అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢలోని జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురుఘసీదార్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయగఢ జిల్లా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పనిచేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్‌గా పదోన్నతి పొందారు.
2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కలోజియం ఇందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర పడింది.