న్యూఢిల్లీ : బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupur Sharma) వివాదాస్పద వ్యాఖ్యల దుమారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్ట్(Supreme Court) బెంచ్(Bench) జడ్జిల్లో ఒకరైన జస్టిస్ జేబీ పార్ధివాలా(Justice JB Pardiwala) కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా (Social Media)పై కఠిన నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. అర్ధ సత్యాలు, అరకొర సమాచారం చక్కర్లు కొట్టే సోషల్ మీడియాని వినియోగిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యూజర్లలో అధికులకు చట్టాలు, ఆధారాలు, న్యాయప్రక్రియ, దాని పరిధుల గురించి అవగాహన ఉండదని అన్నారు.
మీడియా విచారణలు(మీడియా ట్రయల్స్) చట్టానికి శ్రేయస్కరం కాదని పార్ధివాలా అన్నారు. విచారణ చేపట్టేందుకు కోర్టులు ఉన్నాయి. డిజిటల్ మీడియా విచారణ చేపట్టడం అంటే న్యాయప్రక్రియలో అనవసర జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ‘లక్ష్మణ రేఖ’ను దాటినట్టే అవుతుందన్నారు. అర్థ సత్యాలు లక్ష్మణ రేఖను దాటితే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని జస్టిస్ పార్ధివాలా ఆందోళన వ్యక్తం చేశారు. సహేతుకమైన భేదాభిప్రాయం, విమర్శలను రాజ్యాంగబద్ధ కోర్టులు ఎల్లప్పుడూ ఆమోదిస్తాయి. అయితే న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులను సహించబోమని పార్ధివాలా హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వర్చువల్‌గా ఆయన మాట్లాడారు.
కోర్టు తీర్పులను నిర్మాణాత్మక రీతిలో విమర్శించకుండా.. జడ్జీలకు వ్యతిరేకంగా వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేసేందుకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానం న్యాయవ్యవస్థలకు హానికరమని, కోర్టులు, న్యాయమూర్తుల గౌరవాన్ని తగ్గిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రబలమైన శక్తి కలిగిన సోషల్ మీడియాని ఉపయోగించుకుని.. కోర్టు విచారణ ముగియకముందే నేరం లేదా అమాయకత్వం అనే భావాన్ని జనాల్లో కలగజేస్తున్నారని అన్నారు. విచారణ ముగియక ముందు, తీర్పు వెలువడక ముందే.. ఎలాంటి తీర్పు రాబోతోందనే దానిపై సమాజంలో ఒక అంచనా నెలకొంటుంది. ముఖ్యంగా సున్నితమైన కేసుల విషయంలోనూ ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశాలను పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవాలని, కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని జడ్జి పార్ధివాలా సూచించారు.
ఇవి కూడా చదవండి