం ఆశలతో ఖైదీలు ఏవో ప్రయత్నాలు చేస్తారు.

 

వాటి మీద అసహనం ప్రదర్శించడం, ఎప్పుడెప్పుడు ఉరి అమలు అన్నట్టు ఎదురుచూడడం– మంచి ఉద్వేగాలు కావు. వాటిని పెంచే విధంగా సమాచార, ప్రసారసాధనాలు ప్రవర్తించడం కూడా సబబు కాదు. ఒక నేరతీవ్రతలో మనం ఆవేశపడి, చట్టంలో ఉన్న న్యాయావకాశాలను చంపుకోకూడదు. అంతిమంగా కఠినశిక్ష తప్పదని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఒకరోజు అటూ ఇటూ అయితే, అంత బాధ ఎందుకు? వ్యక్తిగత స్పర్శ లేని శిక్ష అమలులో మన చేతికి నెత్తురు ఎందుకు?

కె. శ్రీనివాస్


Advertisement