ఆ కేసులో బ్రిట్నీ స్పియర్స్‌ను గుర్తు చేసిన జస్టిస్ రమణ బెంచ్

ABN , First Publish Date - 2021-07-06T23:11:31+05:30 IST

యువతి తన ఆధ్యాత్మిక భాగస్వామి అని, ఆమె తల్లిదండ్రుల

ఆ కేసులో బ్రిట్నీ స్పియర్స్‌ను గుర్తు చేసిన జస్టిస్ రమణ బెంచ్

న్యూఢిల్లీ : ఓ యువతి తన ఆధ్యాత్మిక భాగస్వామి అని, ఆమె తల్లిదండ్రుల నుంచి ఆమెకు విముక్తి కల్పించాలని ఓ ఆధ్యాత్మిక గురువు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తల్లిదండ్రుల అక్రమ నిర్బంధంలో ఉన్న ఆమె విడుదల కోసం తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తోసిపుచ్చిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కేసును ప్రస్తావించింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. ఇది తాము జోక్యం చేసుకోదగిన కేసు కాదని తెలిపింది. ఆ యువతి మానసిక స్థితి బలహీనంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొందని తెలిపింది. 


అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (40) తన తండ్రి సంరక్షకత్వంపై కేసు దాఖలు చేశారు. తన తండ్రి, ఇతరుల సంరక్షకత్వం తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. తనకు ఇష్టం లేకపోయినా తన చేత గర్భ నిరోధక మందులు వినియోగింపజేస్తున్నారని, తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోకుండా, మరొక బిడ్డకు జన్మనివ్వకుండా  నిరోధిస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి, ఇతరుల కన్జర్వేటర్‌షిప్ నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరారు. ఇటీవలే ఆమె న్యాయమూర్తికి ఈ వివరాలన్నిటినీ ఓ స్టేట్‌మెంట్ రూపంలో చెప్పారు. వర్చువల్ విధానంలో ఈ విచారణ జరిగింది. 


ప్రస్తుత కేసులో కేరళకు చెందిన ఓ 21 ఏళ్ళ వయసుగల యువతి తన ఆధ్యాత్మిక భాగస్వామి అని 42 ఏళ్ళ వయసుగల ఓ స్పిరిట్యువల్ ప్రాక్టీషనర్ పేర్కొన్నారు. ఆమెను ఆమె తల్లిదండ్రులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ఆమెకు విముక్తి కల్పించాలని కోరారు. ఆయన దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తోసిపుచ్చడంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె తల్లిదండ్రులు చెప్తున్నదాని ప్రకారం ఆమె మానసిక స్థితి స్థిరంగా లేనట్లు తెలుస్తోంది. 


ఆధ్యాత్మిక గురువు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఆ యువతి మానసిక స్థితి బలహీనంగా ఉన్నట్లు హైకోర్టు చెప్పిందని పేర్కొంది. ఓ వారం క్రితం అమెరికాలో ఓ కేసు వచ్చిందని పేర్కొంది. అక్కడ చట్టాలు, నిబంధనలు, సంస్కృతి విభిన్నంగా ఉంటాయని తెలిపింది. అక్కడ వయోజనులు అంగీకరించకపోతే, వారికి చికిత్స చేసే ప్రశ్నే ఉండదని పేర్కొంది. 


ప్రస్తుత కేసులో యువతి తల్లిదండ్రులిద్దరూ తమ బిడ్డ ఆరోగ్యంగా లేనట్లు చెప్పారని తెలిపింది. మన దేశంలో తల్లిదండ్రెలెవరూ ఇలా చెప్పరని తెలిపింది. అంతేకాకుండా ఆ యువతిని చికిత్స కోసం పిటిషనర్ వద్దకు పంపించారని, ఆయన ఇప్పుడు తమ మధ్య సన్నిహిత సంబంధం అభివృద్ధి చెందిందని చెప్తున్నారని పేర్కొంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించబోదని పేర్కొంది. 


చాలా మంది ఆధ్యాత్మిక గురువులు, బాబాలు యువతులను ప్రభావితం చేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. కొద్ది రోజుల క్రితం కొందరు తల్లిదండ్రులు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేశారని, తమ పిల్లల జీవితాల్లో ఆధ్యాత్మిక గురువుల పాత్ర గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. ఈ ‘ఆధ్యాత్మిక గురువు’లపై ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంది. 


పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్ వాదనలు వినిపిస్తూ, యువతి హక్కులు ఉల్లంఘనకు గురికాకుండా చూడటం కోసమే ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలిపారు. ఆమెను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఉంచారని, ఆమె మేజర్ అని, తన నిర్ణయాలు తానే తీసుకునే అవకాశం ఆమెకు కల్పించాలని అన్నారు. కేరళ హైకోర్టు ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించిన తర్వాత నిర్ణయం తీసుకుందని, దానికి బదులుగా మానసిక ఆరోగ్య చట్టం, 2018 ప్రకారం మెడికల్ బోర్డుకు నివేదించి ఉండవలసిందని పేర్కొంది. జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోగల సామర్థ్యం సంబంధిత వ్యక్తికి ఉందేమో చూడటం మాత్రమే చట్టపరంగా అవసరమని తెలిపారు. ఆమె తనకు కావలసినదేమిటో కోర్టుకు తెలిపారని, అయితే తాము ఆమెను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని పితృస్వామ్య పద్ధతిలో కోర్టు చెప్పిందన్నారు. 


దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఆ యువతితో కేరళ హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు మాట్లాడారని, వారిలో ఒకరు మహిళా న్యాయమూర్తి అని గుర్తు చేసింది. 


‘‘మా సంతృప్తి కోసం ఆమెను ఒక నెల తర్వాత సంబంధిత జిల్లా జడ్జి సమక్షంలో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను మేం కోరుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆ యువతిని పరిశీలించి, ఆమెతో మాట్లాడాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడి, ఆమె సంక్షేమం గురించి తెలుసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించింది. 






Updated Date - 2021-07-06T23:11:31+05:30 IST