Abn logo
Apr 30 2021 @ 00:18AM

‘న్యాయమే’ నడిపించాలి!

కోaర్టులు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే, పూర్వం పాలకులు తలకొట్టేసినట్టు బాధపడేవారు. పూర్తిగా కొట్టిపారేయడం దాకా అక్కరలేదు, ప్రస్తావవశంగా ప్రభుత్వంపై కానీ, ప్రభుత్వంలోని పెద్దలపై కానీ వ్యాఖ్యలు చేసినా రాజీనామాల దాకా వెళ్లేవారు. న్యాయస్థానాల దెబ్బకి ప్రభుత్వాలు పడిపోయేవి, ముఖ్యమంత్రులు మారిపోయేవారు. కాలక్రమంలో చాలా మార్పు వచ్చింది. పాలకులకు, నాయకులకు చర్మం దళసరిగా మారిపోయి, ఎంత పెద్ద మందలింపునకైనా దులిపేసుకోవడం అలవాటైపోయింది, అనేవారున్నారు. ఫలానా ప్రభుత్వమే చట్టవిరుద్ధమని చెబితే తప్ప, ఇతర అంశాలలో కోర్టుల మాటలకు మనసు పాడుచేసుకుని రాజీనామాలు చేయవలసిన అవసరమేమీ లేదు. అదొక ఆనవాయితీ, సత్సంప్రదాయమూ, పరువు కలిగినవారి స్పందన మాత్రమే తప్ప, నియమం కాదు. మరి పరువు కలిగినవారెవరు పాలకులవుతున్నారని, కోర్టుల ప్రతికూల వ్యాఖ్యలకు నొచ్చుకుంటారు? దీనికి మరొక పార్శ్వం కూడా ఉన్నది. న్యాయస్థానాలకు మాత్రం మునుపున్నంత ప్రతిష్ఠ ఉన్నదా అని ప్రశ్నించేవారూ ఉంటారు. న్యాయవ్యవస్థ నైతికత క్రమంగా పలచబడుతున్నదని, గతంలో నిష్పాక్షికతకు, నిర్భీతికి, ప్రజాపక్షపాతానికి పేరుపొందిన న్యాయమూర్తులు కొలువుదీరి ఉండేవారని, ఇప్పుడు భయమో ప్రలోభమో పైచేయిగా కనిపిస్తున్నాయని వాదిస్తున్న వారున్నారు. న్యాయవ్యవస్థను కూడా తమ అధీనంలోకి తెచ్చుకుని, సామ దాన భేద దండోపాయాలతో ప్రభుత్వాలే అదుపు చేస్తున్నాయని మరికొందరు అంటారు. ఏది ఏమయినా, విలువల పతనం అన్నది సకలరంగాలలో ఉన్నది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా ఉంటున్నాయి. 


