న్యాయసేవలు అందరికీ అందాలి

ABN , First Publish Date - 2022-06-27T05:08:03+05:30 IST

న్యాయసేవలు అందరికీ అందాలని కేంద్రన్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌ అన్నారు.

న్యాయసేవలు అందరికీ అందాలి

కేంద్ర సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌ 

తిరుపతి (కల్చరల్‌)  జూన్‌ 26 : న్యాయసేవలు అందరికీ అందాలని  కేంద్రన్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌ అన్నారు. ఆదివారం మహతి వేదికలో సౌదాన్‌ సేవా సంస్థను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూత్వరగా న్యాయసహాయం పొందినపుడే బాధితులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇప్పటి పరిస్ధితుల్లో మన దేశంలో న్యాయం అందరికీ అందడంలేదన్నారు. అందుకు సౌదాన్‌ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకురావడం హర్షణీయ మన్నారు.  పేరుకుపోతున్న కోర్టు కేసుల సంఖ్య తగ్గించడానికి మధ్యవర్తిత్వం ఎంతో అవసరమన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌ అదాలత్‌ సేవలను కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. అంతకు ముందు ఏపీ విశ్రాత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పౌరులకు ప్రభుత్వసేవలు సక్రమంగా అందేలా సౌదాన్‌ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల సేవా లోపాలను గుర్తించి సేవ చేయాలన్నారు.  అధర్మ శక్తులు పాలనాధికారం చేపట్టకుండా ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సౌదాన్‌ సంస్థ వ్యవస్థాపకులు మధుసూదన్‌  జల్లి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ రచయిత త్రిపురనేని వరప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది అచ్చన్నలు ప్రసంగించారు. అనంతరం తమ తమ రంగంలో విశిష్టసేవలందించిన స్విమ్స్‌ పూర్వ డైరెక్టర్‌ ఆచార్య  సుబ్రమణ్యం, మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ త్రిపురసుందరి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చల్లా ప్రభావతి, ఆర్గానిక్‌ వ్యవసాయదారుడు ఎస్‌.సుబ్బరామిరెడ్డి, క్రీడా నిపుణుడు ఆంజనేయులునాయుడులను సౌదాన్‌ తరపున సత్కరించారు. ఈ క్యాక్రమానికి ఆకాశవాణి పూర్వ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  


Updated Date - 2022-06-27T05:08:03+05:30 IST