దాడుల నుంచి న్యాయవ్యవస్థను న్యాయవాదులే పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-11-27T07:19:31+05:30 IST

న్యాయవ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు న్యాయవాదులే ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ....

దాడుల నుంచి న్యాయవ్యవస్థను న్యాయవాదులే పరిరక్షించాలి

రాజ్యాంగ రచన వారి కృషి ఫలితమే

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీరమణ


న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు న్యాయవాదులే ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇద్దరూ ఒకే పెద్ద కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రసంగించారు. ‘‘సమాజంలో ప్రజలు నిర్వహించాల్సిన పాత్రను గుర్తుచేయాల్సిన బాధ్యత న్యాయవాదులదే. నిజాయితీ, సామాజిక అంశాలపై పరిజ్ఞానం, సామాజిక బాధ్యత, సత్ప్రవర్తన న్యాయవాదులకు అవసరం. వారే సమాజానికి నాయకులుగా తయారుకావాలి’’ అని పిలుపునిచ్చారు. న్యాయవాదులు స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారని, న్యాయవాద నేపథ్యం నుంచి వచ్చినవారే రాజ్యాంగాన్ని లిఖించారని గుర్తుచేశారు. ‘‘గాంధీ, అంబేడ్కర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, లాలా లజపతిరాయ్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ వంటి న్యాయవాదులు ప్రజల కోసం చేసిన త్యాగాలు చరిత్రాత్మకమైనవి. రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచడంలో ఏడు దశాబ్దాలుగా దోహదపడుతున్న స్వతంత్ర భారత పౌరులను మనం అభినందించాలి’’ అని రమణ ఉద్బోధించారు.  


ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

ప్రజల ప్రయోజనాలు కాపాడడమే న్యాయవ్యవస్థ విధి అని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే పవిత్రమైన బాధ్యత న్యాయవ్యవస్థకు మరొకటి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’ అన్న ప్రముఖ కవి గురజాడ అప్పారావు వాక్యాన్ని జస్టిస్‌ రమణ ఉటంకించడమే కాక గతంలో ఆ వాక్యాన్ని ప్రధాని కూడా ఉటంకించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశమంటే సరిహద్దులు కాదని, దేశమంటే ప్రజలని, అందుకే ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు.


రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు బాగా లేకపోతే అది చెడ్డగా పరిణమిస్తుందని, అదే ఎంత చెడ్డ రాజ్యాంగమైనా, అమలు చేసే వారు మంచివారైతే, సత్ప్రయోజనాలు లభిస్తాయని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అన్న మాటల్ని కూడా ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు చట్ట సభలకు, కార్యనిర్వాహక వర్గానికి జవాబుదారీ విధానాన్ని నిర్దేశించారని, కానీ న్యాయవ్యవస్థకు మాత్రం వేరే స్థాయిని కల్పించారని జస్టిస్‌ రమణ అన్నారు. రాజ్యాంగాన్ని పరిర క్షించే బాధ్యతను న్యాయవ్యవస్థకు అప్పగించారని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు, న్యాయవ్యవస్థతో కలిసి పనిచేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు.


న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని, నిర్మాణాత్మక సూచనలు చేసినంతమాత్రాన అది ఒక సంస్థ పై మరో సంస్థ దాడి చేసినట్లు చిత్రించడం సరైంది కాదన్నారు. న్యాయాధికారులు, న్యాయమూర్తులు నిర్భయంగా పనిచేసే వాతావరణం ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. న్యాయవ్యవస్థ భారతీయం కావాలని, అందుకు అనుగుణంగా విస్తృత సంస్కరణలు అవసరమని ఆయన చెప్పారు. కిందిస్థాయి న్యాయవ్యస్థకోసం ఆధునిక న్యాయ సముదాయాల్ని నిర్మించాలన్న తమ ప్రయత్నాలకు సహకరించాలని ప్రధానిని ఆయన కోరారు.

Updated Date - 2021-11-27T07:19:31+05:30 IST