‘పద్మశ్రీ’లకు జస్టిస్‌ రమణ సన్మానం

ABN , First Publish Date - 2022-03-23T07:26:24+05:30 IST

పద్మశ్రీ అందుకున్న తెలుగు ప్రముఖులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సన్మానం చేశారు. మహా సహస్రావధాని...

‘పద్మశ్రీ’లకు జస్టిస్‌ రమణ సన్మానం

న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పద్మశ్రీ అందుకున్న తెలుగు ప్రముఖులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సన్మానం చేశారు. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ మనవడిని మంగళవారం ఢిల్లీలో తన అధికారిక నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగు ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని అన్నారు. మహా సహస్రావధాని డాక్టర్‌ గరికపాటి నరసింహారావు తెలియని వారు లేరని, సుంకర వెంకట ఆదినారాయణ రావు పొలియో ఆపరేషన్‌ చేసి ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య తన కళను ఇతరులకు నేర్పించాలని కోరారు.  నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ తన పాటలతో అలరించేవారని గుర్తు చేశారు. గరికపాటికి ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది.  


మొగిలయ్యకు బీజేపీ నేతల సన్మానం

దర్శనం మొగిలయ్యకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ సన్మానించారు. గతంలో డబ్బున్న వారికే అవార్డులు దక్కేవని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు కూడా అవార్డులు దక్కుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ. లక్ష బహుమతిని వివేక్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-03-23T07:26:24+05:30 IST