శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-10-15T07:14:10+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం

శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్న ఆయన విమానాశ్రయం నుంచి నగరంలోని పద్మావతి అతిథి భవనానికి వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత సాయంత్రం 4గంటలకు తిరుచానూరుకు చేరుకున్నారు. అక్కడ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ అధికారులు, వేద పండితులు ఆయనకు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మొదట ధ్వజస్తంభానికి నమస్కరించుకుని అనంతరం సన్నిధిలోని అమ్మవారి మూలవర్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం తిరుమల బయల్దేరి వెళ్లారు. సాయంత్రం 5.30గంటలకు పద్మావతి అతిథి భవనం వద్ద ఆయనకు టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. రాత్రి 7గంటలకు జస్టిస్‌ రమణ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ధ్వజస్తంభాన్ని తాకుతూ కల్యాణమండపానికి చేరుకుని అశ్వవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తి మలయప్పస్వామిని దర్శించుకున్నారు. వాహనసేవ పూర్తయిన తర్వాత గర్భాలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ లలిత కుమారి, జస్టిస్‌ సత్యనారాయణ, ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమరాజన్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-10-15T07:14:10+05:30 IST