జస్టిస్‌ శాంతన గౌడర్‌ సామాన్యుల న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-12-07T06:59:07+05:30 IST

దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ శాంతనగౌడర్‌ సామాన్యుల న్యాయమూర్తి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో...

జస్టిస్‌ శాంతన గౌడర్‌ సామాన్యుల న్యాయమూర్తి

సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ నివాళి


న్యూఢిల్లీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ శాంతనగౌడర్‌ సామాన్యుల న్యాయమూర్తి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్‌ శాంతనగౌడర్‌ ఆకస్మికంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన సంస్మరణార్థం సోమవారం ఫుల్‌ కోర్టు ఏర్పాటు చేసిన సభలో జస్టిస్‌ ఎన్వీ రమణ నివాళులర్పించారు. దేశం సామాన్యుల న్యాయమూర్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ గౌడర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


గిరిజనులపై ఇప్పటికీ తప్పుడు కేసులు : జస్టిస్‌ చంద్రచూడ్‌

పలుచోట్ల పోలీసులు తమ టార్గెట్లను పూర్తిచేసుకోవడానికి, పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడానికి గిరిజనులపై తప్పుడు కేసులు పెడుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విమర్శించారు. అంకుశ్‌ మారుతి వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం కేసును ఇందుకు నిదర్శనంగా ఉటంకించారు. హత్యాచారానికి సంబంధించిన ఆ కేసులో ఆరుగురు గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టగా.. శిక్షలు పడ్డ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ దళిత్‌ స్టడీ్‌సలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రచూడ్‌ ప్రసంగించారు. 


‘డిజిటల్‌’ సంస్థలపై చర్యలొద్దు: మద్రాస్‌ హైకోర్టు

భారత సమాచార సాంకేతిక చట్టం సవరణ ప్రకారం డిజిటల్‌ మీడియా సంస్థలపై కొత్త కాల్‌ కొడ్స్‌ నిబంధన ప్రకారం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకూడదని మద్రాస్‌ హైకోర్టు సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. భారత బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఫౌండేషన్‌ పిల్‌పై విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.  


‘మహా’ స్థానికానికి సుప్రీం బ్రేక్‌!

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వ్‌ స్థానాల్లో పోలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఆ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించవద్దంటూ జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.  

Updated Date - 2021-12-07T06:59:07+05:30 IST