ప్రస్తుత సందర్భం న్యాయస్థానాల సక్రియాత్మక జోక్యం అవసరమైన సందర్భం. పెద్ద విపత్తు నడుమ ఉన్నాం. దానిని అదుపు చేయడం, నిర్మూలించడం, ప్రజాజీవన వ్యవస్థలు సజావుగా సాగేట్టు చూడడం అంతా ప్రభుత్వాల చేతిలోనే ఉన్నది. ప్రతిపక్షాలు కానీ, ప్రజారంగంలో ఉన్న వివిధ సంస్థలు, ఉద్యమాలు కానీ చేయగలిగిందీ, చేస్తున్నదీ పెద్దగా కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో కలుగుతున్న అలజడిని, ఆందోళననీ పట్టించుకుని, పరిపాలనకు మార్గదర్శనం ఇచ్చే బాధ్యత న్యాయస్థానాల మీద ఉన్నది. గత ఆరేడేళ్లుగా న్యాయస్థానాలేమి చేశాయి అన్న చర్చ అనవసరం. ఇప్పుడున్నది సంక్షోభ పరిస్థితి. ఏమి చేస్తున్నారో చెప్పండి అని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసి అడుగుతున్నాయి. మీ ఆలోచనలేమిటో, ఏమి చేయదలచుకున్నారో చెప్పమంటున్నాయి. కొరతలు ఏర్పడిన అత్యవసరాల విషయంలో తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నిస్తున్నాయి. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి, చివరి ఒకటి రెండు రోజులలో కేంద్రాన్ని ప్రశ్నించారు, పరిస్థితిని మొత్తంగా న్యాయస్థానం పర్యవేక్షణ కిందికి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఆ చర్య పర్యవసానాలేమిటో తెలియదు కానీ, అదొక విశేషమైన పరిణామం. మరణాలు ఇట్లా సాగుతూ ఉంటే, కట్టడికి ఏమి చేస్తారు చెప్పండి అని తెలంగాణ హైకోర్టు గడువు పెట్టి మరీ అడిగింది. ఫలితంగా రాత్రి కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ కాలం ముగిసిపోతున్న సమయాన మళ్లీ హైకోర్టు అడిగింది. ఇంకా ఒక రోజున్నది కదా నిర్ణయం తీసుకోవడానికి అని ప్రభుత్వ పక్షం వాదించగా, చివరి నిమిషంలోనే ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు ఎదురుప్రశ్న వేసింది. 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడం మీద పెద్ద పురాణం రాయవచ్చు. నిర్ణయాలు ఒకరే తీసుకోవాలని, ఆ ఒక్కరూ తాను ముఖ్యమనుకున్న వాటిపైనే దృష్టి పెడతారనీ చెప్పుకుంటారు. ఫలితంగా ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే కదులుతూ ఉంటుంది. మహిళా కమిషన్‌ను చాలాకాలం నియమించలేదు. కారణం తెలియదు. కోర్టు చెప్పవలసి వచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో సహా, అనేకమంది సభ్యుల పదవీకాలం ముగిసింది. నిర్ణయం తీసుకోరు. కోర్టు ఇప్పుడు ఆదేశించింది. ఇట్లా చెప్పించుకోవడం చిన్నతనంగా అనిపించదా అని సందేహం కలుగుతుంది. అదొక రాచపద్ధతి. ఇక కోర్టుల దాకా వెళ్లలేని అనేక నిర్ణయాల సంగతి ఏమిటి? అవి అట్లా ఎడతెగని నిరీక్షణలో ఉంటాయి. కోర్టుల చేతిలో మొట్టికాయలు తినడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగాకులు ఎక్కువ చదివింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో జరిగిన రభస తెలిసిందే. పాపం, ఆయన తన విధులు తాను నిర్వహించడానికి కూడా తరచు కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది. కోర్టులు ఎన్ని అక్షింతలు వేసినా ఆ ప్రభుత్వం ఆశీర్వాదాలుగానే పరిగణించింది, న్యాయమూర్తుల పైనే ఎదురు అభియోగాలు మోపిన సాహసం చేసింది. 


ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రభుత్వాలు సరైన విజ్ఞతతో, సకాలంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. అనేక రాష్ట్రాలలో లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కట్టడులకు విముఖంగా ఉంటున్నాయి. కనీసం, జనసమ్మర్ద ప్రదేశాలలో అయినా ఆంక్షలకు సిద్ధంగా ఉండడం లేదు. కేంద్రం మార్గదర్శకాల పరిధిలోకి రాకుండా ఉండడానికి, లెక్కలను తగ్గించి మరీ చూపుతున్నారు. ఆర్థిక కార్యకలాపాల నిరోధం వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, విపత్తు వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని, ఇతర నష్టాలను ఆర్థిక కష్టనష్టాలతో బేరీజు వేసుకుని చూడాలి. తక్కువ నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే, న్యాయస్థానాలు కాక మరెవరు మార్గదర్శనం చేయగలరు?

Advertisement