Abn logo
Sep 19 2021 @ 02:41AM

న్యాయం భారతీయం కావాలి

  • స్థానిక అవసరాలకు తగినట్టు కోర్టులు మారాలి
  • న్యాయవ్యవస్థలో కక్షిదారే కీలకమవ్వాలి
  • సేవల్లో సరళత, పారదర్శకత అవసరం
  • న్యాయమూర్తులు ప్రజలతో మమేకం కావాలి
  • జస్టిస్‌ శాంతన గౌడర్‌ స్మారక సభలో 
  • సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఉద్ఘాటన


న్యూఢిల్లీ, బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సామాన్యులకు న్యాయం లభించే విషయంలో ఎన్నో అడ్డంకులు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు. న్యాయస్థానాల తీరు, శైలి భారత దేశంలో ఉన్న సంక్లిష్టతలకు అనుగుణంగా లేదని, మన వ్యవస్థ, పద్ధతులు, నిబంధనలు మూలంలో వలస పాలనలో ఏర్పడినందువల్ల భారత జనాభా అవసరాలకు సమర్థవంతంగా సరిపోకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అందువల్ల మన న్యాయవ్యవస్థను తక్షణం భారతీయూకరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. శనివారం బెంగళూరులో దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ మోహన్‌ శాంతనగౌడర్‌కు నివాళులు అర్పించేందుకు కర్ణాటక రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మన సమాజంలో ఆచరణలో ఉన్న వాస్తవికతలను అన్వయించడం, మన న్యాయపంపిణీ వ్యవస్థలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా న్యాయవ్యవస్థను భారతీయూకరించాలనేది తన అభిప్రాయమని జస్టిస్‌ రమణ అన్నారు. గ్రామాల్లో కుటుంబ కలహాలకు పాల్పడేవారు కోర్టులో తాము ఇమడలేమని సాధారణంగా భావిస్తారని, కోర్టులో తమ భాష కాని ఇంగ్లిషులో జరిగే వాదనలను వారు అర్థం చేసుకోలేరని ఆయన చెప్పారు. 


తీర్పులు కూడా సుదీర్ఘంగా ఉండటంతో కక్షిదారుల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోందన్నారు. న్యాయ పంపిణీ చాలా సరళంగా, పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండడం ఎంతో కీలకమన్నారు. ‘‘ఏ న్యాయ పంపిణీ వ్యవస్థకైనా ప్రధాన కేంద్రం కక్షిదారేనన్న విషయం మరిచిపోరాదు. మధ్యవర్తిత్వం, సమన్వయం వంటి ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాన్ని ఉపయోగించడం వివాదంలో భాగస్వాములైన వారి మధ్య ఘర్షణలను నివారించడంలో ఎంతో సహాయం చేకూరుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ శాంతనగౌడర్‌ ఒక అసాధారణమైన న్యాయమూర్తి అని, ఆయనకు కూడా మన వ్యవస్థకు ఏది అవసరమో తెలుసునని, తాము తరుచూ ఈ విషయం చర్చించుకునే వారమని తెలిపారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ జస్టిస్‌ శాంతనగౌడర్‌ దేశ న్యాయవ్యవస్థకు చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఆయన లోతైన తీర్పులు ఆయన అనుభవానికి, పరిజ్ఞానానికి, వివేకానికి నిదర్శనంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అభయ శ్రీనివాస్‌ ఓకా, కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, సీఎం బసవరాజ్‌ బొమ్మై, బార్‌కౌన్సిల్‌ అధ్యక్షుడు శ్రీనివాసబాబు తదితరులు పాల్గొన్నారు.


ఉంగరం కథ.. 

జస్టిస్‌ శంతన గౌడార్‌తో ముడిపడిన ఓ సంఘటన గురించి జస్టిస్‌ రమణ వివరించారు. ‘‘ఒక రోజు నా ఉంగరంలో ఉన్న వజ్రపు రాయి పడిపోయింది. ఆ ఉంగరం సత్యసాయిబాబా ఆశీర్వాదాలతో లభించినందువల్ల దానికెంతో పవిత్రత ఉన్నది. ఈ విషయం తెలిసిన జస్టిస్‌ శంతన గౌడార్‌ మొత్తం సుప్రీంకోర్టు కారిడార్‌ అంతా తానే స్వయంగా వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు అరగంటలో దాన్ని కనిపెట్టారు’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. ఆయన హాస్య చతురత కూడా ఎంతో గొప్పదని, ఎటువంటి ఉద్వేగ పరిస్థితుల్లోనైనా ఆయన హాస్యంతో పరిస్థితి ఆహ్లాదకరంగా మారేదని చెప్పారు.  వేసవికాలం వర్షంగా.. ఆయన హాస్యం ఉన్నటుండి భూమిని ప్రక్షాళనచేసి చల్లబరిచేద ంటూ జస్టిస్‌ రమణ... అమెరికన్‌ కవి లాంగ్‌టన్‌ హ్యూజెస్‌ కవితను  ఉటంకించారు. కాగా, జస్టిస్‌ శాంతనగౌడర్‌ 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సిట్టింగ్‌ జడ్జిగా ఉండగానే లంగ్‌ ఇన్ఫెక్షన్‌కు గురై.. ఈ ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీన గుర్‌గ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందారు.


‘‘సామాన్యుడు కోర్టుల వద్దకు, అధికారులవద్దకు వెళ్లేందుకు వెనుకాడరాదు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలంటే భయపడరాదు. సత్యాన్ని చెప్పగలగాలి’’ 

- చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