27 ఏళ్ల తర్వాత రేప్‌ బాధితురాలికి న్యాయం!

ABN , First Publish Date - 2022-08-05T06:49:45+05:30 IST

న్యాయం జరగడం ఆలస్యమైతే కావొచ్చు గానీ నిజాయితీగా పోరాడితే కచ్చితంగా లభిస్తుందేనుకు ఈ ఘటనే ఉదాహరణ. యూపీలో ఇద్దరి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఆమెకు 27 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. విశేషం ఏమింటటే..

27 ఏళ్ల తర్వాత రేప్‌ బాధితురాలికి న్యాయం!

1994లో ఇద్దరు సోదరుల ఘోరం.. గర్భం దాల్చి బిడ్డకు జన్మ

తల్లి దీనగాథ తెలిసి ఏడాదిగా కుమారుడి న్యాయపోరాటం 

యూపీలో ఘటన.. నిందితుల్లో ఒకరి అరెస్ట్‌.. మరొకరి కోసం వేట 


బరేలీ, ఆగస్టు 4: న్యాయం జరగడం ఆలస్యమైతే కావొచ్చు గానీ నిజాయితీగా పోరాడితే కచ్చితంగా లభిస్తుందేనుకు ఈ ఘటనే ఉదాహరణ. యూపీలో ఇద్దరి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఆమెకు 27 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. విశేషం ఏమింటటే.. న్యాయం కోసం పోరాడలేని స్థితిలో ఇన్నాళ్లుగా ఆమె అశక్తురాలిగా మిగిలిపోతే.. ఆ అత్యాచారం ఫలితంగా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడై.. తల్లికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆమెకు న్యాయం జరిగేందుకు పోరాడాడు! ఫలితం.. నాడు ఆమెపై ఘోరానికి పాల్పడ్డ నిందితులు ఇక ఊచలు లెక్కించనున్నారు! ఇప్పటికే ఒకరు అరెస్టవ్వగా, మరొకరి కోసం పోలీసులు వేటాడుతున్నారు. బాధితురాలు షాజహాన్‌పూర్‌ వాస్తవ్యురాలు. 1994లో ఆమెపై అత్యాచారం జరిగింది. అప్పటికి ఆమెకు 12 ఏళ్లే. అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ రజీ, మహమ్మద్‌ నఖీహసన్‌ అనే సోదరులు కలిసి ఆమెపై ఘోరానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో.. అబార్షన్‌ చేయించుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అయినా ఆమె వెరవకుండా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనపై జరిగిన అన్యాయంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయలేకపోయింది.


ప్రస్తుతం ఆమె కుమారుడి వయసు 27 ఏళ్లు. తల్లి దీనగాథను తెలుసుకున్న ఆ యువకుడు గత ఏడాది మార్చి 4న పోలీసు కేసు పెట్టించాడు. నిందితుల పేర్లు, చిరునామాకు సంబంధించి పూర్తివివరాలేవీ లేకున్నా.. బాధితురాలి ఫిర్యాదులో నిజాయతీని గుర్తించి.. ఆమెకు న్యాయం చేసేందుకు పోలీసులు నడుం కట్టారు. ప్రత్యే బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. తమకేపాపం తెలియదంటూ వారు బుకాయించడంతో డీఎన్‌ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.


గత ఏప్రిల్‌లో ఫలితాలొచ్చాయి. బాధితురాలి కుమారుడికి తండ్రి రజీ అని నిర్ధారణ జరిగింది. నిందితులను అరెస్టు చేసేందుకు తమ బృందాలు వెళ్లగా ఇద్దరూ పతా లేకుండా పోయారు. సాంకేతిక ఆధారాలతో రజీ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. నఖీహసన్‌ ఒడిసాలో ఉన్నట్లు గుర్తించామని.. అతణ్ని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.  

Updated Date - 2022-08-05T06:49:45+05:30 IST