శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-04-11T08:43:56+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం

శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సీజేగా ఎంపికైన తర్వాత తిరుమలకు రాక


తిరుమల, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో తిరుపతికి చేరుకున్న ఆయనకు జిల్లా న్యాయమూర్తి, న్యాయాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుచానూరులోని పద్మావతీ దేవిని దర్శించుకొని, సాయంత్రం తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు.


రాత్రి నైవేద్య విరామ సమయం తర్వాత జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆదివారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవనున్నారు. ఈ నెల 24న సుప్రీంకోర్టు సీజే హోదాలో మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-04-11T08:43:56+05:30 IST